AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pondicherry Crisis: పుదుచ్ఛేరిలో రాజకీయ సంక్షోభం.. ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక రహస్యమిదే!

ఎన్నికలకు ముందు పుదుచ్ఛేరిలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. రాహుల్ గాంధీ రాకకు ముందు రాజీనామాలు ఊపందుకోవడానికి కారణమేంటి?

Pondicherry Crisis: పుదుచ్ఛేరిలో రాజకీయ సంక్షోభం.. ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక రహస్యమిదే!
Rajesh Sharma
|

Updated on: Feb 16, 2021 | 3:42 PM

Share

Severe political crisis in Pondicherry: మూడు ప్రధాన రాష్ట్రాలతో కలిసి త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతున్న పుదుచ్ఛేరి (పాండిచ్ఛేరి) రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. ఎన్నికలు మరో రెండు నెలలుండగా.. అక్కడ వరుస రాజీనామాలతో అధికార పక్షం విలవిల లాడుతోంది. అధినేత రాహుల్ గాంధీ త్వరలో విజిటింగ్‌కు రాబోతున్న తరుణంలో రాజీనామాల పర్వం ఊపందుకుంది. దాంతో ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎన్నికలకు ముందే పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అయితే ఈ పరిస్థితి కారణమేంటి? ఇదిపుడు రాజకీయ పరిశీలకులను తమ బుర్రకు పదును పెట్టేలా చేస్తోంది.

మన దేశంలో అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో పుద్దుచ్ఛేరి ఒకటి. తమిళనాడులో అంతర్భాగంగా కనిపించే ఈ ఫ్రెంచ్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ నడి మధ్యన సముద్ర తీరంలో వున్న యానాం కూడా అంతర్భాగం. మొత్తం 33 మంది శాసన సభ్యులు గల పుదుచ్ఛేరి అసెంబ్లీలో ప్రజల ద్వారా ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 30. మరో ముగ్గురు నామినేటెడ్ సభ్యులు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 15 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్నించి నారాయణ స్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పార్టీ బలం మెజారిటీ మార్కుకు దిగువన చేరింది. దాంతో పుదుచ్చేరి రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కాగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ నేతలతో చర్చించేందుకు.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ బుధవారం (ఫిబ్రవరి 17న) పుదుచ్చేరికి రానున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం విశేషం.

నమశివాయం, తిప్పయింజన్‌ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు జనవరి 25న రాజీనామా చేయగా.. మిగితా ఇద్దరిలో ఒకరు సోమవారం రాత్రి యానాం శాసనసభ్యుడు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు రాజీనామా చేశారు. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 16న) కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి నారాయణస్వామికి సన్నిహితుడైన జాన్ కుమార్ 2019లో కామరాజ్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో గెలిచారు. ఇప్పటివరకు రాజీనామా చేసిన వారిలో జాన్ కుమార్ నాలుగోవారు. 33 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో మూడు నామినేటెడ్‌ స్థానాలు. 2016లో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్‌ 15 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు నలుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 11కి చేరింది. దాంతో నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడినట్లయింది.

ఇదిలా వుంటే ఏపీ సముద్ర తీరంలో వుండే యానాం నుంచి దాదాపు పాతికేళ్ళుగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లాడి కృష్ణారావు గత నెలలో (జనవరి 7న) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దానిని ముఖ్యమంత్రి ఇంకా ఆమోదించకముందే సోమవారం నాడు తన శాసనసభ్యత్వానికి కూడా మల్లాడి రాజీనామా లేఖను సమర్పించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పుదుచ్చేరి శాసన సభాపతి వీపీ శివకొలుందుకు పంపారు. మల్లాడి వ్యూహం అంతుచిక్కక కాంగ్రెస్ పెద్దలు బుర్ర గోక్కుంటున్నట్లు సమాచారం. నిజానికి జనవరి ఆరవ తేదీన మల్లాడి కృష్ణారావు ఉత్తమ శాసనసభ్యునిగా రజతోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ మర్నాడే అంటే జనవరి 7వ తేదీనే జనవరి 7న ఆరోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ సంబంధిత పత్రాలను సీఎంకు అందజేశారు. ఇంతవరకు ఆ రాజీనామాకు సీఎం ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో తన శాసన సభ్యత్వానికి సైతం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

నిజానికి అత్తెసరు మెజారిటీతో 2016 నుంచి ప్రభుత్వంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి నారాయణస్వామి గత రెండు, మూడేళ్ళుగా అనేక ఇబ్బందులతో నెట్టుకొస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ వచ్చినప్పట్నించి నారాయణ స్వామికి పక్కలో బల్లెంలా మారారు. దాంతో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్‌ల మధ్య తరచూ చికాకులు తలెత్తాయి. కరోనా కాలంలోను వీరిద్దరి మధ్య చికాకుల పర్వం కొనసాగింది. పలు మార్లు గవర్నర్ హోదాలో కిరణ్ బేడీ అధికారులతో రివ్యూలు నిర్వహించి, కోవిడ్ పరిస్థితులను స్వయంగా సమీక్షించడం ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఇరకాటంగా మారింది.

తమిళనాడు, బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతో కలిసి పుదుచ్ఛేరి కూడా మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ చాలా వేగంగా పావులు కదుపుతోంది. తాజాగా పుదుచ్ఛేరిలో ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక కమలనాథుల హస్తం వుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం తమిళనాడులో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఫళనిస్వామి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

అదే సమయంలో భౌగోళికంగా తమిళనాడులో అంతర్భాగంగా వున్న పుదుచ్ఛేరిపై కూడా బీజేపీ దృష్టి సారించింది. అందువల్లే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజీనామాల పర్వం ఇలాగే కొనసాగితే.. పుదుచ్ఛేరిలో ప్రభుత్వం కూలిపోయి కేంద్ర పాలన అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. దాంతో నారాయణ స్వామి ఆధ్వర్యంలో కాకుండా కేంద్ర పాలన రూపంలో గవర్నర్ కిరణ్ బేడీ పెద్దరికంలో ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. ఏది ఏమైనా మరి కొన్ని రోజులు పుదుచ్ఛేరిలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: టీవీ, ఫ్రిడ్జ్ వున్నాయా? అయితే మీ తెల్ల రేషన్ కార్డు హుళక్కే..!

Also Read: యూటీ ప్రకటనతో రాజకీయ కలకలం.. అసదుద్దీన్ వ్యూహమేంటి?

Also Read: ప్రజల మీదికి ఖైదీల అస్త్రం.. సైన్యం నిర్ణయంపై ఆగ్రహం