AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భర్తనే లేకపోతే ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది.. కట్‌చేస్తే..

అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా సాగిన రాక్షస కాండ.. కట్టుకున్న భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో హాయిగా బతకొచ్చనుకుంది.. దర్గా టూర్ పేరుతో మైండ్ బ్లాంక్ అయ్యే స్కెచ్ వేసింది. కానీ పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో పెను సంచలనం సృష్టించిన కరీం మర్డర్ కేసు వెనుక ఉన్న ఆ చీకటి కోణాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: భర్తనే లేకపోతే  ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది.. కట్‌చేస్తే..
Nagarkurnool Murder Mystery Solved
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Sep 15, 2026 | 8:44 PM

Share

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన టీ వ్యాపారి కరీం దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న అక్కసుతో, సొంత భార్యే ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా మట్టుబెట్టించినట్లు విచారణలో తేలింది. నిందితులు సలీమా బేగం, ఆమె ప్రియుడు గౌస్ పాషాలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో నివాసముంటున్న కరీం, సలీమా బేగం దంపతులు టీ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో రెండేళ్ల క్రితం వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. సలీమా బేగంకు వరుసకు సోదరుడైన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన గౌస్ పాషాతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

విషయం తెలుసుకున్న కరీం.. భార్యతో పాటు గౌస్ పాషాను పలుమార్లు హెచ్చరించాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు మొదలయ్యాయి. దీంతో ఎలాగైనా కరీంను అడ్డు తొలగించుకుంటే ఆస్తి దక్కడంతో పాటు, ఎలాంటి ఆటంకాలు లేకుండా కలసి ఉండొచ్చని సలీమా, గౌస్ పాషా పథకం వేశారు.

దర్గా టూర్ పేరుతో స్కెచ్.. అర్ధరాత్రి వేళ ఘాతుకం

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. ఈ నెల 9న సలీమా బేగం నెల్లూరు దర్గాకు బయలుదేరింది. తాను ఊళ్లో లేని సమయంలో కరీం ఇంట్లో ఒంటరిగా ఉంటాడని, అదే అదనుగా హత్య చేయాలని ప్రియుడికి వాట్సాప్ కాల్ ద్వారా సమాచారం అందించింది. ఈ నెల 10న అర్ధరాత్రి గౌస్ పాషా ఓ జత బట్టలు, కత్తి, చేతి గ్లౌజులు బ్యాగులో పెట్టుకుని రామ్‌నగర్‌లోని కరీం ఇంటికి చేరుకున్నాడు. తలుపును బలంగా బాదడంతో ఎవరో వచ్చారని తలుపు తీసిన కరీంపై క్షణాల్లో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో కరీం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం తిరుగు ప్రయాణంలో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు రక్తపు మరకలున్న బట్టలు, గ్లౌజులు, కత్తి, చెప్పులను మార్గమధ్యంలోని చెట్ల పొదల్లో పడేసి తన గ్రామానికి పరారయ్యాడు.

ఫోన్ కాల్స్ ఆధారంగా గుట్టురట్టు

మరుసటి రోజు ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న కరీంను చూసి సోదరుడు హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల విచారణ, గతంలో జరిగిన వివాదాలు, సలీమా బేగం కాల్ డేటాను పరిశీలించగా గౌస్ పాషాతో ఆమె మాట్లాడిన వాట్సాప్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. అనుమానంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. నేరం అంగీకరించిన నిందితుల సమాచారంతో హత్యకు ఉపయోగించిన కత్తి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. క్షణిక సుఖం కోసం కట్టుకున్న భర్త ప్రాణాలు తీసిన భార్య, ఆమెకు సహకరించిన ప్రియుడు చివరకు ఊచలు లెక్కబెడుతున్నారు.

Follow Us