AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gut Health: కడుపు బాగోలేకపోతే.. మీ జీవితమే ఖల్లాస్.. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి విలువైన సలహాలు మీ కోసం

ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. డి. నాగేశ్వర్ రెడ్డి గారు ప్రేగు ఆరోగ్యంపై వినూత్న పరిశోధనలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. మన మొత్తం శరీర ఆరోగ్యం, గుండె, మెదడు పనితీరు పేగులలోని బ్యాక్టీరియాపై ఆధారపడి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు ప్రేగులోని సూక్ష్మజీవుల సమతుల్యతను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించారు.

Gut Health: కడుపు బాగోలేకపోతే.. మీ జీవితమే ఖల్లాస్.. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి విలువైన సలహాలు మీ కోసం
Gut Health
Ram Naramaneni
|

Updated on: Jan 10, 2026 | 4:38 PM

Share

డా. డి. నాగేశ్వర్ రెడ్డి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత.  40 ఏళ్లుగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ రంగంలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఆయన గట్ హెల్త్ గురించి అందిస్తున్న సలహాలు, సూచలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంతకుముందు ప్రజలు హృదయ సంబంధిత లేదా నాడీ సంబంధిత వ్యాధులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. గుండెపోటు లేదా మెదడు స్ట్రోక్‌ల వల్ల సంభవించే మరణాల గురించి ఎక్కువగా ఆందోళన చెందేవారు. ప్రేగుల పనితీరు కేవలం ఆహారాన్ని జీర్ణం చేసి, పోషకాలను గ్రహించడానికే పరిమితమని భావించేవారు. అయితే, గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అధునాతన పరిశోధనలు ఈ అవగాహనను పూర్తిగా మార్చేశాయి. మన శరీర ఆరోగ్యం మొత్తం ప్రేగులలోని సూక్ష్మజీవులే కంట్రోల్ చేస్తున్నాయని ఇప్పుడు స్పష్టమైంది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి రెడ్డి వివరించినట్లుగా ప్రేగులు.. గుండె, మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. మన ప్రేగులలో మిలియన్ల, బిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలు, వైరస్‌లు వంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. మన శరీరంలోని మానవ కణాల సంఖ్య కంటే పది రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా కణాలు ఉంటాయని, మన శరీరంలోని జన్యువుల కంటే పది వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా జన్యువులు ఉంటాయని ఆయన తెలిపారు. మనం తీసుకున్న ఆహారాన్ని ఈ బ్యాక్టీరియా జీర్ణం చేసి, దాని నుంచి శక్తిని, మన శరీరానికి అవసరమైన అనేక రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

ఉదాహరణకు, చికెన్ నుంచి డోపమైన్, బాదం నుంచి థైరోసిన్ వంటి రసాయనాలను బ్యాక్టీరియా ఉత్పత్తి చేసి, మెదడు, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ బ్యాక్టీరియాలలో మంచివి, చెడువి అనే రకాలు ఉంటాయి. దాదాపు 1000 జాతులు ప్రేగులలో నివసిస్తాయి, ఇందులో 900 మంచి జాతులు, 100 చెడు జాతులు ఉండవచ్చు. ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, అది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. డాక్టర్ రెడ్డి ఎలుకలపై చేసిన ప్రయోగాలను ఉదహరించారు. మభావంగా ఉన్న ఎలుకలకు చురుకైన ఎలుకల నుంచి సేకరించిన బ్యాక్టీరియాను ఇచ్చినప్పుడు అవి చురుకుగా మారాయి. అదేవిధంగా స్థూలకాయం,  సన్నబడటం కూడా బ్యాక్టీరియా వల్లే ప్రభావితమవుతుందని పరిశోధనలు నిరూపించాయి. స్థూలకాయంతో బాధపడుతున్న వ్యక్తి నుంచి బ్యాక్టీరియాను స్వీకరించిన ఒక రోగి బరువు పెరిగినట్లు ఒక కోర్టు కేసు ఉదాహరణను ఆయన వివరించారు.

కొన్ని బ్యాక్టీరియాలు టిఎంఎఓ (TMAO) అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసి గుండె సమస్యలకు కారణమవుతాయి. బ్యాక్టీరియాను మార్చడం ద్వారా గుండె సమస్యలను తగ్గించవచ్చని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి రెడ్డి బృందం మైక్రోబయోమ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి, మెటాజెనోమిక్స్ అనే కొత్త సాంకేతికతను ఉపయోగించి 1000 బ్యాక్టీరియా జాతుల జన్యు విశ్లేషణను నిర్వహిస్తోంది. ఇది వ్యక్తులలోని బ్యాక్టీరియా అసమతుల్యతను గుర్తించడానికి, ఊబకాయం లేదా జీర్ణ సమస్యలకు కారణాలను కనుగొనడానికి సహాయపడుతుంది. హెమ్స్లీ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పెద్ద పరిశోధన ప్రాజెక్టులు జరుగుతున్నాయి.

బ్యాక్టీరియా కూర్పు భౌగోళిక ప్రాంతాలను బట్టి మారుతుందని డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశంలోని బ్యాక్టీరియా, అమెరికాలోని బ్యాక్టీరియా వేరుగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలు, నగర ప్రాంతాల మధ్య కూడా తేడాలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు తమ ఐసోలేటెడ్ జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యకరమైన, ప్రాచీన బ్యాక్టీరియాను కలిగి ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి. పట్టణీకరణ, ఫాస్ట్ ఫుడ్ వినియోగం వల్ల ప్రేగులలోని బ్యాక్టీరియా కూర్పు మారిపోయి, పాశ్చాత్య దేశాలలో సాధారణంగా కనిపించే అల్సరేటివ్ కొలైటిస్ వంటి కొత్త వ్యాధులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని 20 గ్రామాలను దత్తత తీసుకొని వారి ప్రేగు బ్యాక్టీరియాపై జరుపుతున్న పరిశోధనలు, ఈ మార్పులను మరింత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ప్రేగు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మన మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత కీలకం అని డాక్టర్ రెడ్డి నొక్కిచెప్పారు.

డా. రెడ్డి ప్రకారం గట్ ఆరోగ్యం కోసం..  సహజసిద్ధమైన ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవడం మంచిది. పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఇతర ఆహార పదార్థాలలో సహజంగా ప్రోబయోటిక్స్ ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటివి గట్ బ్యాక్టీరియాకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఒత్తిడి కూడా గట్ బ్యాక్టీరియాను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి వల్ల బ్యాక్టీరియాలో మార్పులు వచ్చి, తిరిగి ఆ మార్పులు ఒత్తిడికి దారితీసే ఒక విషవలయం ఏర్పడవచ్చు. అలాగే, గట్ బ్యాక్టీరియాలో కొంతవరకు జన్యుపరమైన ప్రభావం కూడా ఉంటుందని, తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తుందని ఆయన తెలిపారు.