తెలివైన తీర్పు కథ.. అత్యాశకు గుణపాఠం ఎలా చెప్పొచ్చో తెలుసుకోండి
Moral Story in Telugu: అత్యాశ ఎంత ప్రమాదకరమో, నిజమైన న్యాయం ఎలా ఉండాలో తెలియజేసే 'తెలివైన తీర్పు' నీతి కథ పిల్లలకు చిన్నతనం నుంచి విలువలతో ఎలా బతకాలో నేర్పడానికి ఉపయోగపడుతుంది. న్యాయం, సమతుల్యత, తెలివితేటల విలువను చాటిచెప్పే ఈ నీతి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

భీమునిపట్నం అనే గ్రామంలో సజితానంద వర్మ అనే తెలివైన పెద్దమనిషి ఉండేవాడు. గ్రామ ప్రజల సమస్యలను న్యాయంగా పరిష్కరించడం, వివాదాలకు సరైన తీర్పు చెప్పడం వల్ల ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా ఆయన దగ్గరకే వెళ్లేవారు. ఒకరోజు సజితానంద వర్మ మార్కెట్‌కు వెళ్తుండగా రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతూ కనిపించారు. ఒకరు గ్రామంలోని ధనిక భూస్వామి కాగా, మరొకరు పేద కూలీ. కూలీ తన భుజంపై బియ్యం బస్తా మోసుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా బస్తా జారి కిందపడింది. దురదృష్టవశాత్తూ అక్కడే తిరుగుతున్న భూస్వామి కోడి మీద బస్తా పడటంతో ఆ కోడి చనిపోయింది.
ఎక్కువ మంది చదివినది: ‘1000లో నుంచి 100 తీసేస్తే ఎంత ఉంటుంది?’ మీ IQకి అగ్నిపరీక్ష.. లాజిక్ కనిపెట్టగలరా ..
దాంతో భూస్వామి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. “నువ్వు నా కోడిని చంపేశావు. అది సాధారణ కోడి కాదు. ఏడాది మొత్తం ఎన్నో గుడ్లు పెట్టేది. నాకు జరిగిన నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయాలి. కోడి ధరతో పాటు అది ఏడాది రోజుల్లో పెట్టే గుడ్ల విలువ కూడా చెల్లించాలి” అని డిమాండ్ చేశాడు. అయితే పేద కూలీ ఎంతో వినయంగా.. “అయ్యా, ఇది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ప్రమాదవశాత్తూ జరిగింది. నేను చాలా పేదవాడిని. కోడి ధర చెల్లించగలను కానీ ఏడాది గుడ్ల విలువ చెల్లించే స్థోమత లేదు” అని వేడుకున్నాడు.
ఇద్దరి వాదనలు విన్న గ్రామస్తులు సజితానంద వర్మ దగ్గరకు సమస్యను తీసుకువచ్చారు. అందరూ ఆయన ఎలాంటి తీర్పు చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూశారు. కొద్దిసేపు ఆలోచించిన సజితానంద వర్మ మొదట భూస్వామి వాదనకు అనుకూలంగా మాట్లాడాడు. “కూలీ కోడి వల్ల వచ్చే ఏడాది లాభాన్ని కూడా చెల్లించాలి” అని చెప్పాడు. అది విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. పేద కూలీ మరింత నిరాశ చెందాడు. కానీ వెంటనే సజితానంద వర్మ తన తీర్పులోని అసలు తెలివిని బయటపెట్టాడు. ఆయన భూస్వామిని చూసి “నీ కోడి ఏడాది పాటు గుడ్లు పెట్టి నీకు లాభం తెచ్చేదని అంటున్నావు. అయితే ఆ ఏడాది మొత్తం కోడికి ఆహారం పెట్టాలి కదా! చెప్పు.. ఏడాదికి ఆ కోడి ఎంత ఆహారం తింటుంది?” అని అడిగాడు. భూస్వామి “సుమారు రెండు బస్తాల ధాన్యం తింటుంది” అని చెప్పాడు.
ఎక్కువ మంది చదివినది: విక్రమార్కుడు – బేతాళుడు కథ.. మీ తెలివి తేటలకు పదును బెట్టే చిక్కుప్రశ్న
అప్పుడు సజితానంద వర్మ చిరునవ్వుతో, “అయితే కూలీ నీ కోడి భవిష్యత్ లాభం చెల్లించాలంటే, నువ్వూ కోడి భవిష్యత్ ఖర్చును కూలీకి చెల్లించాలి. రెండు బస్తాల ధాన్యం విలువను ముందుగా అతనికి ఇవ్వాలి” అని అన్నాడు. ఈ మాటలు విన్న భూస్వామికి తన తప్పు అర్థమైంది. కేవలం కోడి చనిపోయినందుకు కాకుండా భవిష్యత్ లాభాల పేరుతో అధిక డబ్బు వసూలు చేయాలని ప్రయత్నించడం సరైంది కాదని గ్రహించాడు. వెంటనే తన డిమాండ్‌ను వెనక్కి తీసుకుని, కోడి ధర కూడా అవసరం లేదని చెప్పాడు. గ్రామస్తులు సజితానంద వర్మ తెలివైన తీర్పును మెచ్చుకున్నారు. పేద కూలీ కూడా ఆనందపడ్డాడు.
ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. న్యాయం అంటే కేవలం ఒకరి లాభాన్ని మాత్రమే చూడటం కాదు. లాభం ఉంటే దానికి సంబంధించిన ఖర్చు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నిజమైన తెలివి, న్యాయం సమతుల్యతలోనే ఉంటాయి. ఈ కథలో సజితానంద వర్మ ఇచ్చిన తీర్పు తెలివితేటలు, న్యాయబుద్ధి, సమానత్వానికి అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది.
నీతి: అత్యాశ అనర్థాలకు దారి తీస్తుంది. ఇతరులను అన్యాయంగా దోపిడీ చేయాలనుకునేవారు చివరికి కష్టాలు కొనితెచ్చుకుంటారు.
