Tollywood: అయ్యో..తన సినిమా ప్రివ్యూ చూస్తూనే కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్..సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మరణ వార్త మర్చిపోకముందే టాలీవుడ్ లో మరొకరు కన్నుమూశారు. అది కూడా ఎవరూ ఊహించని పరిస్థితుల్లో. పలువురు ప్రముఖులు, సినీ అభిమానులు ఈ టాలీవుడ్ డైరెక్టర్ కు నివాళులు అర్పిస్తున్నారు.

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్నటికి నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారి తండ్రి మరణ వార్త మరిచిపోక ముందే మరొక దర్శకుడి మరణ వార్త టాలీవుడ్ ని షాక్ కు గురి చేసింది. ప్రముఖ దర్శకుడు ఎస్ రాంబాబు హఠాన్మరణం చెందారు. మంగళవారం (జులై 08) అర్ధరాత్రి సమయంలో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాంబాబు బ్రహ్మాండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కావడంతో ప్రసాద్ ల్యాబ్ లో ఫైనల్ వర్షన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందంతో కలిసి సినిమా చూస్తున్న దర్శకుడు రాంబాబు ఇంటర్వెల్ టైంలో వాష్ రూమ్ వెళ్లి అక్కడే పడిపోయారు. అయితే ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేదు. సినిమా పూర్తి అయినప్పటికీ ఆయన బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి డైరెక్టర్ కోసం వెతకగా వాష్ రూంలో పడి ఉన్న రాంబాబుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డైరెక్టర్ ఎస్ రాంబాబు మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు.
రాంబాబు మరణ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు డైరెక్టర్ మరణం పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇక రాంబాబు మరణ విషయం తెలిసిన బ్రహ్మాండ సినిమా చిత్ర బృందం ఆయనకు నివాళులు అర్పించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలాకరిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ ఇంతలోపే డైరెక్టర్ కన్నమూయడంతో చిత్ర బృందం షాక్ లోకి వెళ్లిపోయింది.
ఒగ్గు కళాకారుల సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ బ్రహ్మాండ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు రాంబాబు. ఈ సినిమాలో ఆమని ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాని దాసరి సురేష్, దాసరి మమత నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యేలోపు దర్శకుడు మరణించడంతో చిత్ర బృందం షాక్ లోకి వెళ్లిపోయింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








