తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. చిన్నారులకు షుగర్ వ్యాధి ముప్పు.. ఇలా చేస్తే వెంటనే..
గతంలో పెద్దవారికి మాత్రమే వచ్చే డయాబెటిస్, ఇప్పుడు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నారులను వెంటాడుతోంది. కేవలం 8-10 ఏళ్ల పిల్లల్లోనూ ఊబకాయం, డయాబెటిస్ లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్క్రీన్ టైమ్ పెరుగుదల, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం, నిద్రలేమి, జన్యువులు దీనికి ప్రధాన కారణాలు. సరైన చర్యలతో ఈ ప్రమాదకర పరిస్థితిని నివారించవచ్చు.

గతంలో 40 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వస్తుందనుకున్న డయాబెటిస్ ఇప్పుడు దేశంలోని చిన్నారులను వణికిస్తోంది. షాకింగ్ ఏమిటంటే.. కేవలం 8, 9, 10 ఏళ్ల పిల్లల్లోనూ ఊబకాయం, ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు బయటపడడం ఆందోళన కలిగిస్తుంది. మారిన మన జీవనశైలి, ఫుడ్ అలవాట్లు, ఎక్కువ స్క్రీన్ సమయం, మన జన్యువులే ఈ పెను మార్పుకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతీయ పిల్లలు ఎదుర్కొంటున్న ఈ షుగర్ సునామీపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
బాల్య ఊబకాయం ఎందుకు పెరుగుతోంది?
సీనియర్ శిశువైద్యుడు డాక్టర్ రవి మాలిక్ ప్రకారం.. గత దశాబ్దంలో భారతీయ పిల్లల జీవన విధానం పూర్తిగా మారిపోయింది. తక్కువ శారీరక శ్రమ, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరగడం, ఎక్కువ స్క్రీన్ సమయం – ఇవన్నీ కలిసి ఈ ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతున్నాయి.
విషపూరిత కేలరీల దాడి
ఎక్కువ కేలరీలు
నేటి పిల్లలు ఎక్కువగా ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర కలిపిన డ్రింక్స్ తీసుకుంటున్నారు. వీటిలో పోషకాలు తక్కువ, కేలరీలు చాలా ఎక్కువ. ఇలాంటి ఆహారం శరీరంలో చక్కెరను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకుండా చేస్తుంది.
స్క్రీన్ టైమ్
వీడియో గేమ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు, మొబైల్ రీల్స్ చూడటం వంటి వాటికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఆరుబయట ఆడుకునే సమయం పూర్తిగా తగ్గిపోయింది. శారీరక శ్రమ తగ్గితే, జీవక్రియ దెబ్బతిని, బరువు త్వరగా పెరుగుతారు.
సరైన నిద్ర లేకపోవడం
పిల్లలకు ఆరోగ్యకరమైన నిద్ర చాలా అవసరం. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం లేదా నిద్ర పట్టకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది పొట్ట చుట్టూ కొవ్వును పెంచి, చిన్న వయసులోనే షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
జన్యువులు
మన భారతీయ పిల్లలకు సహజంగానే పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతంది. పాశ్చాత్య పిల్లలతో పోలిస్తే, తక్కువ బరువు పెరిగినా కూడా వీరికి ఇన్సులిన్ నిరోధకత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న బరువు పెరుగుదల కూడా ప్రీడయాబెటిస్‌కు దారితీయవచ్చు.
ఒత్తిడికి ఆహారం
చదువుల ఒత్తిడి, తల్లిదండ్రులతో గడిపే సమయం తగ్గడం వంటి కారణాల వల్ల చాలా మంది పిల్లలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి చక్కెర లేదా ఉప్పగా ఉండే స్నాక్స్ తింటూ ఉంటారు.
హెచ్చరిక సంకేతాలు
మీ పిల్లల్లో అధిక బరువు ఉంటే లేదా ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి:
- తరచుగా అలిసిపోవడం.
- ముఖ్యంగా బొడ్డు చుట్టూ కొవ్వు పెరగడం.
- మెడ, చంకల చుట్టూ చర్మం నల్లగా మారడం.
- మామూలు కంటే ఎక్కువ దాహం లేదా ఆకలి వేయడం.
- ఆటల పట్ల ఆసక్తి తగ్గడం.
తీసుకోవాల్సిన చర్యలు
ఈ ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలి.
క్రీడలు తప్పనిసరి: రోజుకు కనీసం 45 నుంచి 60 నిమిషాలు ఆరుబయట పరిగెత్తడం, సైకిల్ తొక్కడం, ఆటలు ఆడటం తప్పనిసరి చేయాలి.
ప్రాసెస్ ఫుడ్: చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్లకు బదులు పండ్లు, నట్స్, పెరుగు, ఇంట్లో చేసిన ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలి.
డ్రింక్స్: సోడా, ఎనర్జ డ్రింక్స్ వంటి వాటికి బదులు నీరు మాత్రమే తాగేలా ప్రోత్సహించాలి.
సరైన నిద్ర: రాత్రి 10 గంటల కంటే ముందే పిల్లలు పడుకునేలా కచ్చితమైన సమయాన్ని పాటించాలి.
క్రమం తప్పకుండా పిల్లల బరువు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్‌ను పరీక్షించుకోవాలి.
సరైన ఆహారం, చురుకైన జీవనం, సకాలంలో వైద్య సలహాతో ఈ సమస్యను పరిష్కరించవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. నేటి ఆరోగ్యకరమైన అలవాట్లే రేపటి తరానికి మంచి భవిష్యత్తును అందిస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




