Megastar Chiranjeevi: దర్శకులకు మెగాస్టార్ చిరంజీవి సూచనలు.. ఇండస్ట్రీ బాగుండాలంటే వాళ్లను బతికించాలంటూ..
నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయవద్దని.. సినిమాకు కావాల్సినవన్నీ పేపర్ వర్క్ లోనే పూర్తిచేయాలని అన్నారు చిరంజీవి. అలాగే చిత్రపరిశ్రమ బాగుండాలని దర్శకులు గుర్తించాలని అన్నారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని చెప్పారు.

మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా.. తొలి రోజే రూ. 29 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇందులో చిరు జోడిగా శ్రుతి హాసన్ నటించగా.. ఏసిపీగా రవితేజ కనిపించారు. వీరిద్దరు కలయికలో వచ్చిన సీన్స్ థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఇక ఇందులో చిరు పూర్తి మాస్ లుక్‌లో అలనాటి మెగాస్టార్‌ను గుర్తుచేశారు. శనివారం ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఇందులో పాల్గొన్న చిరు.. డైరెక్టర్లకు కొన్ని సూచనలు ఇచ్చారు. నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయవద్దని.. సినిమాకు కావాల్సినవన్నీ పేపర్ వర్క్ లోనే పూర్తిచేయాలని అన్నారు. అలాగే చిత్రపరిశ్రమ బాగుండాలని దర్శకులు గుర్తించాలని అన్నారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య చిత్రం కోసం టీం అందరితో కలసి సమిష్టి కృషి చేస్తూ బ్లాక్ బస్టర్ అయ్యి తీరుతుందనే నమ్మకంతో పనిచేశాం. మేము ఏదైతే అనుకున్నామో అది నెరవేరిన తర్వాత ఒక్కసారిగా మాటలు కొరవడిపోయాయి. ఈ సమయంలో మేము మాట్లాడటం ఆపేసి ప్రేక్షకులు చెబితే వినాలని మనస్పూర్తిగా అనిపిస్తుంది. ప్రేక్షకుల స్పందననే మా ఇంధనం. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఒక సినిమా అద్భుతంగా వస్తుందంటే దానికి కారణం ఆ సినిమాకి పని చేసే కార్మికులు. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పని చేసిన కార్మికులది. ఇందులో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు, అభినందనలు. రవితేజ, బాబీ, దేవిశ్రీ, నిర్మాతలు రవి, నవీన్ , మిగతా నటీనటులు ఇలాంటి అద్భుతమైన టీమ్ తో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. వాల్తేరు వీరయ్య విజయం సమిష్టి కృషి. సినిమా ఇంత గ్రాండ్ గా చేయడం మైత్రీ మూవీ మేకర్స్ వలనే సాధ్యమైయింది.
నేను అనే ఈ మాటలకు చిన్నా, పెద్ద దర్శకులు హర్ట్ అవుతారేమో కానీ సినిమా అంటే హిట్ ఇవ్వడం కాదు. నిర్మాతలకు ముందు చెప్పిన బడ్జెట్‌లో పూర్తి చేయాలి. అదే దర్శకులకు మొదటి సక్సెస్. కొత్త టెక్నాలజీ వాడి పనితనం చూపించే కంటే, కథను నమ్మి సాధారణ కెమెరాతోనూ గొప్ప సినిమా తీయాలి. ఏదైనా అవసరం మేరకు తీసుకోవాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతను బతికించాలి. దర్శకులు బాధ్యతతో సినిమాలు తీయాలి. నేను ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడటం లేదు. నా వ్యాఖ్యలను మీడియా వేరే వాళ్లకు, వేరే వాటికి ఆపాదించవచ్చు. సత్తా ఉన్నా దర్శకులు ఒక సినిమాకు ఎక్కువ సన్నివేశాలు తీస్తే, దాన్ని పార్ట్-2 మలుచుకోగలుగుతున్నారు.




అలాగా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘బాహుబలి’ చిత్రాలకు కుదిరింది. ఇవన్నీ మాట్లాడి కొంచెం క్లాస్ ఎక్కువ తీసుకున్నాననుకుంటాను. కానీ ఏదేమైనా నిర్మాతలు బాగుండాలి. వాళ్లు బాగుంటేనే మళ్లీ సినిమాలు చేస్తారు. నా తమ్ముడు రవితేజ లేకపోతే, ఈ సినిమా సెకండాఫ్‌లో ఇంత అందం వచ్చేది కాదు కూడా. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పక్కర్లేదు. మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే మనకు థ్యాంక్స్ చెబుతున్నారు.’’ అని చిరంజీవి అన్నారు.