Balayya-Tarakaratna: ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో.. తారక్ చేతిపై బాలయ్య సిగ్నేచర్ టాటూ..
తారకరత్న పార్థివదేహాన్ని బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. మోకిలాలోని ఆయన స్వగృహంలో ఉంచారు. తారకరత్న పార్థికదేహం చుట్టూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
నటసింహం బాలకృష్ణకి – తారకరత్నకు ఉన్న అనుబంధమే వేరు. అబ్బాయ్ అంటే బాబాయ్‌కి ఎనలేనంత ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు అబ్బాయ్ దగ్గరే ఉండి అన్నీ తానై చూసుకున్నారు బాలకృష్ణ. కుప్పకూలిన రోజున చెవిలో మృత్యుంజయ మంత్రం జపించారు. అలాగే చిత్తూరు జిల్లాలో మృత్యుంజయ అఖండ దీపం కూడా వెలిగించారు. అన్ని దేవుళ్లకు పూజలు చేయించారు. విదేశాల నుంచి నిపుణులైన వైద్యుల్ని పిలిపించి మరీ చికిత్స చేయించారు. తారకరత్నను బతికించుకునేందుకు మానవ ప్రయత్నాలు అన్నీ చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
బాబాయ్‌కి అబ్బాయి మీద ఎంత ప్రేమ ఉందో.. అబ్బాయికి బాబాయ్ మీద కూడా అంతే ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకే బాబాయ్ సిగ్నేచర్‌ను ఒంటిపై టాటూగా వేయించుకున్నారు తారకరత్న. పైన సింహం బొమ్మ.. దిగువన బాలయ్య సిగ్నేచర్ ఉన్న టాటూ ఇప్పుడు వైరల్‌గా మారింది. తారకరత్న చేతిపై నటసింహం పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారంటే బాలకృష్ణను ఎంతగా ఆరాధించారో వేరే చెప్పక్కర్లేదు. అంతేకాదు.. బాలయ్య ఎలాగైతే నాన్నగారి పేరును స్మరిస్తారో.. అలానే తారకరత్న బాల బాబాయ్.. బాల బాబాయ్ నిత్యం పరితపించేవారని ఆయనతో దగ్గరిగా మెలిగిన సన్నిహితులు చెబుతున్నారు.
నందమూరి బాలకృష్ణ ఇప్పుడు నటిస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా నటించడానికి అంగీకరించారు తారకరత్న. ఈ సినిమాలో నటించి ఉంటే, తారకరత్న కెరీర్ ఇంకో రకంగా ఉండేదని అంటున్నారు విశ్లేషకులు. గతంలో నారా రోహిత్ నటించిన రాజా చేయి వేస్తే సినిమాలో కూడా ప్రతినాయకుడి పాత్ర పోషించారు తారకరత్న.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.