Punch Prasad: జగనన్నకు ధన్యవాదాలు.. రోజా, నాగబాబులకు థ్యాంక్స్.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం: పంచ్ ప్రసాద్
పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచింది. సీఎం సహాయ నిధి నుంచి జబర్దస్త్ కమెడియన్ చికిత్సకు తగిన ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే తన తోటి కమెడియన్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ కూడా చేపట్టారు.

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. టీవీ షోల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించే ఆయన కిడ్నీ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గతవారం పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆస్పత్రిలో కూడా జాయిన్ అయ్యాడు. కాగా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం ఆయనకు అండగా నిలిచింది. సీఎం సహాయ నిధి నుంచి జబర్దస్త్ కమెడియన్ చికిత్సకు తగిన ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ హరికృష్ణ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మా టీమ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యింది. అవసరమైన పత్రాలను పరిశీలించి ప్రసాద్ కిడ్నీ మార్పిడి కోసం సీఎం రిలీఫ్ పండ్ కింద LOC మంజూరు చేశాం’ అని తెలిపారు హరికృష్ణ. అలాగే తన తోటి కమెడియన్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపట్టారు. దీనికి స్పందించిన ఎంతో మంది దాతలు ఆయన ఆపరేషన్ కు తగిన ఆర్థిక సాయం అందజేశారు. ఈక్రమంలో తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించి సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు పంచ్ ప్రసాద్. ఈ మేరకు తన తోటి కమెడియన్ జబర్దస్త్ నూకరాజుతో కలిసి యూట్యూబ్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు. అందులో తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చెప్పుకొచ్చాడు.
‘అందరికీ నమస్కారం. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని సాయమందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. దాతలకు, నాగబాబు, మంత్రి రోజా, ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సాయం ఎప్పటికీ నేను మర్చిపోలేను. మీరు చూపిన ప్రేమాభిమానాలకు మా ఫ్యామిలీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. నా తోటి కమెడియన్లు, యూఎస్‌లో ఉన్న కొంతమంది, వేణుస్వామి, ఆర్పీ ఆన్న, జెట్టీ మూవీ హీరో..ఇలా ఎందరూ నాకెంతో తోచిన సహాయం చేశారు. అలాగే నాకు చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు పంచ్ ప్రసాద్. ఇక నూకరాజు మాట్లాడుతూ ‘ఏపీ మంత్రి రోజా సాయంతో జగన్ సర్కారు పంచ్ ప్రసాద్ చికిత్సకు కావాల్సిన డబ్బును సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరు చేసింది. జగనన్నకు రుణపడి ఉంటాం’ అని చెప్పుకొచ్చారు.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




