Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ ఎదుట హాజరైన డైరెక్టర్ పూరి జగన్నాధ్..
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీ కొత్త మలుపుకు దారి తీసింది. మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన అభియోగాల కింద 12 మంది సినీ ప్రముఖలకు..
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి సినీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆయన్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పూరి జగన్నాధ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించనున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్‌తో పాటు ఆయన కుమారుడు ఆకాష్, సీఏ(చార్టెడ్ అకౌంటెట్) ఈడీ కార్యాలయానికి వచ్చారు.
ఇదిలా ఉండగా.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు గప్‌చుప్ అయిపోయిందనుకుంటున్న తరుణంలో ఈడీ సడన్ ఎంట్రీ ఇచ్చింది. మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన అభియోగాల కింద ఇప్పటికే సినీ రంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటిసులు జారీ చేసింది. అందులో భాగంగానే ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారించనుంది.
అయితే ఇక్కడొక ట్విస్ట్ ఏంటంటే.. తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచారించని ఇద్దరికి నోటీసులివ్వడమే కొత్త అనుమానాలకు తెరలేపింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్ లేరు. కానీ, వీళ్లిద్దరికి కూడా ఈడీ నోటీసులిచ్చింది. అదే, ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈడీ ఎంట్రీ వెనుక పెద్ద కథే ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈడీ కూడా పెద్దపెద్ద లీకులు కూడా వదులుతోంది. మెయిన్‌గా మనీలాండరింగ్‌పైనే ఈడీ దృష్టిపెట్టింది.
విదేశాలకు పెద్దఎత్తున నిధులను మళ్లించి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు సిట్ అండ్ ఈడీ దర్యాప్తులో తేలింది. మరి, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తే, దానికి డబ్బులు కట్టిందెవరు? ఎవరి ఖాతా నుంచి లావాదేవీలు జరిగాయి? ఈ కోణంలోనే ఈడీ ఇంటరాగేషన్ సాగుతోంది. ఈ రోజు డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ను విచారించనున్న ఈడీ.. సెప్టెంబర్ 2న ఛార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న దగ్గుబాటి రానా, 9న రవితేజ, అదే రోజున రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ ముందు హాజరుకానున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 13న నవదీప్, ఎఫ్-క్లబ్ జీఎం…. 15న ముమైత్ ఖాన్, 17న తనీష్, 20న నందు… చివరిగా సెప్టెంబర్ 22న తరుణ్ ఈడీ ముందుకు రానున్నారు.