Cab Services: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. అతి తక్కువ ధరకే ప్రయాణం.. ప్రభుత్వం నుంచి కొత్త యాప్
ప్రజలకు ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి క్యాబ్ ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. ఆ యాప్ వివరాలు..

ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా మరో వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అదే క్యాబ్ సర్వీస్. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థల ఆపరేటర్లు అయిన ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. వాటిల్లో బైక్, కారు క్యాబ్ సర్వీస్ ధరలు భారీ మొత్తంలో ఉంటున్నాయి. ఇక రద్దీ, వర్షం సమయాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. తక్కువ దూరానికి కూడా అధిక ఛార్జీలు తీసుకుంటున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని ప్రజలు వాడుతున్నారు. అయితే ప్రజలను ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల బారి నుంచి తప్పించుందుకు ఏపీ ప్రభుత్వమే సొంతగా ఓ యాప్ తీసుకురానుంది.
ఇకపై ఆంధ్రా ట్యాక్సీ యాప్
ఆంధ్రా ట్యాక్సీ పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ తీసుకురానుంది. త్వరలో దీనిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ యాప్ ద్వారా ప్రజలు తక్కువ ధరకే ఆటో, ట్యాక్సీ సేవలను అందించనుంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ జిల్లాలో ఈ యాప్ సేవలను ప్రారంభించనున్నారు. దుర్గగుడి, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రదేశాలకు ప్రజలు తక్కువ ధరకే చేరుకునేలా ఇందులో సేవలు అందించనున్నారు. విజయవాడలోని స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్లు తెలియనివారి నుంచి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల జేబుకు చిల్లులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వమే యాప్ తీసుకురావాలని నిర్ణయించింది. దీని ద్వారా పర్యాటకం పెరగడమే కాకుండా ప్రజలకు మెరుగైన క్యాబ్ సేవలు అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఎలా పని చేస్తుందంటే..?
గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. మీరు వెళ్లాలనుకున్న ప్రాంతం పేరును సెలక్ట్ చేసుకుంటే యాప్‌లో నమోదు చేసుకున్న డ్రైవర్ల వివరాలు డిస్‌ప్లే అవుతాయి. దీంతో సమీపంలోని డ్రైవర్లు మిమ్మల్ని వచ్చి పిక్ చేసుకుంటారు. ఇక వాట్సప్,ఫోన్ కాల్ ద్వారా కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. ఇక మహిళల భద్రత కోసం వాహనాల డేటా, బుకింగ్ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకునేలా యాప్ రూపొందించినట్లు తెలుస్తోంది.




