TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త.. త్వరలోనే ఈ ప్రాంతాల్లో కొత్త బస్సులు.. తీరనున్న రద్దీ కష్టాలు
హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ మేరకు తయారీ కంపెనీలకు ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 2 వేల బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఇప్పుడు మరో 200 బస్సులకు ఆమోదం లభించింది. ఈ వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త అందింది. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ బస్సులను టీజీఎస్‌ఆర్టీసీకి సరఫరా చేసేందుకు టెండర్లను కూడా ఆహ్వానించింది. త్వరలోనే ఈ బస్సులను తయారీ కంపెనీల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కొత్త బస్సులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే తిప్పనున్నారు. దీంతో హైదరాబాద్ బస్సుల్లో రద్దీ భారీగా తగ్గనుంది. నగర బస్సుల్లో తీవ్ర రద్దీ కారణంగా తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. పీకే అవర్స్‌లో అసలు కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండటం లేదు. పుట్‌బోర్డులో నిల్చోని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం వల్ల బస్సుల్లో పురుషులకు అసలు సీట్లు దొరకడం లేదు.
నాన్ ఏసీ బస్సులు
కొత్తగా ప్రారంభించనున్న ఈ 200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులన్నీ లోఫ్లోర్ నాన్ ఏసీ రకానికి చెందినవిగా తెలుస్తోంది. ఈ బస్సులను హైదరాబాద్‌లోని వివిధ రూట్లలో తిప్పనున్నారు. వీటి రాకతో నగరవాసుల కష్టాలు తీరనున్నాయి. ప్రయాణికుల రద్దీని తీర్చేందుకు టీజీఎస్‌ఆర్టీసీ కొత్త బస్సులను దశలవారీగా తీసుకొస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు కొత్త బస్సులను ప్రవేశపెట్టింది. తాజాగా మరికొన్ని బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే పర్యావరణాన్ని రక్షించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా పీఎం ఈ-డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలను ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తోంది. గతంలో 2800 బస్సులు కావాలని కేంద్రానికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనలు పంపగా.. తొలి విడతలో కేంద్రం 2 వేల బస్సులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇవి కాక అదనంగా మరో 800 బస్సులు కావాలని ఆర్టీసీ కోరగా.. తాజాగా 200 బస్సులను కేంద్రం కేటాయించింది.
సెప్టెంబర్‌లోగా రోడ్డపైకి..
అయితే తొలి దశలో 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేసేందుకు తయారీ కంపెనీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ టీజీఎస్‌ఆర్టీసీ జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి 2027 ఆగస్టు మధ్య దశలవారీగా 2 వేల బస్సులను టీజీఎస్‌ఆర్టీసీకి అందించనున్నారు. దీంతో ఈ ఏడాది కొత్త ఎలక్ట్రిక్ బస్సులు టీజీఎస్ఆర్టీసీకి అందనుండగా.. వీటిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని హైదరాబాద్‌లోని వివిధ రూట్లతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి తిప్పనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అనేక ఎలక్ట్రిక్ బస్సులు సర్వీసులు అందిస్తున్నారు. ఇవి ఏసీ బస్సులు కాగా.. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. వేసవి దృష్ట్యా ఈ బస్సుల్లో టికెట్ల ఛార్జీలను ఆర్టీసీ తగ్గించింది.
