Nagarjuna : పాన్ ఇండియా సినిమాలపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బాహుబలి, పుష్ప గురించి ఏమన్నారంటే..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025) ఘనంగా మొదలైన సంగతి తెలిసిందే. గురువారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీప్రముఖులు సందడి చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న అక్కినేని నాగార్జున పాన్ ఇండియా సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్ 2025) గురువారం ముంబై అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇతర ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శ్రీలీల, శోభిత దూళిపాళ్ల స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. మొదటి రోజు హోస్టుగా కార్యక్రమాన్ని నడిపించిన నాగ్.. రెండో రోజు శుక్రవారం సమ్మిట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టాల్ ను ఆవిష్కరించారు. ఈ సదస్సులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వేడుకలో తమిళ హీరో కార్తి, సీనియర్ నటి ఖుష్బూ, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ లతో కలిసి పాన్ ఇడియా సినిమా పై కింగ్ నాగార్జు్న్ మాట్లాడారు.
“పుష్ప, బాహుబలి, కేజీఎఫ్ సినిమాలు దక్షిణాదిలో కంటే హిందీలోనే ఎక్కువ వసూళ్లు సాధించాయి. ఈ తెలుగు సినిమాలను ప్రపంచ సినీప్రియులు మెచ్చారు. ఇలాంటి కథలను మనం ఇంతకు ముందూ చూశాం. ఉత్తరాది ప్రేక్షకులు కూడా పుష్పరాజ్, యశ్ లాంటి హీరోలను అక్కడి సినిమాల్లో చూడాలని అనుకుంటున్నారు. వారందరికీ కావాల్సిందే ఇలాటి లార్జర్ దేన్ లైఫ్ హీరోలే. రోజువారి జీవితంలో ప్రజలు ఎంతో ఒత్తిడితో ఉంటారు. సినిమాలు చూడడం ద్వారా ఆ ఒత్తిడిని అధిగమించాలనుకుంటున్నారు. అలాంటి ప్రేక్షకులకు మనం తెరపై మాయజాలం చూపించాలి. పాన్ ఇండియా సినిమాల రహస్యం ఒకటే. స్థానిక కథలను తెరపైకి తీసుకువచ్చి వసూళ్లు సాధిస్తున్నారు. భారతీయ సినిమాల కథ, కథనాల విషయంలో ప్రాంతీయతను కోల్పోకుండా చిత్రాలను రూపొందిస్తున్నాయి. అవి స్థానిక కథల నుంచి దూరంగా వెళ్లడం లేదు. అందుకే భారతీయ సినిమాలు విజయవంతమయ్యాయి. దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమాలోని ప్రతీ ఫేమ్ ను తెలుగుతనం ఉట్టిపడేలా తీశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు దాన్ని ఇష్టపడ్డారు. మీరు మీ మాతృభాషపై దృష్టి పెట్టి కథ చెప్తే కచ్చితంగా ప్రేక్షకులకు చేరువవుతుంది ” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. చివరిసారిగా నా సామిరంగ చిత్రంలో కనిపించిన నాగ్.. ఇప్పుడు కుబేర, థగ్ లైఫ్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు అడియన్స్ ముందుకు రానున్నాయి.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
