శరీరంలో ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు ఫెయిలయ్యే ప్రమాదం! ఎందుకో తెలుసా?
Kidney Health: మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. ఇది నిరంతరం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలో అనేక రకాల వ్యర్థాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఆ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వడపోసి బయటకు పంపే బాధ్యతను మూత్రపిండాలు తీసుకుంటాయి.

శరీరం నుండి బయటకు వెళ్లాల్సిన వ్యర్థాలలో యూరిక్ యాసిడ్ ఒకటి. ఇది మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్ అనే ప్రోటీన్ల విచ్ఛిన్నం వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా ఇది రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా వడపోతకు గురై మూత్రం రూపంలో బయటకు పోతుంది. ఒకవేళ మూత్రపిండాలు దీనిని సరిగ్గా వడపోయలేకపోయినా లేదా శరీరంలో ఇది మోతాదుకు మించి ఉత్పత్తి అయినా ప్రమాదం తప్పదు. దీనిని వైద్య పరిభాషలో హైపర్‌యూరిసెమియా అని పిలుస్తారు. ఈ పరిస్థితిని ముందే గుర్తించకపోతే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. అందులో మొదటిది కీళ్ల నొప్పి. దీనిని చాలామంది సాధారణ నొప్పులుగా భావించి పొరపడుతుంటారు. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అవి చిన్న చిన్న స్ఫటికాలుగా మారి కీళ్లలో పేరుకుపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి, వాపు కనిపిస్తాయి. దీనినే గౌట్ అని అంటారు. ఈ నొప్పి ఎక్కువగా కాలి బొటనవేలు దగ్గర మొదలై క్రమంగా మోకాలు, చీలమండలం, చేతి వేళ్లకు వ్యాపిస్తుంది. నడిచేటప్పుడు లేదా కీళ్లను కదిలించేటప్పుడు ఎర్రగా కందిపోయి విపరీతమైన మంటగా అనిపిస్తుంది.
మరో ముఖ్యమైన లక్షణం మూత్ర విసర్జనలో మార్పులు. మూత్రపిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేయడంలో విఫలమైనప్పుడు మూత్రనాళంలో ఈ స్ఫటికాలు అడ్డుపడతాయి. దీనివల్ల మూత్రం పోసేటప్పుడు విపరీతమైన మంట, నొప్పి కలుగుతాయి. తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం కూడా దీని సంకేతమే. కొన్ని సందర్భాల్లో ఇవి రాళ్లుగా మారి మూత్రపిండాల్లో విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీసే తొలి మెట్టు కావచ్చు.
యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల కీళ్ల నొప్పులతో పాటు విపరీతమైన అలసట, బలహీనత ఆవహిస్తాయి. మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందదు. దీనికి తోడు చర్మంపై దద్దుర్లు రావడం లేదా దురద కలగడం వంటివి జరుగుతాయి. స్ఫటికాలు చర్మం కింద పేరుకుపోవడం వల్ల మోచేతులు, చెవుల వెనుక భాగంలో చిన్న చిన్న గడ్డలు లాంటివి కనిపిస్తాయి. దీర్ఘకాలికంగా ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే రక్తపోటు పెరిగి కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. సరైన ఆహార నియమాలు పాటిస్తూ ప్రాణాపాయం నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి.
