Ram Gopal Varma: చిక్కడు.. దొరకడు.. పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం అక్కడే ఉన్నాడా?

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. చిక్కడు.. దొరకడు టైపులో అసలు ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఖాకీల కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి ఆర్జీవీని గాలిస్తున్నారు.

Ram Gopal Varma: చిక్కడు.. దొరకడు.. పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం అక్కడే ఉన్నాడా?
Ram Gopal Varma
Follow us
Fairoz Baig

| Edited By: Basha Shek

Updated on: Nov 26, 2024 | 7:06 PM

వర్మ ఎక్కడ? ఇప్పుడు ప్రకాశంజిల్లా పోలీసుల ముందు ఇదే పెద్ద సవాల్‌గా మారింది. ఈనెల 25న ఒంగోలు పోలీసుల ఎదుట విచారణ నిమిత్తం హాజరుకావాల్సిన వర్మ రావడం లేదని తెలుసుకుని ముందుగానే హైదరాబాద్‌ నివాసానికి వెళ్లి ఆయన్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులకు చుక్కెదురైంది. అక్కడ వర్మ లేరు. మరి ఎక్కడికి వెళ్ళారంటే వర్మ టీం దగ్గర సమాధానం లేదు. దీంతో వర్మకోసం గాలిస్తున్న పోలీసులకు ఆయన కోయంబత్తూరులో లూసిఫర్‌ 2 సినిమా షూట్‌లో బిజీగా ఉన్నట్టు సమాచారం అందింది. తాను లూసిఫర్‌ 2 సినిమా క్రూతో ఉన్నట్టు ఈనెల 23 వర్మ ఎక్స్‌లో పోస్టింగ్‌ పెట్టిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వర్మకోసం ఒంగోలు నుంచి స్పెషల్‌ టీంను పంపించారు. వారు చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వర్మ ఇంకా కోయంబత్తూరులోనే ఉన్నారా? లేక మరే ప్రాంతానికైనా వెళ్లిపోయారా? అన్నది ఆరా తీస్తున్నారు.

వర్మపై నమోదైన కేసు వివరాలివే..

ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నవంబర్‌ 10న కేసు నమోదు నమోదైంది… FIR/Case No: 230/2024 u/s 336(4), 353(2), 61(2), 196, 352 BNS, Sec.67 of Information TEchnology Act 2000-2008 ప్రకారం మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. నవంబర్‌ 9వ తేదిన వర్మపై ప్రకాశంజిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు… ఎన్నికలకు ముందు వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌, నారాలోకేష్‌ల ఫోటోలు మార్ఫింగ్‌ చేసి మహిళల ఫోటోలకు వీరి తలలు అంటించి అవమానకరంగా పోస్టింగ్‌లు పెట్టారని, వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో నవంబర్‌ 10వ తేదిన కేసు నమోదు చేసిన మద్దిపాడు పోలీసులు, నవంబర్‌ 13న హైదరాబాద్‌లోని వర్మ ఇంటికి వెళ్లి 41A నోటీసులు ఇచ్చారు.

వర్మపై కేసు నమోదు ఇలా…

నవంబర్‌ 9వ తేది 2024లో వర్మపై ప్రకాశంజిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో మద్దిపాడు మండల టిడిపి ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. నవంబర్‌ 10వ తేదిన కేసు నమోదు చేసిన మద్దిపాడు పోలీసులు, నవంబర్‌ 13న హైదరాబాద్‌లోని వర్మ ఇంటికి వెళ్లి 41A నోటీసులు ఇచ్చారు. నవంబర్ 19న ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు రావాలని ఒంగోలు రూరల్‌ సిఐ శ్రీకాంత్ నోటీసులో పేర్కొన్నారు‌. అయితే నవంబర్‌ 19న విచారణకు రాలేనని, వారం రోజులు గడువు కావాలని సిఐకి వాట్సప్‌ మెసెజ్‌ ఇచ్చి, ఒంగోలులోని తన లాయర్ ఎన్‌. శ్రీనివాసులుద్వారా లిఖిత పూర్వక విజ్ఞప్తి చేయించారువర్మ. దీంతో నవంబర్‌ 20న మళ్లీ రెండోసారి వర్మకు నోటీసులు ఇచ్చారు సిఐ శ్రీకాంత్‌. నవంబర్‌ 25న ఒంగోలురూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని కోరారు. నవంబర్‌ 25న విచారణకు ఒంగోలుకు రాకుంటే BNSS ACT under Section 35(6) ప్రకారం అరెస్ట్‌ చేస్తామని సమాచారం ఇచ్చారు. నవంబర్ 25న వర్మ ఒంగోలుకు విచారణకు హాజరుకావడంలేదని తెలుసుకుని హైదరాబాద్‌లోని వర్మ ఇంటికి ఒంగోలు నుంచి రెండు బృందాలుగా వెళ్ళారు పోలీసులు. తన ఇంటిలో వర్మ లేకపోవడంతో ప్రకాశం పోలీసులు తర్జన భర్జన పడుతూ హైదరాబాద్‌లోనే ఎక్కడైనా ఫాం హౌస్‌లో రహస్యంగా ఉన్నట్టు అనుమానంతో గాలిస్తున్నారు. మరోవైపు కోయంబత్తూరులో వర్మ లూసిఫర్‌ 2 సినిమా షుటింగ్‌లో ఉన్నట్టు ఎక్స్ లో ఈనెల 23న వర్మ పోస్ట్ చేసిన ఫోటోలను బట్టి పోలీసులు అదే కోణంలో విచారణ ప్రారంభించారు. ఒంగోలునుంచి ప్రత్యేక పోలీసు బృందాలను వర్మను అరెస్ట్ చేసేందుకు కోయంబత్తూరు పంపించారు. ఇదే సమయంలో వర్చువల్‌ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని హైదరాబాద్‌లోని తన లాయర్‌ ద్వారా ప్రకాశంజిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు వర్మ. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కోసం వచ్చిన ఫిర్యాదులోని అంశాలను నోటీస్‌ ద్వారా అటాచ్‌ చేయాలని వర్మ లాయర్‌ బాల పోలీసులను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తం మీద ఇటు విచారణకు రాకుండా, అటు ఎక్కడున్నారో తెలియకుండా వర్మ ప్రకాశంజిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ ఏపీ హైకోర్టులో వర్మ వేసిన పిటిషన్‌పై రేపు మంగళవారం విచారణ జరగనుంది. ఒకవేళ వర్మకు బెయిల్‌ వస్తే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. లేకుంటే తనకు బెయిల్ వచ్చే వరకు వర్మ పోలీసులకు తన సినీ స్టైల్లో ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది. అయినా సరే ప్రకాశం పోలీసులు పట్టువదలని విక్రమార్కుల్లా వర్మను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి