Allu Arjun Press Meet: నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటం బాధగా ఉంది: అల్లు అర్జున్‌

Allu Arjun Press Meet: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్.. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ ఘటన చాలా దురదృష్టకరమైనదని, దానికి ఎవరు బాధ్యులు కాదని చెప్పారు. అంతేకాకుండా.. శ్రీతేజ్ చికిత్స, ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తాను తెలుసుకుంటున్నానని చెప్పుకొచ్చారు..

Allu Arjun Press Meet: నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటం బాధగా ఉంది: అల్లు అర్జున్‌
Follow us
Subhash Goud

|

Updated on: Dec 21, 2024 | 11:42 PM

తెలంగాణ అసెంబ్లీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హాట్ హాట్‌గా చర్చలు నడిచాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినీ ఇండస్ట్రీపై విరుచుకుపడ్డారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో హీరో అల్లు అర్జున్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సంధ్య థియేటర్‌ ఘటనలో ఎవరి తప్పు లేదని, అనుకోకుండా జరిగిన సంఘటన అని, ఈ ఘటన నన్ను ఎంతో బాధించిందని వ్యాఖ్యానించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని అన్నారు.

అతను కోలుకుంటున్నాడని తెలిసి చాలా సంతోషించానని, సంధ్య థియేటర్ ఘటన నిజంగా అత్యంత దురదృష్టకరం అన్నారు. ప్రేక్షకులను ఆనందింప చేయాలనే ఆలోచనే ఉందని, థియేటర్ అంటే నాకు దేవాలయం వంటిదన్నారు. అలాంటి థియేటర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఎంతో బాధేసిందన్నారు. మీడియా సమావేశంలో బన్నీ కొంత ఎమోషన్‌కు గురయ్యారు.

తన అభిమానులకు ఏదైనా జరిగితే తాను ఎంతో బాధపడతానని, అలాంటిది బయట అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. ఇలాంటి ప్రచారం వల్ల తనకు ఎంతో బాధేసిందని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. ఈ సంధ్య థియేటర్ ఘటనపై తాను ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని, నా సినిమాను సైతం థియేటర్‌లో చూడలేకపోతున్నానని పేర్కొన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఇంట్లో ఒక్కడిని కూర్చుని బాధపడుతున్నానని అన్నారు. తాను తెలుగు సినిమా స్థాయిని పెంచాలనే చూస్తానని, నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటం బాధగా ఉందన్నారు. ఈ విషయాలన్ని చెప్పడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేశానని, నేను ఎవ్వరిని ఇబ్బంది పట్టేందుకు కాదని, తనను అర్థం చేసుకోవాలని అన్నారు. నాపై వస్తున్న ఆరోపణలన్ని పూర్తిగా అసత్యమని చెప్పారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి