AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాచిలర్స్‌ ఇది మీకోసమే.. ఎవ్వరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదా..? చట్టం మీకిచ్చే హక్కుల గురించి తెలుసుకోండి..

మెట్రో నగరాల్లో ఉద్యోగం లేదా చదువు కోసం వచ్చే లక్షలాది మంది యువతీయువకులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు.. అద్దె ఇల్లు సంపాదించడం. ఫ్లాట్ ఓనర్ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, హౌసింగ్ సొసైటీలు అనధికారికంగా బ్యాచిలర్లపై ఆంక్షలు విధిస్తున్నాయి. అసలు పెళ్లి కాలేదన్న ఒకే ఒక్క కారణంతో అద్దె ఇల్లు నిరాకరించే హక్కు ఆ సొసైటీలకు ఉందా? భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు చట్టాలు ఏం చెబుతున్నాయి? అనేది తెలుసుకుందాం..

బ్యాచిలర్స్‌ ఇది మీకోసమే.. ఎవ్వరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదా..? చట్టం మీకిచ్చే హక్కుల గురించి తెలుసుకోండి..
Can Housing Societies Ban Bachelors
Krishna S
|

Updated on: Sep 15, 2026 | 9:15 PM

Share

మెట్రో నగరాలు, పట్టణాల్లో ఉద్యోగం లేదా చదువు నిమిత్తం ఉండే బ్యాచిలర్లు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో అద్దె ఇల్లు దొరకకపోవడం ఒకటి. ఫ్లాట్ ఓనర్ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. అపార్ట్‌మెంట్ లేదా హౌసింగ్ సొసైటీలు మాత్రం మా సొసైటీలో బ్యాచిలర్స్‌కు ఇళ్లు ఇవ్వం అంటూ హుకుం జారీ చేస్తుంటాయి. అయితే పెళ్లి కాలేదన్న ఏకైక కారణంతో వ్యక్తులను నిరాకరించే హక్కు హౌసింగ్ సొసైటీలకు ఉందా? భారత రాజ్యాంగం, సహకార చట్టాలు, న్యాయస్థానాల తీర్పులు ఏం చెబుతున్నాయి? అనే విషయాలు చాలా మందికి తెలియవు. యువతీయువకులు రాత్రి వేళల్లో లేట్ నైట్ పార్టీలు చేసుకుంటారని, మద్యం సేవించి గొడవలు చేస్తారని, ప్రశాంతతకు భంగం కలిగిస్తారనే ముందస్తు అపోహలతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. చట్టాలపై పూర్తి అవగాహన లేకపోవడంతో వేలాది మంది యువత సొసైటీల బెదిరింపులకు భయపడి మౌనంగా ఇళ్లను వెతుక్కుంటూ అల్లాడిపోతున్నారు.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

భారత రాజ్యాంగం లేదా దేశంలోని ఏ చట్టం ప్రకారమూ కేవలం అవివాహితుడు, అవివాహిత అనే కారణంతో ఎవరికీ అద్దె ఇంటిని నిరాకరించే హక్కు హౌసింగ్ సొసైటీలకు లేదు. ఆర్టికల్ 15 ప్రకారం.. మతం, జాతి, లింగం, కులం లేదా వైవాహిక స్థితి ఆధారంగా ఏ పౌరుడిపైనా వివక్ష చూపడాన్ని రాజ్యాంగం ఖండిస్తోంది. హౌసింగ్ సొసైటీలు అంతర్గత నిబంధనలు రూపొందించుకోవచ్చు. కానీ ఆ నిబంధనలు దేశ రాజ్యాంగం, ప్రాథమిక హక్కులను మించి ఉండకూడదు.

కోర్టుల స్పష్టమైన తీర్పులు

ఫ్లాట్ యజమాని తన సొంత కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తిని ఎవరికి అద్దెకు ఇవ్వాలనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత, చట్టబద్ధమైన హక్కు. అద్దెదారు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడనంత వరకు.. వైవాహిక స్థితిని బట్టి సొసైటీలు వారిని అడ్డుకోలేవని దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. సొసైటీలు బ్యాచిలర్లపై నిషేధం విధిస్తూ చేసే తీర్మానాలు చట్టపరంగా చెల్లవు.

సొసైటీ NOC నిజంగా తప్పనిసరా?

సొసైటీ నుంచి ఎన్‌వోసీ లేదనే సాకుతో చాలామందిని అడ్డుకుంటారు. కానీ నూతన సహకార సంఘాల నిబంధనల ప్రకారం, ఫ్లాట్ యజమాని అద్దెకు ఇవ్వడానికి సొసైటీ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సిన చట్టబద్ధమైన అవసరం లేదు. యజమాని, అద్దెదారు మధ్య లీగల్ రెంట్ అగ్రిమెంట్ ఉండాలి. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ‘పోలీస్ వెరిఫికేషన్’ పూర్తి చేసి, ఆ పత్రాల కాపీని సొసైటీకి సమాచారం నిమిత్తం అందిస్తే సరిపోతుంది.

హౌసింగ్ సొసైటీలు ఇబ్బంది పెడితే ఏం చేయాలి?

రాతపూర్వకంగా అడగండి: సొసైటీ ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ అడ్డుకుంటే.. బ్యాచిలర్లకు ఇల్లు ఇవ్వకూడదని సొసైటీ లెటర్‌హెడ్‌పై రాతపూర్వకంగా ఇవ్వండి అని అడగండి. ఇది చట్టవిరుద్ధం కాబట్టి ఎవరూ రాతపూర్వకంగా ఇవ్వడానికి సాహసించరు.

రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు: సొసైటీ ఆగడాలు కొనసాగితే, ఫ్లాట్ యజమాని లేదా అద్దెదారుడు నేరుగా కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.

పోలీస్, వినియోగదారుల ఫోరం: సొసైటీ కమిటీ సభ్యులు దౌర్జన్యం చేయడం, గేటు వద్ద అడ్డుకోవడం, మానసికంగా వేధించడం వంటివి చేస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదు చేయవచ్చు లేదా కన్స్యూమర్ ఫోరమ్‌ను ఆశ్రయించవచ్చు.

సొసైటీలకు ఉండే పరిమితులు

సొసైటీలో శాంతిభద్రతల కోసం రాత్రిపూట లౌడ్ స్పీకర్లు పెట్టకపోవడం, మద్యం తాగి న్యూసెన్స్ చేయకపోవడం, చట్టవిరుద్ధ పనులకు పాల్పడకపోవడం వంటి సాధారణ నిబంధనలను విధించే హక్కు మాత్రమే సొసైటీలకు ఉంది. నిబంధనలు అతిక్రమిస్తే పోలీసులను ఆశ్రయించవచ్చే తప్ప.. పెళ్లి కాలేదు అన్న కారణంతో ఎవరినీ వెళ్లగొట్టే హక్కు హౌసింగ్ సొసైటీలకు ఏమాత్రం లేదు.

Follow Us