Puri Jagannadh- Charmi: డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీలపై ఈడీ ప్రశ్నల వర్షం.. సుమారు 12 గంటల పాటు విచారణ
లైగర్ సినిమాకు సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై పూరి, ఛార్మికి వారం రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సినీ నటి ఛార్మీల ఈడీ విచారణ ముగిసింది. ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ అయినట్లుగా తెలుస్తోంది. సుమారు12 గంటలపాటు కొనసాగిన విచారణలో పూరీ, ఛార్మీలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. లైగర్ సినిమా నిర్మాణానికి కావాల్సిన నిధుల్లో విదేశీ పెట్టుబడులపై ఆరా తీసింది. కాగా లైగర్ సినిమాకు సంబంధించి పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలపై పూరి, ఛార్మికి వారం రోజుల క్రితం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల విడుదలైన సినిమాకు సంబంధించిన వ్యవహారంలో దుబాయికి డబ్బులు పంపించి అక్కడి నుంచి తిరిగి సినిమాలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. దీనికి సంబంధించిన అంశంపైనే ఇద్దరినీ పదే పదే ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. లైగర్ సినిమాకు ప్రొడ్యూసర్లుగా ఉన్న పూరి, చార్మి అకౌంట్లకు పలు సంస్థల నుంచి డబ్బులు వచ్చాయనే కోణంలోనే ఈడీ అధికారులు ఎక్కువగా ప్రశ్నించారు. విదేశీ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలపై కూడా ఆరా తీసింది. విచారణ పూర్తయిన తర్వాత పూరీ, ఛార్మి ఇద్దరూ వెళ్లిపోయారు.
కాగా పూరి తెరకెక్కించిన లైగర్ సినిమాలో విజయ్‌దేవరకొండ హీరోగా నటించాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా కనిపించింది. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం మోస్తరు కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది. కాగా ఆ మధ్య.. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి కూడా పూరీకి బెదిరింపు కాల్స్ రావటం.. దానికి పూరీ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇవ్వటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ.. పెట్టుబడుల విషయమై ఈడీ అధికారులు పూరీని విచారించటంతో.. లైగర్ మూవీ ఇంకోసారి వార్తల్లోకి వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..