Tollywood: “టికెట్ రేట్ కంటే పాప్ కార్న్ రేట్ ఎక్కువ అయింది..”
థియేటర్లలో సినిమా టికెట్ రేట్ల కంటే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలే ఎక్కువగా ఉన్నాయని సినీ దర్శకుడు తేజ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

సినిమా టికెట్ రేట్లతో పోలిస్తే థియేటర్లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ ధరలే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం ఇటీవలి కాలంలో సినిమా ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. ఒక మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే టికెట్‌తో పాటు ఇతర ఖర్చులు కలిపి ఒక్కొక్కరిపై కనీసం రూ.500 వరకు ఖర్చవుతోందని సినీ అభిమానులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు వెళ్లడం కష్టమవుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, ఇదే అంశంపై సినీ దర్శకుడు తేజ కూడా స్పందించారు. టికెట్ రేట్ల కంటే థియేటర్లలో పాప్‌కార్న్, ఇతర ఆహార పదార్థాల ధరలే ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
థియేటర్లలో వాస్తవంగా ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తేజ అన్నారు. సినిమా టికెట్ రేట్లు, షూటింగ్ ప్రోత్సాహకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గురువారం సమావేశం నిర్వహించింది. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తేజతో పాటు పలువురు పంపిణీదారులు, సినిమా రంగ ప్రతినిధులు హాజరయ్యారు.
టికెట్ రేట్లపై సమగ్ర చర్చ
ఏపీలో సినిమా షూటింగ్‌లకు ఇస్తున్న రాయితీలు, ఇప్పటి వరకు అమలులో ఉన్న జీఓలు, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం ఒక అంతర్గత సమావేశాన్ని నిర్వహించుకుంది. టికెట్ రేట్ల పెంపుపై కోర్టుల తీర్పులు, తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కూడా చర్చించింది. ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, న్యాయశాఖ కార్యదర్శి, ఎఫ్‌డీసీ అధికారులు, సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డైరెక్టర్ లు హాజరయ్యారు.
ఒకే జీఓపై నిర్ణయం
ఈ సమావేశం అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ప్రతి సినిమాకు టికెట్ రేట్లు పెంచడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. టికెట్ రేట్లకు సంబంధించి ఒకే జీఓ ఉండేలా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పెద్ద బడ్జెట్ సినిమాల్లో ఆర్టిస్టుల రెమ్యునరేషన్ అంశంపైనా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని.మంత్రి తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో విడిగా సమావేశాలు నిర్వహించి సినిమా పరిశ్రమ సమస్యలను విని పరిష్కారం చూపుతామని అన్నారు దుర్గేష్. తెలుగు సినిమా పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిందని, వేల కోట్ల బడ్జెట్‌లతో సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
సినిమా షూటింగ్‌లకు ప్రోత్సాహం, టికెట్ రేట్ల అంశాలపై జరిగిన ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సినీ దర్శకుడు తేజ, థియేటర్లలో ప్రస్తుతం ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. టికెట్ రేట్లతో పోలిస్తే పాప్‌కార్న్, ఇతర ఆహార పదార్థాల ధరలే ఎక్కువగా ఉండటం ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తోందని అన్నారు. ఓటిటి వేదికలు, పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు గణనీయమైన నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. పరిశ్రమ వైపు నుంచి తమ అభిప్రాయాలను స్పష్టంగా ప్రభుత్వం ముందు ఉంచామని, తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు పొందేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తేజ అభిప్రాయపడ్డారు
