Andhra: అంజన్న ఆన.. ఆలయంలోకి మహిళలకు నో ఎంట్రీ.. మడి, హడావుడి అంతా మగరాయుళ్లదే..
అనగనగా ఒక గుడి. అక్కడ మహిళలకు హండ్రెడ్ పర్సెంట్ నో ఎంట్రీ. మడి, హడావుడి అంతా మగానుభావులదే. పూజలు చేసేది వాళ్లే. శుచి గా రుచిగా పొంగళ్లు తయారు చేసిది కూడా మగాళ్లే. మహిళలు దర్శనం చేసుకోవచ్చు. కానీ అల్లంత దూరం నుంచే దండం పెట్టుకోవాలి. వాళ్లకు ప్రసాదాలు ఇవ్వరు. ఇచ్చినా మహిళలు ఆ ప్రసాదాన్ని తినరు. ఎందుకంటే అది తరతరాల కట్టుబాటు. సంజీవరాయుడిగా కొలువైన అంజన్న ఆన.

తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లిలో సంక్రాంతి మేల్ పొంగల్‌కు ఫేమసైంది. సంక్రాంతి పండుగ కు ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవరాయుడి ఆలయంలో పొంగళ్ల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఉద్యోగ,ఉపాధిరీత్యా ఎక్కెడెక్కిడో వెళ్లిన వాళ్లు ఈ పండగ కోసం రెక్కలుకట్టుకొని సొంతూరికి వచ్చేస్తారు. పొంగిళ్ల తయారీలో మహిళల పాత్ర ఉండదు. ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. మగానుభావులే మడి కట్టుకుని నిష్టగా వంటావార్పు చేస్తారు. నలభీమకాన్ని సంజీవరాయుడికి నైవేధ్యంగా సమర్పిస్తారు.
సంజీవరాయడి గుళ్లోకి మహిళలు వెళ్లరు.కానీ దూరం నుంచే స్వామిని దర్శనం చేసుకుంటారు. భక్తితో మొక్కులు చెల్లించుకుంటారు.పొంగలి తయారీలో మహిళల ప్రమేయం అస్సలు ఉండకూడదు. కనీసం కట్టెపుల్ల కూడా అందించకూడదు. కర్రలు తెచ్చుకోవడం..పొయ్యి వెలిగించడం..ప్రసాదం తయారీ అన్నీ మగవాళ్లే చేస్తారు.బీజాక్షరాలతో సంజీవరాయుడిగా కొలువైన అంజన్న దయనే తమకు శ్రీరామక్ష అంటున్నారు గ్రామస్థులు..
ఒకప్పుడు కరువుతో విలవిల్లాడిన ఈ ప్రాంతానికి ఓ పెద్దాయన వచ్చారట. స్థానికుల కష్టాలను చూసి చలించిన ఆయన.. బీజాక్షరాలు రాసి సంజీవరాయ విగ్రహాన్ని స్థాపించారట. అప్పటి నుంచి కరువు కాటకలు పోయాయట. ఆయన చెప్పిన సంప్రదాయాలను నేటికి ఆచారంగా పాటిస్తున్నారు గ్రామస్థులు.
సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం పొంగళ్ల పండగ నిర్వహిస్తారు.అందులో ఎక్కడా మహిళల పాత్ర వుండదు.అలాగని అది ఏమాత్రం వివక్ష కాదు. తరతరాల ఈ ఆచారం వెనుక అంతరార్ధం వుందంటున్నారు తిప్పాయిపల్లెవాసులు..
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
