Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సీబీఐ నోటీసులు.. విచారణకు రావాలంటూ ఆదేశం
ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన దళపతి విజయ్.. ఇప్పుడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు. కొన్నాళ్ల క్రితం తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించారు విజయ్. ఇప్పుడు సినిమాలు పూర్తిగా తగ్గించి.. రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు.

స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. కరూర్ దుర్ఘటన పై విజయ్ కు సీబీఐ నోటీసులు పంపడం ఇప్పుడు కలకలంరేపింది. జనవరి 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విజయ్ హాజరు కావాలని ఆదేశించారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన విజయ్ భారీ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి సభ నిర్వాహకులు ఎన్. ఆనంద్, అధవ్ అర్జున, సీటీఆర్ నిర్మల్ కుమార్‌లను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించింది. ఇక ఇప్పుడు విజయ్ కు నోటీసులు పంపించారు. మరి దీని పై విజయ్ ఎలా స్పందిస్తాడు.? విచారణకు విజయ్ హాజరవుతారా.? లేదా.? అన్నది చూడాలి.
అంతేకాకుండా ఢిల్లీ, కరూర్‌లలో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ఓ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట అందరినీ తీవ్ర దిగ్భ్రాంఇకి గురిచేసింది. గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ ఘటనలో మొత్తం 41 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
ఈ ఘటన తర్వాత హీరో, టీవీకే అధినేత విజయ్ పై విమర్శలు కూడా వచ్చాయి. దీనికి తోడు కరూర్ బాధితులను విజయ్ పరామర్శించలేదన్న విమర్శలు కూడా వినిపించాయి. ఈ సంఘటనపై సానుభూతి వ్యక్తం చేసిన విజయ్ 41 మంది బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించారు. దీని ప్రకారం, ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ కూడా చేశారు. అదేవిధంగా బాధిత కుటుంబాలను చెన్నైకి తీసుకువచ్చి నేరుగా మాట్లాడారు విజయ్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




