Allu Arjun: కలెక్టర్ వినతితో కేరళ విద్యార్థిని చదువు బాధ్యతలు స్వీకరించిన అల్లు అర్జున్.. దటీజ్ ఐకాన్ స్టార్ అంటోన్న ఫ్యాన్స్
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సేవాగుణంలోనూ తాను ముందుంటానని నిరూపించుకున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఓ పేద విద్యార్థినిని చదివేందుకు ముందుకు వచ్చి అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ.. మనిషి కనిపించనక్కర్లేదు..! అల్లు అర్జున్ ఆన్‌స్క్రీన్‌లో వాడిన పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్. తెర మీదే కాదు.. తెర వెనుక సైతం.. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన చేసిన గుప్తదానం ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌లోనే కాదు… సోషల్ మీడియా మొత్తంలో సాఫ్ట్ సెన్సేషన్‌గా మారింది.
కేరళలో ఒక పేద విద్యార్థిని మీద అల్లు అర్జున్ చూపిన సేవాగుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. 92 శాతం మార్కులొచ్చినా పై చదువులు చదవలేక ఇబ్బంది పడుతున్న ఒక మలయాళీ అమ్మాయిని ఆదుకున్నారు బన్నీ. ఆమె రిక్వెస్టు విన్న వెంటనే అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ.. అల్లు అర్జున్‌కి ఫోన్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నర్సింగ్ కాలేజ్‌లో మేనేజ్‌మెంట్ కోటాలో సీటుకయ్యే ఖర్చు తాను భరిస్తానంటూ బన్నీ మాటిచ్చారు. సాయం అందుకున్న ఆ అమ్మాయి గురించిన వివరాల్ని కూడా గోప్యంగా ఉంచారు.
వియ్యార్ ఫర్ అలెప్పీ అనే స్లోగన్‌తో కలెక్టర్ చేపట్టిన ఈ మూమెంట్‌లో భాగంగా బన్నీ ఆర్థిక సాయం చేశారు. ట్యూషన్ ఫీజుతో పాటు, నాలుగేళ్ల పాటు హాస్టల్ ఖర్చులు కూడా భరిస్తానని బన్నీ మాటిచ్చారని, తానే ఆ స్టూడెంట్‌ని కాలేజీలో చేర్పించానని కలెక్టర్ కృష్ణతేజ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో… ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటిదాకా తానిచ్చిన సాయం గురించి ఎక్కడా బైట చెప్పకుండా తన హెల్పింగ్ స్పిరిట్‌ని చాటుకున్నారు బన్నీ. దటీజ్ ఐకాన్ స్టార్… అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఎలివేట్ అయిన అల్లు అర్జున్‌కి తెలుగు రాష్ట్రాలతో పాటు… కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. తరచూ కేరళ ప్రజలతో టచ్‌లో ఉంటారు కూడా. గతంలో కేరళ ప్రభుత్వం ఆహ్వానం మేరకు అక్కడి బోట్ ఫెస్టివల్‌కు చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు అల్లు అర్జున్. ఇప్పుడు చేసిన గుప్తదానంతో అక్కడి ఫ్యాన్స్‌కి మరింతగా చేరువయ్యారు ఐకాన్ స్టార్.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..