NEET PG 2022: నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ!
నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా అభ్యర్ధనను శుక్రవారం (మే 13) సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారంగానే మే 21న పరీక్ష యథాతదంగా ఆఫ్‌లైన్ విధానంలో జరగనుంది. నీట్ పీజీ అడ్మిట్ కార్డ్‌లు..
NEET PG 2022 Not Postponed: నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్ ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌పై జరిపిన విచారణలో శుక్రవారం (మే 13) అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువడింది. ఈ విచారణలో నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా అభ్యర్ధనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారంగానే మే 21న పరీక్ష యథాతదంగా ఆఫ్‌లైన్ విధానంలో జరగనుంది. నీట్ పీజీ అడ్మిట్ కార్డ్‌లు మే 16న అధికారిక వెబ్‌సైట్ nbe.edu.inలో విడుదల కానున్నాయి. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ విధంగా తీర్పును వెలువరించింది..
‘నీట్ పరీక్షను వాయిదా వేయడం అంత మంచి ఆలోచన కాదు. ఎందుకంటే ఈ పరీక్ష కొంతమంది విద్యార్థులకు మాత్రమే ఇబ్బందిని కలిగిస్తుందని వ్యాఖ్యానించారు. నీట్ పీజీ 2022కి సిద్ధమైన విద్యార్థులే అధికంగా ఉన్నారని, అది వారిలో గందరగోళాన్ని, అనిశ్చితిని సృష్టిస్తుందని బెంచ్ వ్యాఖ్యానించింది. పరీక్షకు సిద్ధమైన 2 లక్షల మంది అభ్యర్థులతో పాటు రోగుల చికిత్సపై కూడా ప్రభావం పడుతుందని’ ధర్మాసనం పేర్కొంది. నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ జరుగుతున్నందున, ఈ సమయంలో నీట్ పీజీ 2022 పరీక్ష జరపవద్దని, వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఈ మేరకు ధర్మాసనం తోసిపుచ్చింది.
BREAKING| Supreme Court dismisses plea to postpone NEET-PG 2022 scheduled for May 21, saying postponement will create chaos and uncertainty and will impact patient care and will cause prejudice to over 2 lakh students who have prepared.#NEETPG2022
— Live Law (@LiveLawIndia) May 13, 2022
కాగా నీట్ పీజీ-2021 పరీక్ష నిర్వహణ, ప్రవేశాల ప్రక్రియ చాలా ఆలస్యంగా జరిగిందని, మిగిలిపోయిన సీట్లకు కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉందని, అందువల్ల మే 21న జరగనున్న నీట్ పీజీ-2022 పరీక్షను కనీసం 8 నుండి 10 వారాల పాటు వాయిదా వేయాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కౌన్సెలింగ్‌లో సీటు దక్కని విద్యార్థులు నీట్ పీజీ-2022 పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుకల్పించాలని, కొవిడ్ సమయంలో సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో వైద్య విద్యార్థులు చివరి ఏడాదిలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడంలోనూ జాప్యం జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దీనిపై విద్యార్ధులు గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు. చాలా మంది నీట్ పీజీ విద్యార్ధులు సోషల్ మీడియాలో కూడా హల్‌చల్ చేశారు. నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియాకు లేఖలు కూడా రాశారు. ఐతే అధికారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు పరీక్ష వాయిదా పిటీషన్‌ను కొట్టివేసింది.
Also Read: