Vijayakanth: విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా.. కెప్టెన్ త్వరగా కోలుకోవాలంటూ..
ప్రముఖ తమిళ సినీనటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ (Vijayakanth)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) పరామర్శించారు. విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలతా విజయకాంతతో ఫోన్‌లో మాట్లాడి ..
ప్రముఖ తమిళ సినీనటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ (Vijayakanth)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) పరామర్శించారు. విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలతా విజయకాంతతో ఫోన్‌లో మాట్లాడి డీఎండీకే అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని ఆకాంక్షించారు. కాగా గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు విజయ్‌కాంత్. మధుమేహంతో బాధపడుతోన్న ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మధుమేహం అధికం కావడంతో కుడి కాలి వేళ్లలో ఒకదానిని వైద్యులు తొలగించినట్లు డీఎండీకే పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘కొంతకాలంగా విజయ్‌కాంత్ మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయన కుడి కాలి వేళ్లకు రక్తం సరఫరా కావడంలేదు. దీంతో వైద్యులు దానిని అత్యవసరంగా తొలగించారు. ప్రస్తుతం విజయకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ప్రసార మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యంపై వస్తోన్న పుకార్లను నమ్మవద్దు’ అని ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
ఇనిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్‌కాంత్ సుమారు 100కి పైగా చిత్రాల్లో నటించారు. తన అభినయంతో ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకుల్ని అలరించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. తన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ ఘన విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ విజయ్‌కాంత్‌ను కెప్టెన్‌గా పిలుస్తున్నారు. సినిమాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. అయితే విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సర్జరీల మీద సర్జరీలు చేస్తూ ఉన్నా ఆయన ఆరోగ్యం కుదుటపడడం లేదు. ఈక్రమంలో కెప్టెన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, డీఎండీకే పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..