Venu Yeldandi: ‘బలగం’ కథకు మా కుటుంబమే స్పూర్తి.. డైరెక్టర్ వేణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్నది. ఈ క్రమంలో బలగం సక్సెస్ గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు వేణు యెల్దండి. ఈ కథకు తమ కుటుంబమే స్పూర్తి అని అన్నారు.

కమెడియన్గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు వేణు యెల్దండి. వెండితెరతోపాటు.. బుల్లితెరపై కూడా దాదాపు రెండు వందల చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు దర్శకుడిగా మారి మరోసారి ఆడియన్స్ మనసు దొచుకున్నాడు. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘బలగం’. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతున్నది. ఈ క్రమంలో బలగం సక్సెస్ గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు వేణు యెల్దండి. ఈ కథకు తమ కుటుంబమే స్పూర్తి అని అన్నారు.
తనను ఇప్పటివరకు దాదాపు ఇరవై సంవత్సరాలు ప్రేక్షకులు తెరపై చూశారని.. దాదాపు 200 చిత్రాల్లో నటించిన తనకు రావాల్సినంత గుర్తింపు రాలేదని.. అయినా నటిస్తూనే కథలు రాసే పనిలో నిమగ్నమయ్యానని అన్నారు. తాను రాసిన సన్నివేశాలకు, మాటలకు పేరొచ్చిందని.. అలాంటప్పుడు స్వయంగా దర్శకత్వం చేయవచ్చు కదా అనే ఆలోచన వచ్చిందని తెలిపారు. దీంతో నటనక ఆస్కారము ఉన్న కథను రాయాలని ప్రయత్నించినట్లు తెలిపారు.




తాను రూపొందించిన బలగం కథకు తన కుటుంబమే స్పూర్తి అన్నారు. వేణు మాట్లాడుతూ.. “మా ఇంట్లో నేను తొమ్మిదో సంతానం. చాలా పెద్ద కుటుంబం. బంధువులు కూడా ఎక్కువే. మా నాన్న చనిపోయినప్పుడు సంప్రదాయంగా జరిపే కొన్ని కార్యక్రమాలు చేశాం. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏడుపులు, పెడ బొబ్బలు, తినడాలు, తాగడాలు మళ్లీ ఏడవటాలు చూశాను. ఇవన్నీ నాలో బలగం కథ గురించిన ఆలోచన పుట్టించాయి. ఈ చిత్రంలోని కొమురయ్య పాత్రకు మా పెద్దనాన్న రాఘవులు స్పూర్తి. మా పెద్దనాన్న, పెద్దమ్మ చనిపోయినప్పుడు ఊరెళ్లి మా అన్నను ఓదార్చాను. ఆయన నాతో తమ్ముడూ.. అమ్మ నాన్నలది 80 ఏళ్ల అనుబంధం. నాన్న వెళ్లిపోయాడు. ఆయన ఎడబాటు తట్టుకోలేక ఆయన కోసం అమ్మ వెళ్లింది. మాకేం బాధ లేదు అన్నాడు. ఆ మాటతో నాలో ఆలోచన మొదలైంది. ఇదే నా కథలో కీలకంగా తీసుకున్నాను. దిల్ రాజుకు కథ చెప్పడంతో ఆయనకు నచ్చి సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చారు”అంటూ చెప్పుకొచ్చారు.




