Dheera Movie Review: ‘ధీర’ మూవీ రివ్యూ.. పాప కోసం లక్ష్ చదలవాడ సాహసం..

వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు లాంటి సినిమాల తర్వాత లక్ష్ చదలవాడ నటించిన సినిమా ధీర. చిన్న పాప సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు లక్ష్. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

Dheera Movie Review: 'ధీర' మూవీ రివ్యూ.. పాప కోసం లక్ష్ చదలవాడ సాహసం..
Dheera Movie Review
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Feb 02, 2024 | 6:59 PM

మూవీ రివ్యూ: ధీర

నటీనటులు: లక్ష్ చదలవాడ, నేహా పఠాన్, సోనియా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజా, భరణి శంకర్, వైవా రాఘవ్ తదితరులు

సంగీతం: సాయి కార్తీక్

సినిమాటోగ్రాఫర్: ఖన్నా

ఎడిటర్: వినయ్ రామస్వామి

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్

నిర్మాత: పద్మావతి చదలవాడ

వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు లాంటి సినిమాల తర్వాత లక్ష్ చదలవాడ నటించిన సినిమా ధీర. చిన్న పాప సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు లక్ష్. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

కథ:

రణధీర్ (లక్ష చదలవాడ) వైజాగ్‌లో అంబులెన్స్ డ్రైవర్. అతడికి డబ్బు తప్ప మరేది కిక్ ఇవ్వదు. పక్కన మనిషి ప్రాణం పోతున్నా కూడా కనీసం పట్టించుకోడు. డబ్బుతోనే అన్నీ సాధ్యం అని నమ్ముతుంటాడు. అలాంటి వాడి జీవితంలోకి డాక్టర్ అమృత (నేహా పఠాన్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ డబ్బు కోసం తన ప్రేమను వదిలేస్తాడు. అలాంటి రణధీర్‌కు ఒకరోజు ఫోన్ కాల్ వస్తుంది. రాజ్ గురు అనే పేషెంట్‌ను అంబులెన్స్‌లో హైదరాబాద్ తీసుకెళ్తే 25 లక్షలు ఇస్తామంటారు. దాంతో డీల్ ఒప్పుకుంటారు రణ్‌ధీర్. కానీ తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. ఆ పేషెంట్ కోసం కొందరు వాళ్లను చంపడానికి వెంబడిస్తుంటారు. అదే సమయంలో ఓ చిన్న పాప కూడా ధీర చేతికి దొరుకుతుంది. ఆ పాప వ్యాల్యూ ఏకంగా 100 నుంచి 2500 కోట్ల వరకు పెరుగుతుంది. అసలేంటి ఈ సస్పెన్స్ ?.. ఎందుకు పాపను చంపాలనుకుంటున్నారు ?.. రాజ్ గురు ఎవరు ?.. వాళ్లందరితో డాక్టర్ అమృతకు ఏంటి సంబంధం ? అనేది మిగిలిన కథ..

కథనం:

చిన్న పిల్లల చుట్టూ రాసుకునే కథల్లో ఎమోషన్ బలంగా ఉండాలి. ధీర సినిమాలో ఇదే చేయాలని చూసాడు కొత్త దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్. పైకి మాస్ యాక్షన్ సినిమాలా దీన్ని డిజైన్ చేసినా కూడా లోపల మాత్రం పూర్తిగా పాప చుట్టూనే కథ తిప్పాడు. ఇంటర్వెల్ వరకు కథను ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని ఫన్నీ సీన్స్‌తో పాటు రొమాంటిక్ సన్నివేశాలు రాసుకున్నాడు విక్రాంత్. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి కథా స్వరూపమే మారిపోయింది. అప్పట్నుంచి మరో టర్న్ తీసుకుంది. ఫస్టాఫ్ అంతా హీరో డీల్ ఒప్పుకోవడం.. ఆ తర్వాత రాజ్ గురు అనే పేషెంట్‌ను హైదరాబాద్ షిఫ్ట్ చేసే క్రమం.. ఆ దారిలో హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. హీరోయిన్ వైపు నుంచి మరో ఫ్లాష్ బ్యాక్.. వీటితోనే సరిపోతుంది. మధ్యలో అంబులెన్స్‌పై దాడులు.. హీరో చేసే ఫైట్లతోనే ఫాస్టుగానే సాగిపోతుంది. మెయిన్ థ్రెడ్ అంతా సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. ఏడాది వయసున్న పాప కోసం ఎందుకు అంతమంది వెంట పడుతున్నారు.. అసలు ఆ పాపని కాపాడటం కోసం హీరో ఏం చేసాడు అనేది అసలు కథ. దీన్ని మొత్తం ఫుల్ యాక్షన్ సీన్స్‌తోనే నింపేసాడు దర్శకుడు. మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ కూడా రాసుకున్నాడు. ఓపెనింగ్ నుంచి హీరో క్యారెక్టర్‌ను డబ్బు కోసం ఏదైనా చేస్తాడని చూపించి.. చివర్లో మాత్రం 2500 కోట్లను వదిలేసి పాపని కాపాడటానికి వెళ్లడం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. కానీ డబ్బును మించిన ఎమోషన్ వచ్చినపుడు డబ్బుకు విలువ ఇవ్వను అంటూ మధ్యలో హీరోతో ఓ డైలాగ్ చెప్పించాడు దర్శకుడు. అందుకే హీరోలో మార్పు వచ్చిందనుకుని సర్దుకోవాలి. కానీ చివరికి మళ్లీ 25000 కోట్లు హీరో దగ్గరే ఉంటాయని చూపించడం కొసమెరుపు.

నటీనటులు:

హీరో లక్ష్ సినిమా సినిమాకి నటుడిగా బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే ఇందులో చాలా యాక్టివ్‌గా కనిపించాడు. కటౌట్ కూడా బాగానే ఉంది. మంచి సబ్జెక్ట్‌లు ఎంచుకుంటే రానాలా డిఫెరెంట్ సినిమాలు చేసుకోవచ్చు లక్ష్. యాక్షన్ సీన్స్‌‌తో పాటు ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ చేసాడు లక్ష్. హీరోయిన్లు నేహా పఠాన్, సోనియా భన్సాల్ ఓకే. సోనియాను గ్లామర్ కోసం తీసుకుంటే.. నేహా మాత్రం నటనతో ఆకట్టుకుంటుంది. ‘మిర్చి’ కిరణ్ తన మార్క్ కామెడీతో కాసేపు నవ్వించాడు. భరణి శంకర్, వైవా రాఘవ్, భూషణ్ వంటి నటీనటులు ఉన్నంతలో బానే చేసారు.

టెక్నికల్ టీమ్:

సాయి కార్తిక్ మ్యూజిక్ ఏమంత బలంగా లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్లేదు. వినయ్ రామస్వామి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఏమనలేం. ఖన్నా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సినిమా రేంజ్ పెంచేసింది. ఇక ధీర సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నిర్మాణ విలువల గురించి. హీరో మార్కెట్‌తో పనిలేకుండా భారీగానే ఖర్చు చేసారు. దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్ మంచి లైన్ తీసుకున్నాడు కానీ ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉండుంటే మంచి సినిమా అయ్యుండేది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ధీర.. పాప కోసం.. పాపే నా ప్రాణం.