ఆరో రోజుకు చేరిన టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె.. కార్మికులకు, నిర్మాతలకు పెరిగిన అగాధం..
వేతనాల పెంపు దగ్గర మొదలైంది సంక్షోభం. ఇప్పుడు కొత్తకొత్త కండిషన్లు పుట్టుకొచ్చి, ఇగో సమస్యలు మొదలై, చిక్కుప్రశ్నగా మారిందిప్పుడు. మొన్న లేబర్ కమిషన్‌తో రెండు వర్గాలూ కూర్చుని మాట్లాడినా సంధి కుదరలేదు. 30 శాతం జీతం పెంపు దగ్గర పడ్డ మెలిక మరింత బిగుసుకుంది.

వేతనాల పెంపు దగ్గర మొదలైంది సంక్షోభం. ఇప్పుడు కొత్తకొత్త కండిషన్లు పుట్టుకొచ్చి, ఇగో సమస్యలు మొదలై, చిక్కుప్రశ్నగా మారిందిప్పుడు. మొన్న లేబర్ కమిషన్‌తో రెండు వర్గాలూ కూర్చుని మాట్లాడినా సంధి కుదరలేదు. 30 శాతం జీతం పెంపు దగ్గర పడ్డ మెలిక మరింత బిగుసుకుంది. నాలుగోరోజే ముగుస్తుందనుకున్న సమ్మె కొనసాగింది. డ్యాన్సర్స్-ఫైటర్స్ విషయంలో లోకల్ వాళ్లను ఎంతమందిని తీసుకోవాలి, నాన్ లోకల్ వాళ్లను ఎంతమందిని తీసుకోవాలి అనే రేషియో లెక్క కూడా కొలిక్కి రాలేదు. ఇవన్నీ తేలిన తర్వాతే వేతనాల పెంపు సంగతి ఆలోచిస్తామంటోంది ఫిలిమ్ ఛాంబర్. ఈ పరిస్థితుల్లో “నో మోర్ షూటింగ్స్”.. అంటూ ఫిలిమ్ ఛాంబర్ బ్లాంకెట్ ఆర్డరిచ్చేసింది. ఇకపై ఎలాంటి షూటింగ్‌లు జరపకూడదని, అవుట్ డోర్ యూనిట్లు, స్టూడియోల్లో షూటింగ్‌లకు అనుమతి ఇవ్వకూడదని ఛాంబర్ నుంచి హుకుం జారీ అయింది.
ఫిల్మ్‌ఛాంబర్.. ఫిల్మ్ ఫెడరేషన్‌తో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్‌కి ముందు తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు సినీ కార్మిక నాయకుడు వల్లభనేని అనిల్. తమ డిమాండ్లపై సానుకూల స్పందన లేకపోతే.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు కూడా ఇదే చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చించి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తామంటున్నారు. టాలీవుడ్‌లో ఇవాళ కార్మికులు, నిర్మాతలు వేర్వేరుగా సమావేశం అవుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై వీరు ఎలా ముందుకెళతారు? ఇప్పటిదాకా పీటముడిగా మారిన అంశాలపై ఎవరు వెనక్కు తగ్గుతారు? ఎవరు బెట్టువీడతారు? మొత్తమ్మీద కోట్లాది రూపాయల బిజినెస్ జరిగే తెలుగు సినీ పరిశ్రమలో ఈ సంక్షోభం, ఈ ప్రతిష్ఠంభన ఎప్పుడు తొలగుతుంది? ఇదే అసలు పాయింట్.




