House Buy: కోటిన్నర ఇంటిని ఇలా ప్లాన్ చేస్తే ఈజీగా కొనేయొచ్చు.. ఒక్క EMI కూడా కట్టాల్సిన పనిలేదు
2026లో ఇల్లు కొనుగోలు చేయాలనే ప్రణాళికలో ఉన్నారా.! బిజినెస్ నిపుణులు కీలక సలహాలు ఇస్తున్నారు. ఆర్థిక విషయాలు తెలియకపోవడం వల్ల చాలామంది అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. అసెట్‌లను నిర్మించుకుని, ఆ తర్వాత ఇంటి కొనుగోలుకు వెళ్లడమే తెలివైన నిర్ణయమని నిపుణులు వివరించారు.

2026లో ఇల్లు కొనాలనుకునేవారికి ఆర్ధిక నిపుణులు పలు కీలక సలహాలు అందించారు. మధ్యతరగతివారి అతి పెద్ద కల సొంత ఇల్లు కలిగి ఉండటమే. కానీ, చాలామంది సరైన ఆర్థిక ప్రణాళిక లేక EMIల భారం కింద నలిగిపోతున్నారు. అసలు ఇల్లు అనేది ఆస్తి అవుతుందా లేక బాధ్యత అవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందామా.. ఆస్తి అంటే మన జేబులోకి డబ్బును తీసుకురావాలి. ఉదాహరణకు, అద్దెకు వచ్చే రియల్ ఎస్టేట్ లేదా పెట్టుబడులు. అదే సమయంలో, మన జేబులోంచి డబ్బును తీసుకునేవి బాధ్యతలు అవుతాయి. ఇంటిని EMIల ద్వారా కొనుగోలు చేస్తే, ఆ ఇల్లు అప్పు తీరే వరకు బ్యాంకుకు చెందినదిగా, మనకు బాధ్యతగానే మిగిలిపోతుంది. మధ్యతరగతిలో నెలకు రూ.50,000 నుంచి రూ.2 లక్షల వరకు సంపాదించేవారు చేసే పెద్ద తప్పులలో ఒకటి తక్కువ వయస్సులో లేదా ఉద్యోగం రాగానే వెంటనే ఇల్లు కొనడం.
హైదరాబాద్ లాంటి నగరాల్లో కోటి రూపాయల ఫ్లాట్‌కు రూ.10-15 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన మొత్తాన్ని లోన్‌గా తీసుకుంటే, నెలకు రూ.70-80 వేల EMI పడుతుంది. ఇది 20-30 సంవత్సరాల పాటు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే, జీవితాంతం బ్యాంకు కోసం పని చేయాల్సి వస్తుంది. ఇంటి కొనుగోలుతో ఆ ఖర్చులు ఆగవు. ఆస్తి పన్ను, ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైనింగ్, కారు, వెకేషన్లు, పిల్లల విద్య లాంటివి అదనపు ఆర్థిక భారాలను మోసుకొస్తాయి. ఇవి క్రెడిట్ కార్డులు లేదా కన్స్యూమర్ లోన్‌ల రూపంలో అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి.
యువత వెంటనే ఇల్లు కొనడానికి బదులుగా, 7-10 సంవత్సరాలు వేచి ఉండమని సలహా ఇచ్చారు బిజినెస్ నిపుణులు. ఈ కాలంలో, తమ ఆదాయంలో కొంత భాగాన్ని(ఉదాహరణకు, నెలకు రూ.50,000) సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో పెట్టుబడిగా పెట్టాలి. 10 సంవత్సరాలలో రూ.60 లక్షలు పెట్టుబడి పెడితే, సగటున 12 శాతం రాబడితో అది సుమారు రూ.1.20 కోట్లు అవుతుంది. ఈ కార్పస్‌ను ఉపయోగించి, ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత, సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ద్వారా EMIలను చెల్లించవచ్చు. ఇది మీ డబ్బునే మీ EMIలను చెల్లించేలా చేస్తుంది. తద్వారా ఆర్థిక భారం తగ్గుతుంది. ఉద్యోగం పోయినా, ఈ కార్పస్ నుంచి వచ్చే ఆదాయం జీవన భృతికి ఉపయోగపడుతుంది. మిడిల్ క్లాస్ ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును నేరుగా EMIలు లేదా ట్యాక్సులకు చెల్లించడం ద్వారా తమ జీవితాన్ని బ్యాంకు లేదా ప్రభుత్వం నియంత్రణలో ఉంచుకుంటారని నిపుణులు గుర్తు చేశారు.
కాబట్టి, తొలుత అసెట్‌లను(ఆస్తులను) నిర్మించుకుని, ఆ తర్వాత ఇంటి కొనుగోలుకు వెళ్లడమే తెలివైన నిర్ణయం. రియల్ ఎస్టేట్ ద్వారా కూడా ఆస్తులను నిర్మించుకోవచ్చు, అయితే లిక్విడిటీ ఉన్న(సులభంగా అమ్మకానికి వచ్చే) ఆస్తులను ఎంచుకోవాలి. అవి నిరంతరం అద్దె ఆదాయాన్ని(పాసివ్ ఇన్‌కమ్) ఇవ్వాలి. ఈ ఆర్థిక సూత్రాలను పాటించడం ద్వారా మధ్యతరగతి వారు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా తమ సొంత ఇంటి కలను సురక్షితంగా సాకారం చేసుకోవచ్చునని స్పష్టం చేశారు.
