Nayanthara vs Dhanush: రూ.10 కోట్ల వెనుక 10 ఏళ్ల కసి! చల్లారని 3 సెకన్ల చిచ్చు.. చిన్న కథ కాదు ఇది..
కొన్నికొన్ని విషయాల్లో కొత్తదనం ఏమీ ఉండదు. అందరికీ, అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయ్ అందులో. కాని, ఆ సబ్జెక్ట్ రాగానే ఇంట్రస్ట్ వచ్చేస్తుంటుంది చాలామందికి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరగబోతోందని తెలుసుకోవడంపై తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటిలో ప్రజెంట్ నడుస్తున్న ఒక టాపిక్.. నయన్-ధనుష్ మధ్య గొడవ..
కొన్నికొన్ని విషయాల్లో కొత్తదనం ఏమీ ఉండదు. అందరికీ, అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయ్ అందులో. కాని, ఆ సబ్జెక్ట్ రాగానే ఇంట్రస్ట్ వచ్చేస్తుంటుంది చాలామందికి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏం జరగబోతోందని తెలుసుకోవడంపై తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటి వాటిలో ప్రజెంట్ నడుస్తున్న ఒక టాపిక్.. నయన్-ధనుష్ మధ్య గొడవ. ‘Nayanthara: Beyond The Fairy Tale’ డాక్యుమెంటరీలో ఒక చిన్న మూవీ క్లిప్ ఉపయోగించుకోవడం విషయంలో ఇద్దరి మధ్య రగడ మొదలై.. ఇప్పుడు కోర్టులో దావా వేయడం వరకు వెళ్లింది. ఈమధ్యలో నయన్‌ను సపోర్ట్ చేస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు.. లేదూ, ధనుష్ చేసిందే కరెక్ట్ అని కొంతమంది, ధనుష్ ఇలా చేస్తారని ఊహించలేదని మరికొంతమంది. ఇలాంటి రభస ఎంతో జరిగింది. ఇంతకీ.. అసలు గొడవ ఎక్కడ మొదలైంది? ‘మూడు సెకన్ల’ క్లిప్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదు ధనుష్‌కి..! అయినా సరే.. ఎందుకంత పట్టుబట్టారు? ఏదో పర్టిక్యులర్ రీజన్ ఉంటేనే కదా తెగేదాకా లాగేది…
మనసులోని పగను చూపించే మిషీన్స్ లేవు మనదగ్గర. అవే ఉండుంటే నయన్-ధనుష్ మధ్య గొడవకు అసలు కారణం దొరికేసేది. కాని, ఆ మెషీన్స్ లేకపోయినా ఇద్దరి మధ్య అసలు గొడవకు కారణం దొరికేసింది. ‘ఇంతలా మనసులో పెట్టుకున్నారా’ అని అనిపించే కారణం అది. నయనతార-ధనుష్ మధ్య గొడవ ఎక్కడ మొదలైందో తెలియాలంటే.. ఓ పదేళ్లు వెనక్కి వెళ్లాలి. 2015లో మొదలైంది ఈ కథ. నయనతార సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది 2003లో. కొన్ని సినిమాలు హిట్లు, మరికొన్ని ఫ్లాప్‌లు. తను నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అయినా సరే.. నయనతారకు మాత్రం పెద్దగా ఫేమ్ రాలేదు. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయ్. కాని, 2015లో వచ్చిన సినిమా నయనతార ఫేట్ మార్చేసింది. అదే.. నానుమ్ రౌడీతాన్. ఈ సినిమాకు నిర్మాత హీరో ధనుష్. డైరెక్టర్.. విఘ్నేష్ శివన్. ఇప్పుడు జరుగుతున్న గొడవకు బీజం పడింది అక్కడే. ఆ సినిమాను 4 కోట్ల బడ్జెట్‌తో తీద్దామనుకున్నారు ధనుష్. కాని.. ఊహించని విధంగా అదనంగా మరో 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సినిమా పెద్ద హిట్టే. దర్శకుడిగా విఘ్నేష్‌కు, హీరోయిన్‌గా నయనతారకు మంచి పేరొచ్చింది. ఎటొచ్చీ నిర్మాత ధనుష్‌కే బడ్జెట్ పెరిగిపోవడం వల్ల పెద్దగా లాభాలు రాలేదు. పైగా ఆ సినిమా సమయంలో ‘నయన్-విఘ్నేష్’ మధ్య ప్రేమ చిగురించింది. షూటింగ్ సమయంలో ఆల్‌మోస్ట్ లవ్‌బర్డ్స్‌గా తిరిగారు. ప్రేమలో పడడం తప్పు లేదు గానీ.. ఆ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమైంది. దీనికి కారణం.. షూటింగ్ టైమ్‌లో నయనతార-విఘ్నేష్ ప్రేమాయణమే అనేది కొందరి విమర్శ. వీరిద్దరి లవ్ ట్రాక్ కారణంగానే.. సినిమా ఆలస్యం అవడం, దానికి తోడు సినిమా బడ్జెట్ కూడా ఊహించని రేంజ్‌కి పెరగడం జరిగిందని చెబుతున్నారు. బడ్జెట్‌పై ధనుష్‌ను బలవంతంగా ఒప్పించింది నయన్-విఘ్నేషే అనే ప్రచారం కూడా బలంగా జరిగింది. అంతేకాకుండా.. సినిమా హిట్ అయినా లాభాలు రాకపోగా.. తన టైమ్ తినేశారనే కోపం ధనుష్‌లో ఉండిపోయిందంటున్నారు. ఆ కోపాన్ని అప్పట్లోనే మరోలా బయటపెట్టారు ధనుష్. ‘నానుమ్ రౌడీతాన్’ సినిమాలో నయన్ యాక్టింగ్ ఏమంత బాగోలేదని ధనుష్ ఓపెన్‌గానే కామెంట్ చేశారు. ఆ సినిమాలో లీడ్ రోల్ చేసింది హీరో విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి ముందు ఎవరైనా తేలిపోవాల్సిందే. అలా విజయ్‌తో పోల్చి నయన్ నటన బాగోలేదన్నారా.. లేక నిజంగానే బాగా అనిపించలేదా? లేదా.. తన టైమ్, మనీ తినేశారనే కోపం లోలోన ఉంది కాబట్టి అది మనసులో పెట్టుకుని అలా అన్నారా? కారణం ఏదైనా ఓ కామెంట్ అయితే చేశారు ధనుష్. ఆ కామెంట్ చేశాక.. నయనతార కూడా ఓపెన్‌గానే సారీ చెప్పారు. అయినా సరే.. అప్పటి నుంచి ధనుష్ మనసులో ఆ కోపం అలా ఉండిపోయింది అని చెప్పుకుంటుంటారు.
నిజానికి నయన్-ధనుష్ మంచి ఫ్రెండ్స్. 2008లో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాను.. 2008లో నయన్-ధనుష్ హీరోహీరోయిన్లుగా ‘యారాడి నీ మోహిని’ మూవీగా రీమేక్ చేశారు. ఆ సినిమా నుంచి నయన్-ధనుష్ మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఆ మూవీ ప్రమోషన్స్ విషయంలో ఇద్దరూ ఎంగేజ్ అయ్యారు కూడా. ఆ స్నేహంతోనే ఒక నిర్మాతగా 2015లో నయనతార హీరోయిన్‌గా నానుమ్ రౌడీతాన్ తీశారు ధనుష్. కాని, ఆ సినిమా విషయంలో ఏం జరిగిందో ఇందాకే చెప్పుకున్నాం కదా. నయన్‌పై ధనుష్‌కి ఒకరకమైన కోపం ఏర్పడ్డానికి కారణం అయింది ఆ సినిమానే. ఆ కోపం పదేళ్ల తరువాత బయట పడిందా అంటే.. ఎస్.. బయటపడిందనే చెప్పాలి. మానిపోయిన గాయాన్ని రేపడం అంటేరే.. అదే జరిగింది ఇక్కడ కూడా. సరిగ్గా.. నయన్‌పై కోపం పెరగడానికి కారణమైన ‘నానుమ్ రౌడీతాన్’ సినిమా క్లిప్పే అడిగారు నయనతార అండ్ విఘ్నేష్. ‘Nayanthara: Beyond The Fairy Tale’ డాక్యుమెంటరీ కోసం.. నయన్-విఘ్నేష్ మధ్య పరిచయం ఏర్పడానికి కారణమైన ఆ మూవీ క్లిప్ అవసరం వచ్చింది. నయన్-విఘ్నేష్ మధ్య ప్రేమ చిగురించింది ఆ సినిమా టైమ్‌లోనే కాబట్టి.. నానుమ్ రౌడీతాన్ సినిమా క్లిప్ అడిగారు. కాని, చిన్న క్లిప్‌కు కూడా 10 కోట్లు అడిగారు హీరో ధనుష్. బహుశా ఆనాటి టైమ్‌వేస్ట్, మనీ వేస్ట్ మరోసారి గుర్తొచ్చి ఉండొచ్చు ధునుష్‌కి. ఇక్కడ.. ’10 కోట్లు’ అని ఆ రేటే ఎందుకు ఫిక్స్ చేశారు ధనుష్..? బహుశా తాను అనుకున్న బడ్జెట్ 10 కోట్లు పెరిగింది కాబట్టి అనా..! అందుకే, అంత పర్టిక్యులర్‌గా 10 కోట్లు అడిగారా..! నిజానికి, మూడు సెకన్ల క్లిప్ కాదు.. సినిమా మొత్తం వాడుకున్నా ఒప్పుకునే వారేమో ధనుష్. కాని, ఆ సినిమా టైమ్‌లో జరిగిన విషయాలను ఇంకా మనసులో పెట్టుకున్నట్టున్నారు. అదే నిజమైతే.. ధనుష్ కోపానికి అర్థం ఉన్నట్టే. కాకపోతే.. ఇన్నేళ్లైనా ఆ విషయం మరిచిపోకపోవడంలో అర్థం లేదు. నిజానికి ఆ మూడు సెకన్లు లేకపోయినా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ ఆగేది కాదు. ఆ మూడు సెకన్లు ఇవ్వనందుకు నయన్ ఇంత రచ్చ చేయాల్సిన అవసరం కూడా లేదు.
ఇక్కడ నయనతార గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. హీరోయిన్‌గా స్టార్‌డమ్‌తో పాటు కొన్నిసార్లు వివాదాలు, అవమానాలు కూడా పడ్డారు. అప్ అండ్ డౌన్స్‌ను దాటుకుని ఇప్పుడు ఏకంగా ‘లేడీ సూపర్‌స్టార్’ అయ్యారు. నయనతార లైఫ్ జర్నీలో మూడుసార్లు ప్రేమలో పడ్డారని చెబుతుంటారు సినీ క్రిటిక్స్. 2006లో వల్లవన్ సినిమా వచ్చింది. తెలుగులో వల్లభ. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరో శింబుతో ప్రేమలో పడ్డారనే గాసిప్స్ వినిపించాయి. కొన్ని రోజుల తరువాత 2006 నవంబర్‌లో ‘శింబుతో తాను ప్రేమలో లేను, ఇకపై తనతో నటించను’ అనే స్టేట్‌మెంట్ వచ్చింది నయనతార నుంచి. ఇక 2008లో ‘విల్లు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో ప్రేమలో పడ్డారు. 2009 జూన్‌లో నయన్-ప్రభుదేవాకి పెళ్లి అయిపోయిందనే టాక్ కూడా వచ్చింది. ప్రభుదేవా పేరును నయన్ టాటూ వేయించుకున్నారన్న వార్త కూడా అప్పట్లో వైరల్ అయింది. ఇద్దరూ ఓపెన్‌గానే తమ ప్రేమను చెప్పుకున్నారు. ఏమైందో గానీ.. 2012లో ప్రభుదేవాతో బ్రేకప్ అంటూ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇక 2015లో నానుమ్ రౌడీతాన్ సినిమా వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో విఘ్నేష్ శివన్‌తో ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది.
జాగ్రత్తగా గమనిస్తే.. నయనతార ప్రేమలో పడిందని చెబుతున్న ఆ మూడు సందర్భాలు కూడా.. తాను నటించిన సినిమాల డైరెక్టర్లతోనే జరిగాయి. మళ్లీ ఒకసారి రీ-క్యాప్ చేద్దాం. 2006లో వల్లవన్ సినిమా సమయంలో నయన్ ప్రేమలో పడ్డారు. ఆ సినిమా డైరెక్టర్ శింబు. 2008లో విల్లు సినిమా టైమ్‌లో నయన్ మరోసారి ప్రేమలో పడ్డారు. ఆ సినిమా డైరెక్టర్ ప్రభుదేవానే. 2015లో నానుమ్ రౌడీతాన్ సినిమా సమయంలోనూ లవ్‌లో ఉన్నారు నయన్. ఆ మూవీ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.
ఇంతకీ.. డయానా మరియం కురియన్ ‘లేడీ సూపర్‌స్టార్’ ఎలా అయ్యారు..? మధ్యలో ఈమెవరు అనుకోకండి. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. తన మొదటి సినిమా డైరెక్టర్ సత్యన్ ‘నయనతార’ అనే పేరు పెట్టారు. టైటిల్స్‌లో డయానా అనే పేరు బాగోలేదని ఓ మూడు పేర్లు రాసుకున్న డైరెక్టర్.. అందులో ఒకటి సెలెక్ట్ చేశారు. అలా సెలక్ట్ చేసిందెవరో తెలుసా.. ఒక క్లాప్ బాయ్. అలా డయానా నయనతార అయ్యారు. తన లైఫ్‌లో ఓ మేజర్ ఇన్సిడెంట్ 2011లో జరిగింది. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన నయనతార.. ఆర్య సమాజ్ టెంపుల్‌లో హిందూయిజం తీసుకున్నారు. ప్రభుదేవాను పెళ్లి చేసుకోడానికే హిందూయిజం తీసుకున్నారని టాక్. ఇవే కాదు.. సినిమా ఫీల్డ్‌లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు నయన్. ముఖ్యంగా బాడీ షేమింగ్ గురించి. తనపై జరిగిన బాడీ షేమింగ్‌పై డాక్యుమెంటరీలో స్వయంగా తానే చెప్పుకున్నారు నయనతార. గజిని సినిమా రిలీజ్ అయ్యాక.. ‘Why is she even acting? Why is she even there in the film? She’s so fat అంటూ కొందరు కామెంట్ చేశారు. ఆ తరువాత బాడీ షేమింగ్ కామెంట్లకు బిల్లా సినిమాతో సమాధానం ఇచ్చారు నయన్. ఇక శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్ర వేస్తున్నప్పుడు వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. కోర్-కమర్షియల్ యాక్ట్రెస్.. అందులోనూ వివాదాలు ఉన్న నటి.. సీత పాత్ర చేయడమా అని అప్పట్లో చాలా కామెంట్స్ వినిపించాయి. కాని, ఆ పాత్రలో ఒదిగిపోవడమే కాదు.. ఆ సినిమా షూటింగ్ సమయంలో నిష్ఠగా ఉండడం అందరూ గమనించారు కూడా. అప్పటికే నయనతార హిందూయిజంలోకి మారారు. ఆ సినిమా సమయంలో ప్రభుదేవాతో ప్రేమలో ఉండడంతో.. అదే తన చివరి సినిమా అని కూడా ప్రకటించారు. ఏమైందో గానీ.. ఏడాదిలోనే ప్రభుదేవాతో బ్రేకప్ జరిగిపోయింది. సినీ కెరీర్ ఇక ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో.. వరుస హిట్లు కొట్టి లేడీ సూపర్‌స్టార్‌గా కొత్త అవతారం ఎత్తారు నయనతార. ఏకంగా బాలీవుడ్ వరకు ప్రస్థానం కొనసాగింది. అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ సినిమాలో షారుక్‌ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇదీ నయనతార స్టోరీ.
మరి.. ధనుష్ స్టోరీ ఏంటి? సినీ కెరీర్‌లో బోలెడన్ని వివాదాలు. ధనుష్‌ను టార్గెట్ చేసిన నిర్మాతలు, హీరోయిన్లు, సింగర్లు ఎంతోమంది ఉన్నారు. సుచీలీక్స్ తరువాత ధనుష్ లైఫ్‌లో పెద్ద డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ వివరాలతో పాటు.. 3 సెకన్ల వీడియోపై లీగల్ ఫైట్ ఎంత దూరం వెళ్లబోతోందో కూడా హాట్ టాపిక్ గా మారింది..
‘Nayanthara: Beyond The Fairy Tale’ డాక్యుమెంటరీ వివాదాన్ని కేవలం నయన్-ధనుష్‌ల గొడవ గానే చూడాలా, లేక ధనుష్ కావాలని చేస్తున్న రగడగా చూడాలా? ఈ అనుమానం ఎందుకంటే.. ధనుష్ సినీ కెరీర్‌లో ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకుంటారు గానీ షూటింగ్స్‌కు మాత్రం సహకరించరు అంటూ నిర్మాతల సంఘం పెద్ద గోలే చేసింది. ఇవే కాదు.. ధనుష్ పర్సనల్ లైఫ్‌ను డిస్టర్బ్ చేసిన సంఘటనలు కూడా జరిగాయి. ధనుష్, త్రిష ప్రైవేట్ ఫోటోలను సుచీలీక్స్ అంటూ సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టడం అప్పట్లో ఓ సెన్సేషన్. ధనుష్ తనను లైంగికంగా వేధించారని సుచిత్ర ఆరోపించడం కూడా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ‘మూను’ సినిమా షూటింగ్ సమయంలో శృతిహాసన్-ధనుష్ మధ్య రిలేషన్స్‌పైనా ఎన్నో గాసిప్స్ వినిపించాయి. ఇవన్నీ జరిగిన తరువాతే.. ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ మధ్య విభేదాలు వచ్చి విడాకులకు దారి తీసిందని చెబుతారు. ఇక.. శింబు, ధనుష్ మధ్య వ్యక్తిగత విషయాలపై కొన్ని తగాదాలు ఉన్నాయని చెబుతుంటారు. వీరిద్దరి మధ్య గొడవలో ఐశ్వర్య రజినీకాంత్ కూడా ఉన్నారనేది అప్పట్లో వచ్చిన వార్తలు. జల్లికట్టు అనేది తమిళనాడు సంస్కృతిలో భాగం. సుప్రీంకోర్టులో వాదించి మరీ జల్లికట్టుకు పర్మిషన్ తెచ్చుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కాని, ధనుష్ మాత్రం పెటాకు మద్దతుగా నిలిచారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ధనుష్ తమ కుమారుడేనంటూ మధురై దంపతులు పోరాటం చేయడం మరో ఎత్తు. ధనుష్ అసలైన తల్లిదండ్రులం తామేనంటూ కొన్ని ఫొటోలు చూపించడం పెద్ద దుమారమే రేపింది అప్పట్లో. సో, ధనుష్ సినీ జీవితం కొంత వివాదాలమయం అనొచ్చేమో. ఇప్పుడు కేవలం మూడు సెకన్ల వీడియోపై ఇంతగా పట్టుబట్టడంపైనా విమర్శలు వస్తున్నాయి. నయనతార అడగ్గానే.. హీరోలు, దర్శకులు, నిర్మాతలు సహకరించారు. తమ సినిమాల్లోని క్లిప్స్ ఉపయోగించుకోడానికి అనుమతి ఇచ్చారు. కాని, ఒక్క ధనుష్ మాత్రమే పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. అయినా.. 3 సెకన్ల వీడియోకి 10 కోట్లు అడగడం భావ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ధనుష్ అభ్యంతరం చెప్పడంతో.. నానుమ్ రౌడీతాన్ సినిమా క్లిప్ కాకుండా వేరే విజువల్స్ వాడుకున్నారు. అయినా సరే.. ధనుష్ ఊరుకోలేదు. అవి మూవీ సీన్స్ కాకపోయినా.. వాటిని కూడా డాక్యుమెంటరీలో ఉపయోగించుకోడానికి వీల్లేదంటూ కఠినంగానే ముందుకెళ్లారు. అందుకే, నయనతారను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు కొందరు హీరోయిన్లు.
జీవితం అన్నాక వివాదాలు కామన్. అందులోనూ సినీ సెలబ్రిటీలు వాళ్లు. ఆ విషయం వదిలేసి.. ఇకపై ఈ వివాదం ఏ మలుపు తిరగబోతోందో చూద్దాం. నయనతార డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ తాన్ మూవీ విజువల్స్ ఉపయోగించుకున్నందుకు.. పరిహారంగా 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు హీరో ధనుష్. అంతటితో ఆగకుండా.. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ లావాదేవీలు చూసుకునే ‘లాస్ గాటోస్ ప్రొడక్షన్’పై దావా వేసేలా అనుమతి ఇవ్వాలని మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది ధనుష్ కంపెనీ. వాదనలు విన్న హైకోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. సో, మళ్లీ విచారణ తేదీ వచ్చే లోపు, అంటే డిసెంబర్ 2వ తేదీలోపు నయనతార ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే.. ఈ పిటిషన్ నిలబడదు అనేది నయనతార తరపున లాయర్ వాదన. డాక్యుమెంటరీలో ఉపయోగించిన మూవీ క్లిప్స్ సినిమాలోని కావనే వర్షన్ వినిపిస్తున్నారు. ఆ విజువల్స్ BTSకు సంబంధించినవి అంటున్నారు. BTS అంటే బిహైండ్ ద సీన్స్. అంటే.. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ లోకేషన్‌లో జరిగే సన్నివేశాలన్నమాట. అవి వ్యక్తిగత లైబ్రరీలో భాగం అని వాదిస్తున్నారు నయనతార న్యాయవాది. సో, ఇది ఉల్లంఘన కిందకు రాదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాని, చట్టంలో మరోలా ఉందంటున్నారు న్యాయ నిపుణులు. కాపీరైట్ చట్టం-1957 ప్రకారం.. సినిమా షూటింగ్ సమయంలో తీసిన వీడియోలపై కూడా నిర్మాతలకే పూర్తి హక్కులు ఉంటాయి. సో, నానుమ్ రౌడీ తాన్ సినిమాకి సంబంధించిన ఏ విజువల్ అయినా.. దానిపై హక్కులు ధనుష్‌కే ఉంటాయంటున్నారు. కాకపోతే.. ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. సాంగ్స్ లేదా విజువల్స్‌ని 30 సెకన్ల వరకు ఉపయోగించుకునేందుకు కాపీరైట్ చట్టంలో మినహాయింపులు ఉంటాయంటున్నారు. మినహాయింపులు ఉన్న మాట వాస్తవమే అయినా.. ఆ 30 సెకన్ల విజువల్స్‌ను కూడా కమర్షియల్ పర్పస్ కోసం ఉపయోగించుకోకూడదు. నయనతార డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనేసింది. సో, కంప్లీట్‌గా ఆ డాక్యుమెంటరీ కమర్షియల్‌గా వాడుకుంటున్నట్టే లెక్క. ఓవరాల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నయనతార లీగల్‌గా ఇరుక్కుపోయినట్టేనంటున్నారు న్యాయనిపుణులు. ఆ 3 సెకన్ల వీడియోను నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసేయడమో లేదా 10 కోట్ల రూపాయలు చెల్లించడమో.. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాల్సందేనంటున్నారు.
అయితే.. ఈ వివాదం ఇంత పెద్దగా అవడానికి కారణం.. కచ్చితంగా నయన్-విఘ్నేష్‌లే అనే చర్చ జరుగుతోంది. నానుమ్ రౌడీ తాన్ మూవీలో విజువల్స్ ఉపయోగించుకోవడం కోసం దాదాపు రెండేళ్లుగా వెయిట్ చేస్తూ వచ్చారు నయనతార. నిజానికి.. ధనుష్ కూడా ఓవైపు విడాకుల విషయంలో, మరోవైపు కమిట్‌మెంట్ ఇచ్చిన సినిమాల విషయంలో బిజీగా ఉంటూ వచ్చారు. ఆ విషయం అర్థం చేసుకోకుండా.. నయనతార తొందరపడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల పాటు అడుగుతున్నా మూవీ క్లిప్ ఇవ్వడానికి ఇష్టపడలేదంటే.. ఇక ఇవ్వనట్టే అర్థం. నయనతార ఆ విషయాన్ని అలా వదిలేసి ఉంటే బాగుండేదంటున్నారు. అలా చేయకుండా ఓపెన్ లెటర్లు రాసి, ‘చూశారా.. ధనుష్ ఎలా వ్యవహరిస్తున్నారో’ అంటూ రచ్చ చేయడం అవసరమా అనేది కొందరు సినీప్రముఖుల వర్షన్. అంతేకాదు, విఘ్నేష్ కూడా ధనుష్‌కు ఆగ్రహం కలిగించేలానే ప్రవర్తించారని చెప్పుకుంటున్నారు.
నయన్ పోస్ట్ వైరల్
ఈ క్రమంలోనే.. తాజాగా తన ఇన్ స్టాలో నయన్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆమె ధనుష్ ను టార్గెట్ చేసి మరీ ఇలాంటి పోస్ట్ చేసిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘అబద్ధాలతో ఎదుటివారి జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు సైతం అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.. కర్మ సిద్ధాంతం.. అంటూ ఓ నోట్ షేర్ చేసింది. అయితే నయన్ ఎవరి గురించి ప్రస్తావించకుండానే ఈ పోస్ట్ చేసింది. దీంతో ఆమె ఈ పోస్ట్ ధనుష్ ను ఉద్దేశిస్తూ చేసిందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది.
అయితే.. నయన్-ధనుష్ మధ్య నడుస్తున్న గొడవను ఆపాల్సిందిపోయి.. మరింత రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ఓ క్లిప్‌ను పోస్ట్ చేశారు. 10 కోట్ల విలువైన క్లిప్‌ను ఉచితంగా చూసేయండి అంటూ సుమారు 15 సెకన్ల వీడియోను విఘ్నేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇవన్నీ చూశాక.. నెట్‌ఫ్లిక్స్‌పై కూడా ధనుష్ లీగల్ ఫైట్‌కు దిగారంటున్నారు. ఫైనల్‌గా.. ఈ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. చూసీచూడనట్టు వెళ్లిపోవాలనుకుంటే.. ధనుష్ పది కోట్లు అడిగేవారే కాదు, విషయం కోర్టు వరకు వెళ్లేదే కాదు. సో, ఈ వివాదానికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.
మరిన్ని ప్రీమియం వార్తల కోసం క్లిక్ చేయండి..