Weather Alert: అబ్బ.. తెలుగు రాష్ట్రాల్లో నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. ఇదిగో 4 రోజుల వెదర్ రిపోర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు వానలే వానలు అంటున్నారు వాతావరణశాఖ అధికారులు. వడగళ్ల వానలతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. మరి ఏ ఏ జిల్లాలకు వర్ష సూచనలున్నాయి...? వాతావరణ శాఖ అప్డేట్స్ ఏంటి..? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

వర్షాలు కురుస్తుండటంతో ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ వర్షాలపై, వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు వడగళ్ల వానలతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని చెట్ల కింద నిలబడవద్దని సూచిస్తున్నారు.
ద్రోణి, నైరుతి గాలుల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వర్షాలతోపాటు పిడుగులు పడతాయంటూ వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
తెలంగాణలో వడగళ్లతో గాలివానలు..
తెలంగాణలో వడగళ్లతో గాలివానలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తిలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్ కర్నూలు, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణశాఖ అధికారులు.. దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఏపీలో అన్ని ప్రాంతాల్లో రెయిన్ అలర్ట్..
ఏపీలో దాదాపు అన్ని జిల్లాలకు వర్షసూచన చేసింది విపత్తుల నిర్వహణశాఖ. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక.. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణశాఖ..
అపార నష్టం..
కాగా.. చాలా ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించడంతోపాటు.. పెద్దఎత్తున మామిడి నేలరాలింది. అంతేకాకుండా.. కళ్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయ్యింది. దీంతో మామిడి, మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షం నట్టేట ముంచిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు రైతులు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
