Kareena Kapoor: హైదరాబాద్ సంచలన ఘటన ఆధారంగా పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా.. హీరోయిన్గా కరీనా కపూర్..
మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం హీరోయిజం సినిమాలు కాకుండా ఎప్పుడూ విభిన్నమైన కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రాలు రూపొందిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన సంచలన ఘటన ఆధారంగా ఇప్పుడు ఓ మూవీ తెరకెక్కించనున్నారు.

మలయాళీ చిత్రపరిశ్రమలో పృథ్వీరాజ్ సుకుమార్ టాప్ హీరో. ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చారు పృథ్వీరాజ్. ఇటీవలే ఎల్ 2 ఎంపురాన్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. పృథ్వీరాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో నిజ జీవిత సంఘటనతో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. 2019లో హైదరాబాద్లో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా రూపొందించనున్న సినిమాలో పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాకు ధైరా అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. డైరెక్టర్ మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కనిపించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏప్రిల్ 14న అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దర్శకురాలు మేఘనా, పృథ్వీరాజ్ సుకుమార్, కరీనా కపూర్ కలిసి చర్చించుకుంటున్న ఫోటోస్ షేర్ చేశారు. అయితే ఈ సినిమాను నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
నివేదికల ప్రకారం 2019లో హైదరాబాద్ లో జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. 2019లో శంషాబాద్ ఏరియాలో ఓ అమ్మాయిని కొందరు యువకులు అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ ఘటన ఆధారంగానే ధైరా సినిమాను రూపొందించనున్నారని సమాచారం. డైరెక్టర్ మేఘనా కొన్నాళ్లుగా ఈ ఘటనపై పరిశోధనలు చేసిందని.. ప్రజలు, సమాజం గురించి ఆలోచించేలా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ పాత్రలకు లోతైన భావోద్వేగాలు ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అలాగే ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :