SP Charan: ”శిల లాంటి నాకు జీవాన్ని పోసి.. కల లాంటి బ్రతుకు కళతోటి నింపి..” చరణ్ కంటతడి
25 సెప్టెంబర్ 2020.. సంగీత ప్రపంచంలో నిశీధి నిండిన రోజు. సంగీత వాయిద్యాలు మూగబోయిన రోజు అది. గాన గంధర్వుడు పద్మశ్రీ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిన రోజు.
25 సెప్టెంబర్ 2020.. సంగీత ప్రపంచంలో నిశీధి నిండిన రోజు. సంగీత వాయిద్యాలు మూగబోయిన రోజు అది. గాన గంధర్వుడు పద్మశ్రీ ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం(Sp Balasubramaniam) ఈ లోకాన్ని విడిచి వెళ్లిన రోజు. కరోనా మహమ్మారి కాటుకు బాలు బలైన రోజు అది. దాదాపు అన్ని భాషల్లో తన గొంతును వినిపించిన బాలు. సుమారు 40,000లకు పైగా పాటలను ఆలపించారు. ఎలాంటి గానమై తన అద్భుత గాత్రంతో దానిని తారాస్థాయికి చేర్చిన ఘనుడు బాలసుబ్రహ్మణ్యం. నిండైన ఆకారం.. పసి పిల్లాడి మనస్తత్వం ఆయనిది. ఏ హీరో పాట ఆహీరో గొంతుతో మిమిక్రీ చేసి పాటను ఆలపించడం బాలు స్పెషాలిటీ. సింగర్ గానే కాదు నటుడిగా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. అలాగే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది హీరోలకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు బాలు.
బాలు కుమారుడు ఎస్పీ చరణ్ కూడా గాయకుడే అన్న విషయం తెలిసిందే.. బాలసుబ్రహ్మణ్యంను గుర్తు చేసుకుంటూ చరణ్ పలుసార్లు స్టేజ్ పైనే ఎమోషనల్ అయ్యారు. తాజాగా మరోసారి చరణ్ తండ్రిని తలుచుకొని కన్నీరు మునీరయ్యారు. బాలు హోస్ట్ గా పలు కార్యక్రమాలను నిర్వహించారు. వాటిలో పాడుతా తీయగా ఒకటి. బాలు తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎస్పీ చరణ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో విషాద గీతాలను ఆలపించారు కంటెస్టెంట్స్.. ఈ క్రమంలో బాలు ఆలపించిన ప్రేమ సినిమాలోని ప్రియతమా.. నా హృదయమా అనే పాటను ఓ కంటెస్టెంట్ పాడారు. ఈ పాట గురించి చరణ్ స్పందిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ పాటలోని లిరిక్స్ లో “శిలలాంటి నాకు జీవాన్ని పోసి.. కల లాంటి బ్రతుకు కళతో నింపి..” అంటూ వచ్చే పదాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. చరణ్ ను చూసి సింగర్ సునీత కూడా కనీరు పెట్టుకున్నారు.