AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీరియడ్స్ సమస్యలపై మౌనం వీడాలి.. నెలసరి చుట్టూ ఉన్న కీలక అపోహలు ఇవే

పీరియడ్స్‌ మహిళల ఆరోగ్యం, మానసిక స్థితి, పని సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని అనేక పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయినప్పటికీ దేశంలోని అనేక కార్యాలయాల్లో దీనికి సంబంధించిన ప్రత్యేక విధానాలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. మహిళలకు కేవలం రుతుస్రావ సెలవులు ఇవ్వడమే సరిపోదు. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్ల పారవేతకు ప్రత్యేక డబ్బాలు, అవసరమైన విరామ సమయం, నెలసరి నొప్పి వంటి అంశాలపై బహిరంగంగా చర్చించుకునే వాతావరణం కూడా ఉండాలి.

పీరియడ్స్ సమస్యలపై మౌనం వీడాలి.. నెలసరి చుట్టూ ఉన్న కీలక అపోహలు ఇవే
Menstrual Health
Srilakshmi C
|

Updated on: Jun 04, 2026 | 8:22 PM

Share

పీరియడ్స్‌ ఆరోగ్యంపై సులభ్ ఇంటర్నేషనల్ జాతీయ డైరెక్టర్ నీరజ భట్నాగర్ మాట్లాడుతూ.. భారతీయ కార్యాలయాల్లో ఇప్పటికీ పురుషాధిక్య పని సంస్కృతి కొనసాగుతోందని పేర్కొన్నారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్యాలయ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. రుతుస్రావ సెలవులను కూడా ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పరిగణించాలని సూచించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గీతా లూత్రా మాట్లాడుతూ.. మహిళలకు అందుబాటులో ఉండే శుభ్రమైన మరుగుదొడ్లు ప్రాథమిక హక్కుగా చూడాలని పేర్కొన్నారు. ఇతర వైద్య లేదా వ్యక్తిగత సెలవుల మాదిరిగానే రుతుస్రావ సెలవులను కూడా అధికారికంగా గుర్తించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

నెలసరి చుట్టూ ఉన్న సామాజిక అపోహలు తొలగాలి

మాక్స్ హెల్త్‌కేర్ ఐవీఎఫ్ విభాగాధిపతి డాక్టర్ సుర్వీన్ ఘుమన్ సింధు మాట్లాడుతూ.. పీరియడ్స్‌ ఇప్పటికీ సమాజంలో సంకోచంతో మాట్లాడే అంశంగా మిగిలిపోయిందన్నారు. దీనికి అధికారిక గుర్తింపు, విధానపరమైన మద్దతు లభిస్తే మహిళలు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా వ్యక్తపరచగలరని చెప్పారు. పీరియడ్స్‌ పూర్తిగా సహజమైన శారీరక ప్రక్రియ అని, దానిపై ఎలాంటి పక్షపాతం లేదా అపోహలు లేకుండా సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

విధానాల అమలే ప్రధాన సవాల్

నీతి ఆయోగ్ మాజీ డైరెక్టర్ ఊర్వశి ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళల కోసం రూపొందించే అనేక విధానాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాలను దుర్వినియోగం చేస్తారనే అపోహల కారణంగా కొన్ని విధానాల అమలు సరిగా జరగడం లేదన్నారు. ఈ ఆలోచనా విధానంలో మార్పు రావడం అత్యంత అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. హ్యూమన్ క్యాపిటల్ కన్సల్టెంట్ డాక్టర్ కిరణ్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. పీరియడ్స్‌ ఆరోగ్యం గురించి ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విద్యాసంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు కలిసి ఈ అంశంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ అనుభవం

ప్రముఖ పర్వతారోహకురాలు సునీతా సింగ్ చోకన్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే సమయంలో నెలసరి వచ్చినప్పటికీ తాను వెనుకడుగు వేయలేదని తెలిపారు. ఆక్సిజన్ కొరత, తీవ్ర వాతావరణ పరిస్థితులు, శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ లక్ష్యాన్ని సాధించగలిగానని చెప్పారు. మహిళలకు తగిన మద్దతు, సదుపాయాలు కల్పిస్తే వారు ఎలాంటి సవాళ్లనైనా అధిగమించి విజయాలు సాధించగలరనే విషయానికి ఇది నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

సమాజంలో మార్పు అవసరం

పాఠశాలల్లో మరుగుదొడ్ల కొరత నుంచి కార్యాలయాల్లో నెలసరి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వరకు మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వ విధానాలు, సంస్థాగత మద్దతు, సామాజిక దృక్పథంలో మార్పు ఒకేసారి రావాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేశారు. పీరియడ్స్‌ ఆరోగ్యాన్ని మహిళల సంక్షేమం, ఉద్యోగ అవకాశాలు, సామాజిక సమానత్వంతో ముడిపెట్టి చూడాల్సిన సమయం ఆసన్నమైందని, దీనిపై సమగ్ర చర్యలు తీసుకుంటేనే మహిళలు మరింత గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన జీవితం గడపగలరని వారు అభిప్రాయపడ్డారు.

Follow Us