పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్ష సూచన ఉండగా, హైదరాబాద్‌లో మధ్యాహ్నం తర్వాత వాన పడే ఛాన్స్ ఉంది. మరోవైపు శ్రీశైలం, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లో తగ్గడంతో నీటి పరిస్థితులపై ఆందోళన కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ ఇచ్చింది! బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు.. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి!మరి ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి? ఎక్కడ భారీ వర్ష సూచన ఉంది? హైదరాబాద్‌లో పరిస్థితి ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం తీవ్రంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీనికి తోడు గుజరాత్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. రాగల కొద్దిరోజుల పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు వాతావరణంలో కీలక మార్పులు రానున్నాయి. ఒడిశా-బెంగాల్ తీరాల మీదుగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల కారణంగా తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. నేడు, రేపు కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి. నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. అనంతపురం జిల్లా ప్రజలు కూడా వర్షాల కోసం సిద్ధం కావాలి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తిరుపతి జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 863 అడుగులుగా ఉండగా, మొత్తం 115 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి దిగువకు 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోగా, ఎడమగట్టు కేంద్రంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయానికి వరద నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీనితో రిజర్వాయర్‌లో నీటి నిల్వ క్రమంగా తగ్గుతోంది. జలాశయానికి ఇన్‌ఫ్లో సున్నా క్యూసెక్కులకు పడిపోగా, దిగువ ప్రాంతాలకు మాత్రం 11,202 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1,,627.75 అడుగులకు చేరింది. అలాగే మొత్తం 105.788 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి గాను, ప్రస్తుతం 85.852 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. ప్రవాహం పూర్తిగా ఆగిపోవడంతో అధికారులు నీటి విడుదలపై నిరంతరం కన్నేశారు. కర్నూలు కలెక్టరేట్‌లో ఎల్‌నినో పై మంత్రి టీజీ భరత్ సమీక్ష చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో సుంకేసుల డ్యాంలో నీరు అడుగంటి పోయింది. వాస్తవ పరిస్థితిని గణేష్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి. నిమజ్జనం హంద్రీనీవాలో చేసేలా ప్రతిపాదన తెచ్చారు. అయితే వినాయక ఘాట్ దగ్గర కేసీ కెనాల్‌లోనే నిమజ్జనం నిర్వహించాలని సమావేశంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు కోరారు. దీంతో కేసీ కెనాల్ దగ్గరే నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి టీజీ భరత్. వినాయక ఘాట్ దగ్గర కేసీ కెనాల్‌లోనే వినాయక నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. కేసీ కెనాల్‌లో రెండు వైపులా గోడలు నిర్మించి ట్యాంక్ తరహాలో నీటిని నిల్వ చేస్తామన్నారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకే సీజన్‌లో మూడు కాలాల వాతావరణం కనిపిస్తుండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి వరకు ఎండలు, భారీ వర్షాలతో అల్లాడిపోయిన జిల్లా ప్రజలను, మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కమ్మేసిన దట్టమైన మంచు తీవ్రంగా అలరించింది. అమలాపురం, పి.గన్నవరం నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారులపై దట్టమైన మంచు అలముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు, వినాయక చవితి సందర్భంగా ఆలయాలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకే రోజు వర్షం, శీతాకాలం, వేసవిని తలపించేలా కోనసీమలో వింత వాతావరణం నెలకొంది. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం సింగరపల్లి గ్రామంలో సోమవారం వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండతో ఇబ్బందిపడ్డ ప్రజలకు సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించింది. అయితే.. రామంలోని డ్రైనేజీ వ్యవస్థ లోపాలతో వర్షపు నీరంతా వీధుల్లోనే నిలిచిపోయి ఊరు జలమయమైంది. ఈ సమస్యపై స్థానిక యంత్రాంగం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో ఈ స్థాయిలో భారీ వర్షం కురవడం ఇదే ప్రధమమని స్థానిక రైతులు తెలిపారు. తెలంగాణలో సాయంత్రానికి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్ జిల్లాలతో పాటు సిద్దిపేట, మెదక్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్‌లోనూ మధ్యాహ్నం నుంచి వర్షం పడే ఛాన్స్ ఉంది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి ఈ వర్షాలు ఉపశమనం కలిగించనున్నాయి. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం 200 క్యూసెక్కులు మాత్రమే ఉంది. దీంతో ఆయకట్టు, ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదల నిలిచిపోయింది. జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.9 టీఎంసీల నీరు నిల్వ ఉండగా…నీటిమట్టం 318 మీటర్లకు చేరింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయం నిండుకుండలా మారింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 21 అడుగులకు చేరుకుంది. గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వరద నీటితో పాటు నాగార్జున సాగర్ నుంచి పాలేరుకు నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ పూర్తి స్థాయిలో కళకళలాడుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి పాత కాలువకు 300 క్యూసెక్కులు, భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి 275 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వరంగల్ నగరంలో సోమవారం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వినాయక చవితి పండగ వేళ వర్షం దంచికొట్టడంతో గణనాథుని విగ్రహాలను తరలించేందుకు, పందిళ్ల వద్ద ఏర్పాట్లు చేసుకునేందుకు ఉత్సవ నిర్వాహకులు తీవ్ర అవస్థలు పడ్డారు. పండగ పూజ సామాగ్రి, పండ్లు, పువ్వులు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు వచ్చిన భక్తులు, ప్రజలు వర్షపు నీటిలో తడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండటంతో వినాయక చవితి సంబరాల కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు కురిసిన వర్షాలు ఎండిపోతున్న వరి, పత్తి పంటలకు జీవం పోశాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటమునగడంతో మరో రెండు మూడు రోజులు ఇలాగే వర్షం పడితే నష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హుస్నాబాద్ బస్టాండ్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో బస్టాండ్ చెరువును తలపించింది. మోకాళ్ళ లోతు నీళ్ళు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బస్సుల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. హుస్నాబాద్ లో ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా వాగులు, వంకల్లోకి స్వల్పంగా వరద నీరు చేరింది. వర్షంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వగా, వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం రుతుపవనాలపై తీవ్రంగా పడింది. సెప్టెంబర్ పదమూడో నాటికి దేశవ్యాప్తంగా పదిహేను శాతం మేర వర్షపాత లోటు నమోదైంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇరవై ఎనిమిది శాతం తక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో 43 శాతం, కర్ణాటకలో 29 శాతం, కేరళలో 27 శాతం మేర వర్షపాత లోటు ఏర్పడింది. ఈ భారీ వర్షపాత లోటు కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

