Sarath Babu: ‘శరత్ బాబు ఒంటరితనాన్ని, మౌనాన్ని ప్రేమించారు’.. పరుచూరి గోపాలకృష్ణ ఎమోషనల్..
సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దివంగత నటుడు శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేదని.. ఆయన గొప్ప నటుడని.. అలాంటి నటుడు మన మధ్య లేరనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు దివంగత నటుడు శరత్ బాబు. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించి సహజ నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మే 22న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతిని సినీప్రియులు.. సినీప్రముఖులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దివంగత నటుడు శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేదని.. ఆయన గొప్ప నటుడని.. అలాంటి నటుడు మన మధ్య లేరనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. పరుచూరి పలుకులు పేరుతో యూట్యూబ్లో తన అభిప్రాయాలను తెలియజేస్తున్న ఆయన.. శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
“ఇండస్ట్రీలో ఉన్న గొప్ప నటులంతా వెళ్లిపోతుంటే ఎంతో బాధగా ఉంది. శరత్ బాబుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన మా ఇంటికి సమీపంలో ఉండేవారు. ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నప్పుడు కనిపించేవారు. ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉండేవారు.. ఆయనకు దేవుడిచ్చిన వరం నవ్వు. ఈ మాటను ఎన్నోసార్లు ఆయనతో చెప్పాను. మనకున్న అతికొద్దిమంది సహజ నటుల్లో శరత్ బాబు ఒకరు. ఎన్నో భాషల్లో నటించారు. ఒక తెలుగు నటుడు ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించాడంటే మాములు విషయం కాదు. అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాల్లో పనిచేశాను. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని తెలియగానే త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించిన వారిలో నేనూ ఒకడిని. పవన్ కళ్యాణ్ సినిమాలో శరత్ బాబును చూసినప్పుడే ఆయన ఆరోగ్యం బాలేదేమో అని అనిపించింది.
శరత్ బాబు వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. కొంతమంది మనస్తత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. తట్టుకోలేని స్థాయిలో బాధలు వస్తే సన్యాసం తీసుకుంటారు. కానీ శరత్ బాబు గారు అలా చేయలేదు. ఒంటరితనంలోకి వెళ్లారు. ఆ ఒంటరితనాన్ని , మౌనాన్ని ప్రేమించారు. ఆ మౌనంలోనే కన్నీరు పెట్టుకున్నారేమో గానీ ఎప్పుడూ బయట బాధపడలేదు. ఆయనలాంటి మహానుభావుడు” అంటూ శరత్ బాబును గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.