Sleep Deprivation: నిద్రలేమితో బాధపడుతున్నారా? ఐతే త్వరలోనే మీ కంటి చూపు హుష్!
కంటికి సరిపడా నిద్రలేకపోతే కళ్లు అసౌకర్యానికి గురై, కంటి ఉపరితాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి అంధత్వానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. తాజా అధ్యయనాలు దీనిని ..
Sleep deprivation can cause blindness, Study reveals: ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరినీ వేదించే సాధారణ ఆరోగ్య సమస్యల్లో నిద్రలేమి (Sleep deficiency) కూడా ఒకటి. సరిపడినంత నిద్రలేకపోతే అది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా కంటికి సరిపడా నిద్రలేకపోతే కళ్లు అసౌకర్యానికి గురై, కంటి ఉపరితాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి అంధత్వానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. తాజా అధ్యయనాలు దీనిని ధృవీకరిస్తున్నాయి. స్టెమ్ సెల్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నిద్ర లేమి కారణంగా కార్నియల్ ఎపిథీలియల్ ప్రొజెనిటర్ సెల్ టియర్ ఫిల్మ్‌లోని ఉపరితలాన్ని దెబ్బతీస్తుందని వెల్లడించింది.
నిజానికి మనుషులతో సహా సర్వ ప్రాణులకు నిద్ర అనేది ఒక ప్రాథమిక అవసరం. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరిపడినంత నిద్ర అవసరం. ఐతే ప్రస్తుత జీవనశైలి, పని ఒత్తిడి, కాలుష్యం మూలంగా నిద్ర లేమి సమస్య ప్రతి ఒక్కరినీ వేదిస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు 10 నుంచి 20 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత అధికశాతం నిద్రలేమితో సతమతమవుతున్నారు. 2019 ఫిట్‌బిట్ సర్వే ప్రకారం.. జపాన్ (సగటున రాత్రి 7 గంటల పాటు నిద్ర ప్రాతిపదికన) తర్వాత నిద్ర లేమి అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది. డాక్టర్ ష్రాఫ్స్ ఛారిటీ ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ వీరేందర్ ఎస్ సాంగ్వాన్ ఏం చెబుతున్నారంటే..
సరిపడ నిద్ర లేకపోవడం వల్ల వచ్చే కొన్ని రకాల సమస్యల్లో కళ్ళు పొడిబారడం ముఖ్యమైనది. ఇది కంటి పరిశుభ్రతను (eye hygiene) కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కళ్ళు ఎర్రగా మారిపోతాయి. కళ్ళు సున్నతత్వం కోల్పోయి.. గరుకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే పొడి కళ్లవల్ల కనుగుడ్డు ఎర్రబడి కంటి చూపుపై ప్రభావం చూపుతుంది.
నిద్ర లేమి, కంటి సమస్యలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర సమయం దాపురించగానే దానంతట అది నిద్రకుపక్రమించేలా మనిషి శరీరం రూపొందించబడింది. నిద్ర సమయంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఈ సమయంలో మెదడు శరీరంలోని వివిధ అవయవాలను బాగు రిపేర్ చేయడంపై ఫోకస్ పెడుతుంది. కొన్ని కణజాలాల పునరుత్పత్తి కూడా నిద్ర సమయంలోనే జరుగుతుంది. ఐతే నిద్ర టైంలో మేల్కొని ఉంటే శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇది కంటిలోని కార్నియాతో సహా కళ్ళలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుందని డాక్టర్ సాంగ్వాన్ చెబుతున్నారు.
వెంట్రుకలు, గోర్లు పెరిగినట్లే, కార్నియా ఉపరితలంపై ట్రాన్‌స్పరెంట్ స్టెమ్ సెల్స్ (transparent stem cells) ఉంటాయి. ఇవి కళ్లను పరిరక్షించి, కంటిచూపును కాపాడటానికి ఉపయోగపడతాయి. ప్రతి నాలుగు నుంచి ఆరు వారాలకు ఈ కణాలు చనిపోయి, వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తాయి. ఇదొక డైనమిక్ ప్రక్రియ. ఈ కణాల ఉత్పత్తి సక్రమంగాలేకపోతే కార్నియా సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల, కంటి ఉపరితలం దెబ్బతింటుంది.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి సరిగ్గా నిద్రపోకపోతే లేదా నిద్రకు అంతరాయం కలిగితే, ప్రాథమికంగా అతని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఆక్సిజన్‌కు బదులుగా, కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకోవడంలా ఉంటుంది. అందుకే కాంటాక్ట్ లెన్స్ వాడేవారిని నిద్రపోయే ముందు లెన్స్‌ని తీసివేసి నిద్రపోవాలని వైద్యులు తరచూ చెబుతుంటారు. ఎందుకంటే ఈ టైంలో కళ్ళు ఊపిరి పీల్చుకోవల్సి ఉంటుంది.
సాధారణంగా శరీరంలోని అన్ని ఫంక్షనల్ అవయవాలు ఒత్తిడిలో కూడా పనిచేయగలగడానికి కొంత శక్తి నిల్వచేయబడి ఉంటుంది. ఐతే దీనికి కూడా పరిమితి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఈ రిజర్వ్ సామర్థ్యం వారివారి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, రోజులో ఎంత సమయం నిద్రపోతాడు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణ కార్నియాలో రక్తనాళాలు ఉండవు. కార్నియా దెబ్బతింటుందని చెప్పడానికి మొదటి సంకేతం కనుగుడ్డుపై రక్త నాళాలు కనిపించడం. ఫలితంగా కళ్ళు ఎర్రగా మారుతాయి. ఇలా జరిగినప్పుడు చూపు అస్పష్టంగా మారుతుంది. కార్నియాలో రాపిడి ఉన్నట్లు తెలుస్తుంది. కళ్ళు ఎర్రబడటం, వెలుగును చూడలేకపోవడం, రెప్పవేయడంలో ఇబ్బంది.. వంటి లక్షణాలు సాధారణగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం చేయించుకోకపోతే కంటి చూపు కోల్పోయే ప్రమాదముంది.
అనేక నివేదికలు, అధ్యయనాలు ప్రతి వ్యక్తికి నిర్దిష్ట స్థాయిలో నిద్ర అవసరమని చెబుతున్నప్పటికీ.. కనీసం 7 – 8 గంటల నిద్ర మాత్రం తప్పనిసరి. ఎందుకంటే ప్రతిఒక్కరి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. కొంతమందికి ఐదు నుంచి ఆరు గంటల నిద్ర అవసరం, మరికొందరికి ఏడు నుంచి ఎనిమిది గంటలు అవసరం. ఇది ఒక వ్యక్తి నిద్ర నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా దీనిని REM sleep అని పిలుస్తారు. ఇది నిద్ర పరిమాణానికి సంబంధించినది కాదు.. నిద్ర నాణ్యతకు సంబంధించినదని డాక్టర్ సాంగ్వాన్ తెలిపారు.
అంటే.. శరీర శక్తి, ఆరోగ్యం నిద్ర స్థాయిలపై ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఇకనైనా నిద్రకు కేటాయంచవల్సిన సమయంలో అస్సలు రాజీ పడకండి..!
Also Read: