Recharge Prices: భారీగా పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఈ నెల నుంచే అమల్లోకి..! ఒకేసారి ఎంతంటే..?
రీఛార్జ్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. దీంతో మొబైల్ వినియోగదారులపై భారం మరింత పెరగనుంది. ఇప్పటికే రీఛార్జ్ ధరలు షాక్ కొడుతుండగా.. మరింత పెరగడం వల్ల సామాన్యులపై భారం పెరగనుంది. ఎంత వరకు పెరుగుతున్నాయంటే..

Recharge Tariffs: మొబైల్ వినియోగదారులకు త్వరలో బిగ్ షాక్ తగలనుంది. రీఛార్జ్ ధరలను 2026లో టెలికాం కంపెనీలు పెంచనున్నాయని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. జనవరిలోనే రీఛార్జ్ ధరలు పెరుగుతాయని వార్తలు రావడంతో ఈ నెలలోనే పెంపు ఉంటుందని అందరూ ఊహించారు. కానీ టెలికాం కంపెనీలు మరికొంత సమయం తీసుకోనున్నాయని తెలుస్తోంది. 2024లో రీఛార్జ్ ధరలను భారీగా పెంచగా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ సారి భారీగా పెరగనున్నాయని సమాచారం. 5జీ విస్తరణ, ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు టెలికాం కంపెనీలకు భారమవుతుంది. దీంతో ప్రయాణికులపై భారం వేసేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి.
జూన్‌లో పెంపునకు సిద్దం
టెలికాం కంపెనీలు అన్నీ మూకుమ్మడిగా రీఛార్జ్ ధరలను పెంచేందుకు సర్వం సిద్దం చేసుకుంటున్నాయి. జూన్‌లో రీఛార్జ్ ధరలను పెంచనున్నాయని ఆర్ధిక సేవల సంస్థ జెఫ్రీస్ తన రిపోర్టులో పేర్కొంది. ఏకంగా 15 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. త్వరలో జియో పబ్లిక్ ఐపీఓకు లిస్ట్ కానుంది. భారీగా నిధులు సమీకరించనుండగా.. దేశంలోనే ఇప్పటివరకు ఇదే అతిపెద్ద ఐపీఓకు చెబుతున్నారు. దీని వల్ల టెలికాం రంగంలో మార్కెట్ వాల్యూయేషన్ పెరుగుతుందని జెఫ్రీస్ సంస్థ తన నివేదికలో పొందుపర్చింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో టెలికాం రంగం ఆదాయ వృద్ధి 16 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇక పోస్ట్ పెయిడ్, డేటా వినియోగం కూడా పెరగడంతో టెలికాం కంపెనీలకు కూడా ఆదాయం పెరుగుతున్నట్లు పేర్కొంది.
జియో ఎంత పెంచనుందంటే..?
జియో దాదాపు 10 నుంచి 20 శాతం వరకు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచనుందని తెలుస్తోంది. ఇక ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ఇదే స్థాయిలో పెంచనున్నాయి. దీని వల్ల మొబైల్ వినియోగదారులపై మరింత భారం పెరగనుంది. ఇప్పటికే జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు అధికంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు మరింత పెంచితే సామాన్యులకు రీఛార్జ్ ధరలు షాక్ కొట్టనున్నాయి. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు భారం కానుంది. 2024లో మధ్యలో కంపెనీలు టారిఫ్ ధరలను 15 శాతం వరకు పెంచాయి. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం పెంచలేదు. ఇప్పుడు కూడా బీఎస్‌ఎన్‌ఎల్ పెంచేందుకు సిద్దంగా లేదు. 5జీని దేశవ్యాప్తంగా విస్తరణ చేసేందుకు కొత్త టవర్ల ఏర్పాటుకు కంపెనీలకు భారీగా నిధులు అవసరం అవుతున్నాయి. అలాగే ఏఐని అందిపుచ్చుకునేందుకు నిర్వహణ ఖర్చు ఎక్కువవుతుంది. దీంతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు రీఛార్జ్ ధరలను పెంచక తప్పదని రీఛార్జ్ కంపెనీలు చెబుతున్నాయి. మరి రీచార్జ్ ధరల ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుందో చూడాలి.
