Srihari: ‘డబ్బులు ఇవ్వకుండా నా భర్తను మోసం చేశారు’.. శ్రీహరి భార్య సెన్సెషనల్ కామెంట్స్..
అంతేకాకుండా శ్రీహరికి డబ్బులు ఇవ్వాల్సిన వారు కూడా ఆయన మరణించిన తర్వాత మళ్లీ కనిపించలేదని.. రెమ్యునరేషన్ కూడా రాలేదని.. కార్లు, నగలు అమ్మి అప్పులు తీర్చుకున్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు శాంతి.
తెలుగు ప్రేక్షకులకు దివంగత నటుడు శ్రీహరి సుపరిచితమే. హీరోగా.. సహయ నటుడిగా.. విలన్గా.. తండ్రిగా ఎన్నో గుర్తుండిపోయే వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన శ్రీహరి అనుహ్యంగా గుండెపోటుతో మరణించారు. ఓ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఆయన అక్కడే ఆకస్మాత్తుగా తుదిశ్వాస విడిచారు. అయితే తెరపై ప్రతినాయకుడిగా కనిపించిన శ్రీహరి.. నిజ జీవితంలో మాత్రం ఎందరికో సాయం చేశారు. తన భర్త ఎందరికో సాయం చేసి ఆదుకున్నారని.. కానీ ఆయన మరణం తర్వాత వారంత కనీసం పలకరించడానికి కూడా రాలేదని.. ఎదురుపడితే సాయం చేయాల్సి వస్తుందనే భయంతో ఏ ఒక్కరు తమను పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీహరి (Srihari)భార్య శాంతి. అంతేకాకుండా శ్రీహరికి డబ్బులు ఇవ్వాల్సిన వారు కూడా ఆయన మరణించిన తర్వాత మళ్లీ కనిపించలేదని.. రెమ్యునరేషన్ కూడా రాలేదని.. కార్లు, నగలు అమ్మి అప్పులు తీర్చుకున్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు శాంతి.
శ్రీహరికి రావాల్సిన రెమ్యునరేషన్ సరిగ్గా వచ్చి ఉంటే తాము మరో 10 ఇళ్లు కొనేవాళ్లమని.. కేవలం చిరంజీవిగారి సంస్థతోపాటు.. మరో రెండు మూడు సంస్థలే ఆయనకు సరిగ్గా రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్లని అన్నారు. చాలా మంది డబ్బులు ఇవ్వకుండా శ్రీహరిని మోసం చేశారని తెలిపారు. ఆయనకు సినిమా అంటే పిచ్చి అని.. అందుకే డబ్బులు ఇవ్వకపోయిన పర్లేదు.. సినిమాలు చేయమని తాను చెప్పేదాన్ని అని అంటూ చెప్పుకొచ్చారు. శ్రీహరి చనిపోయిన తర్వాత చాలా మంది డబ్బులు ఇవ్వలేదని.. దీంతో ప్రస్తుతం తాము ఉంటున్న ఇంటిపై ఉన్న అప్పులను తీర్చడం కోసం నగలు, కార్లు అమ్మానని తెలిపారు.
శ్రీహరి చనిపోయిన తర్వాత కేవలం బాలకృష్ణ గారు మాత్రమే కాల్ చేస మా వివరాలు కనుక్కున్నారు. ఆయన నటించిన సినిమాలో శ్రీహరి నటించారని.. ఆ మూవీ తాలుకూ డబ్బులు ఇంకా రావాలా.. ఏమైనా సాయం కావాలా అని ఫోన్ చేసి ఆరా తీశారు. అలా ఫోన్ చేయాల్సిన బాలకృష్ణ గారికి లేదు. కానీ కాల్ చేసి మా బాగోగులు ఆరా తీశారు. నా భర్త చనిపోయిన తర్వాత ఆయన నటించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏ ఒక్కరు కాల్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు శాంతి.