AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tribute to Lengendary: వెయ్యి సినిమాలు.. గిన్నిస్ బుక్‌లో చోటు! ‘ఆచి’ మనోరమకు మరో అరుదైన గౌరవం

భారతీయ సినీ చరిత్రలో ఎంతో మంది నటీమణులు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమ నటనతో తరాల తరబడి గుర్తుండిపోయే స్థానాన్ని సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఒకే భాషకు పరిమితం కాకుండా, వెయ్యికి పైగా సినిమాల్లో నటించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు ..

Tribute to Lengendary: వెయ్యి సినిమాలు.. గిన్నిస్ బుక్‌లో చోటు! ‘ఆచి’ మనోరమకు మరో అరుదైన గౌరవం
Aachi Manorama
Nikhil
|

Updated on: Dec 22, 2025 | 11:54 AM

Share

భారతీయ సినీ చరిత్రలో ఎంతో మంది నటీమణులు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమ నటనతో తరాల తరబడి గుర్తుండిపోయే స్థానాన్ని సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఒకే భాషకు పరిమితం కాకుండా, వెయ్యికి పైగా సినిమాల్లో నటించి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించడం అంటే అది మామూలు విషయం కాదు. హాస్య పాత్రలైనా, క్యారెక్టర్ రోల్స్ అయినా ఆమె నటిస్తే ఆ పాత్రకు ప్రాణం వస్తుందని సినీ పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు తాజాగా ఆ మహానటి గౌరవార్థం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఆమె నివసించిన వీధికి ఆమె పేరునే పెట్టాలని దక్షిణ భారత నటీనటుల సంఘం ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లింది.

వెయ్యి సినిమాల ప్రయాణం

1958లో ‘మలైయిట్ట మంగై’ అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు. ఆమె నటనకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. వెయ్యి సినిమాల మైలురాయిని దాటిన ఏకైక మహిళా నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.

అరుదైన గౌరవం…

అక్టోబర్ 2015లో మనల్ని విడిచి వెళ్లిన ఆ దిగ్గజ నటి మరెవరో కాదు.. అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘ఆచి’ మనోరమ! చెన్నైలోని టీ నగర్‌లో ఉన్న నీలకంఠ మెహతా వీధిలో ఆమె సుదీర్ఘ కాలం నివసించారు. ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకోవడంలో భాగంగా, ఆ వీధి పేరును “మనోరమ స్ట్రీట్”గా మార్చాలని ఇప్పుడు ప్రభుత్వం భావిస్తోంది.

ఒక గొప్ప నటి నివసించిన ప్రాంతానికి ఆమె పేరు పెట్టడం అనేది ఆమెకు అందించే నిజమైన నివాళి. ఇది రాబోయే తరాలకు ఆమె సాధించిన విజయాలను గుర్తు చేస్తూనే ఉంటుంది. చెన్నై వీధుల్లో మనోరమ గారి పేరు ఇక శాశ్వతంగా మారుమ్రోగనుంది.