S. P. Charan: ‘నాన్నగారు పాడాల్సిన పాటలు నాకే రావాలనే ఆలోచన లేదు’.. ఎస్పీ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan )నటిస్తున్న లేటెస్ట్ మూవీ సీతారామం(Sita ramam ). వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan )నటిస్తున్న లేటెస్ట్ మూవీ సీతారామం(Sita ramam ). వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఓ సీతా, ఇంతందం ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ ఈ రెండు పాటలని అద్భుతంగా ఆలపించారు. ఆయన వాయిస్ సంగీత ప్రియులని మెస్మరైజ్ చేస్తోంది. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఎస్పీ చరణ్ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.
చరణ్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి పాటలు పాడే అవకాశం కలిగినందుకు చాలా ఆనందంగా వుంది. చిరకాలం నిలిచిపోయే రెండు పాటలు ఈ చిత్రం లో పాడటం నిజంగా సంతోషంగా వుంది. నేను ఇండస్ట్రీ కి వచ్చి 25 ఏళ్లపైనే అవుతుంది. దాదాపు వెయ్యి పాటలకు పైగా పాడాను. ఇంతకాలం ఇలానే పాడాను. అయితే ఇప్పుడు వినేవాళ్ళ ధ్యాస నా మీదకు కాస్త మళ్ళిందేమో. ఇంతకుముందు పాడినప్పుడు కూడా నాన్నగారి చిన్నప్పటి వాయిస్ లా వుందే అనేవారు. ఇప్పుడు ఆయన లేకపోవడం వలన నామీద కాస్త ధ్యాస ఏర్పడిందేమో కానీ ప్రత్యేకించి నాన్నగారిలా పడాలనే ఉద్దేశం కాదు. నాన్నగారు పాడాల్సిన పాటలు నాకే రావాలనే ఆలోచన లేదు. కానీ నాకు వచ్చే పాటలు నా శక్తి మేరకు బాగా పాడాలనే ప్రయత్నం చేస్తాను. సీతారామంలో కేకే గారు రాసిన పాట చాలా కొత్తగా అనిపించింది. స్వచ్చమైన తెలుగులా పాడినప్పుడు కూడా చాలా తీయగా అనిపించింది. మెలోడికి తగిన సాహిత్యం కుదిరింది. మంచి తెలుగు రాసినందుకు కేకే గారికి మరోసారి కృతజ్ఞతలు అన్నారు. మెలోడీలు ఎప్పుడూ వున్నాయి. అయితే ఫాస్ట్ బీట్ పాటల మధ్య అవంతగా కనిపించకుండా పోతున్నాయి. ఎక్కువ కాలం నిలిచేవి మెలోడిలే. ఫాస్ట్ బీట్ పాటలు సినిమా రిలీజ్ అయిన తర్వాత మర్చిపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకుని పాడుకునే పాటలు మెలోడిలే. రానున్న రోజుల్లో పూర్తి మెలోడి పాటలు వుండే సినిమాలు కూడా వస్తాయనే నమ్మకం వుంది.








