AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ.. భారతీయుడు మృతి, మరొకరికి గాయాలు

నేపాల్‌లోని సోలుఖుంబు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. హెలిప్యాడ్‌పై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 47 ఏళ్ల భారతీయుడు వసంత్ కుమార్ బలరా మడు మృతి చెందగా.. భారత సంతతికి చెందిన 53 ఏళ్ల న్యూజిలాండ్ పౌరుడు శైలేష్ కిషన్ పటేల్ గాయపడ్డారు.

నేపాల్‌లో రెండు హెలికాప్టర్ల ఢీ.. భారతీయుడు మృతి, మరొకరికి గాయాలు
Nepal Crash
Ram Naramaneni
|

Updated on: Nov 03, 2026 | 11:33 AM

Share

నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భారతీయ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోగా.. భారత సంతతికి చెందిన మరో వ్యక్తి గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఖాట్మండుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలోని సోలుఖుంబు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

నేపాల్ పౌర విమానయాన ప్రాధికార సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిష్‌టెయిల్ ఎయిర్, డైనాస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన రెండు హెలికాప్టర్లు ఫెరిచే హెలిప్యాడ్‌పై దిగేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో రెండు హెలికాప్టర్ల రోటర్ బ్లేడ్లు ఒకదానికొకటి తగలడంతో ప్రమాదం జరిగింది.

సోలుఖుంబు జిల్లా పోలీసు కార్యాలయానికి చెందిన డీఎస్పీ నవీన్‌రాజ్ బుధాతోకి మాట్లాడుతూ.. ఖుంబు పసాంగ్ లాము ప్రాంతంలోని ఫెరిచే హెలిప్యాడ్ వద్ద రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. హెలికాప్టర్లు అత్యంత సమీపానికి వచ్చిన అనంతరం వాటి రోటర్ బ్లేడ్లు ఢీకొన్న దృశ్యాలు అందులో కనిపించాయి.

ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని 47 ఏళ్ల భారతీయుడు వసంత్ కుమార్ బలరా మడుగా గుర్తించినట్లు సమాచారం. అయితే మృతుడు విదేశీయుడని, ఆయన గుర్తింపు, జాతీయత ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు మరో ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని హెలికాప్టర్ ద్వారా లుక్లాకు తరలించారు.

ఇక ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని 53 ఏళ్ల శైలేష్ కిషన్ పటేల్‌గా గుర్తించారు. ఆయన భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ పౌరుడు. గాయపడిన ఆయనను మరో హెలికాప్టర్‌లో వైద్య చికిత్స నిమిత్తం తరలించారు.

నేపాల్ పౌర విమానయాన ప్రాధికార సంస్థ సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ కూడా రెండు హెలికాప్టర్లు ఢీకొన్న విషయాన్ని ధ్రువీకరించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు తెలిపారు. అసలు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా, నేపాల్‌లో పర్యాటకులు, పర్వతారోహకుల రవాణాకు చిన్న తరహా హెలికాప్టర్లు విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. పర్వత ప్రాంతాలకు సరుకులు చేరవేయడంతో పాటు అత్యవసర సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ల కోసం కూడా వీటిని వినియోగిస్తుంటారు.

వీడియో దిగువన చూడండి..

Follow Us