Balakrishna Sankranti Movies: బ్లాక్‌బస్టర్ బాలయ్య.. సంక్రాంతికి వచ్చిన సినిమాలివే..!

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే, సినిమా థియేటర్స్ వద్ద ఉండే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక ఈ హీరో ప్రతి సంక్రాంతికి ఓ సినిమాతో అభిమానుల ముందుకు వస్తుంటాడు. కాగా, బాలయ్యబాబు సంక్రాంతి పండుగకు ఏఏ సినిమాలతో వచ్చారో మనం చూద్దాం

Balakrishna Sankranti Movies: బ్లాక్‌బస్టర్ బాలయ్య.. సంక్రాంతికి వచ్చిన సినిమాలివే..!
Balakrishna Sankranti Movies
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Samatha J

Updated on: Jan 10, 2025 | 4:11 PM

తెలుగు ఇండస్ట్రీలో సంక్రాంతి హీరో అని అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణను అనేవాళ్లు. ఏడాది తిరిగేసరికి కచ్చితంగా పండగ బరిలో కనీసం ఒక్క సినిమా అయినా ఉండేలా చూసుకునేవాళ్లు నటశేఖరుడు. ఆ తర్వాత ఆ బిరుదు బాలకృష్ణకి వచ్చింది. ఈయనకు మొదటి నుంచి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. తన సినిమాలను వీలైనంత వరకు పండక్కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంటాడు బాలయ్య. అలాగే అప్పుడొచ్చిన ఆయన సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి కూడా. కొన్నిసార్లు ఏకంగా ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాడు నటసంహం. బాలయ్య కెరీర్‌ను మార్చేసి.. ఆయన్ని మరో మెట్టు ఎక్కించిన సినిమాల్లో సింహభాగం సంక్రాంతికి వచ్చినవే. అందుకే బ్లాక్‌బస్టర్ బాలయ్య అంటుంటారు ఆయన సంక్రాంతికి వచ్చాడంటే..! ఈ మధ్య ఆ సెంటిమెంట్ మరింత పెరిగింది. కనీసం రెండేళ్లకోసారైనా సంక్రాంతి పండక్కి తన సినిమాను తీసుకొస్తున్నాడు బాలయ్య.

11 జనవరి 1985న తొలిసారి సంక్రాంతికి ఆత్మబలం సినిమాతో వచ్చాడు బాలయ్య. సోలో హీరోగా బాలయ్యకు తొలి సంక్రాంతి సినిమా ఇదే. తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత 14 జనవరి 1987న ‘భార్గవ రాముడు’తో పండక్కి వచ్చాడు బాలయ్య. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా ఆడింది. 15 జనవరి 1988న విడుదలైన ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ సినిమాను ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించి సంక్రాంతికి హిట్ కొట్టాడు. 1989 జనవరి 15న విడుదలైన భలే దొంగ బాక్సాఫీస్ దగ్గర హిట్‌ అనిపించుకుంది. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకుడు. 12 జనవరి 1990న విడుదలైన ప్రాణానికి ప్రాణం చిత్రానికి చలసాని రామారావు దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం అందుకోలేదు.

5 జనవరి 1996న విడుదలైన ’వంశానికొక్కడు’ కూడా జస్ట్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఈ సినిమాకు శరత్ దర్శకుడు. 1997 జనవరి 10న పెద్దన్నయ్య సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. 13 జనవరి 1999న విడుదలైన సమరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి హిస్టరీ మార్చేసాడు బాలయ్య. బి.గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు ఉన్న కలెక్షన్ల రికార్డులు తిరగరాసి కనీవినీ ఎరుగని స్థాయిలో విజయాన్ని అందుకుంది. తెలుగులో ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్‌ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. 14 జనవరి 2000న మిలీనియంలో విడుదలైన ‘వంశోద్దారకుడు’ ఫ్లాపైంది. శరత్ ఈ సినిమాకు దర్శకుడు. ఇక 11 జనవరి 2001న విడుదలైన ’నరసింహానాయడు’ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకున్నాడు బాలయ్య. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన రికార్డులు నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

11 జనవరి 2002న భారీ అంచనాల మధ్య విడుదలైన సీమ సింహం దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు జి.రామ్ ప్రసాద్ దర్శకుడు. 14 జనవరి 2004న విడుదలైన ‘లక్ష్మీ నరసింహా’ సినిమాతో మరోసారి సంక్రాంతికి మ్యాజిక్ చేసాడు బాలయ్య. వర్షం, అంజి లాంటి సినిమాలతో పోటీపడి మరీ విజయం సాధించాడు బాలయ్య. జయంత్ సి.పరాన్జీ ఈ సినిమాను తెరకెక్కించాడు. 10 జనవరి 2008న వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్క మగాడు’ భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. 12 జనవరి 2011న విడుదలైన ‘పరమవీరచక్ర’ కూడా దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమాను దర్శకరత్న దాసరి నారాయణ రావు తెరకెక్కించాడు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా.. కథనం బాగా లేకపోవడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో డిజాస్టర్‌గా నిలిచింది. 14 జనవరి 2016న విడుదలైన ‘డిక్టేటర్’ పర్లేదు అనిపించింది. దీనికి శ్రీవాస్ దర్శకుడు.

12 జనవరి 2017న విడుదలైన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాను క్రిష్ తెరకెక్కించాడు. ఈ సినిమా 2017 సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇది బాలయ్యకు 100వ సినిమా కూడా. 12 జనవరి 2018న విడుదలైన ‘జై సింహా’ సినిమాతో సరిగ్గా ఏడాది తిరిగేసరికి మరోసారి పండక్కే వచ్చాడు బాలయ్య. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాగానే ఆడింది. 9 జనవరి 2019న విడుదలైన ‘NTR కథానాయకుడు’ మాత్రం దారుణంగా నిరాశ పరిచింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకాదరణ పొందలేదు. 12 జనవరి 2023న ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతికి వచ్చి విజయం సాధించింది. ఇక ఈ ఏడాది ‘డాకు మహారాజ్’ గా బాలయ్య బరిలోకి దిగుతున్నారు బాలయ్య. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.