కళ్లు తెరవలేడు, మాట్లాడలేడు.. శ్రీతేజ్ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది
సంద్యథియేటర్ దగ్గర తొక్కిసలాట జరగడంతో పుష్ప 2 సినిమా వీక్షించడానికి వచ్చిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

సంధ్య థియేటర్ ఘటనతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పుష్ప2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట గురించి తెలిసిందే. అల్లు అర్జున నటించిన పుష్ప-2 గతఏడాది డిసెంబర్ 05 ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. అయితే అంతకు ముందు రోజే అంటే డిసెంబర్ 04 బెనిఫిట్ షోస్ పడ్డాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లోనూ పుష్ప 2 ప్రీమియర్ షోస్ ప్రదర్శించారు. సాధారణంగానే ఈ థియేటర్ కు సినీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు భారీగా వస్తుంటారు. అలాంటిది అల్లు అర్జున్ కూడా వస్తున్నాడని తెలియడంతో సంధ్యా థియేటర్ దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఝులిపించాల్సి వచ్చింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
ఇక అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు తీవ్ర గాయపడ్డాడు. ఈ ఘటన పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. అల్లు అర్జున్ ను అరెస్ట్ కూడా చేశారు. ఆతర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చాడు. ఇదిలా ఉంటే గాయపడ్డ ఆ బాలుడు ఇప్పటికీ హాస్పటల్ లోనే ఉన్నాడు. తొక్కిసలాట సమయంలో జనం ఒక్కసారిగా రేవతి అనే మహిళ ఆమె కొడుకు శ్రీతేజ్ ఇద్దరూ కింద పడ్డారు. దాంతో జనం వారిపైకి ఎక్కేశారు.
ఈ ఘటనలో రేవతి అక్కడికక్కడే చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ గాయపడ్డాడు. తొక్కిసలాట జరిగినప్పుడు శ్రీతేజ్ ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయింది. అతన్ని పక్కకు తీసుకెళ్లి పోలీసులు సీపీఆర్ చేశారు. దాంతో తిరిగి ఊపిరి తీసుకున్నాడు. వెంటనే అతన్ని హాస్పటల్ కు తీసుకెళ్లారు. అప్పటి నుంచి అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 56 రోజులు గడిచినప్పటికీ బాలుడి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ అలానే ఉంది. మొదట్లో ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడేవాడు. ఇప్పుడు ఫ్రీగా ఊపిరి తీసుకోవడంతో అతనికి వెంటిలేటర్‌ను తొలగించారు. కాగా ఇప్పటికీ శ్రీతేజ్ మంచానికే పరిమితం అయ్యాడు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ చికిత్స కొనసాగుతుంది. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూడలేడు.. నోరు తెరిచి మాట్లాడలేడు. ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు. అతను ఎప్పుడు కోలుకుంటాడా.? అని శ్రీతేజ్ తండ్రి, చెల్లెలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. శ్రీతేజ్ వైద్యానికి ప్రభుత్వం సాయం అందిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.