Sundarakanda Movie Review: సుందరకాండ మూవీ రివ్యూ.. వినాయక చవితి పండక్కి నారా రోహిత్ సందడి..
భైరవం సినిమాతో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్.. తాజాగా సుందరకాండ అంటూ మరోసారి వచ్చాడు. ఈసారి కొంచెం కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో శ్రీదేవి విజయ్ కుమార్ కథానాయికగా రీఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూ చూసి తెలుసుకుందాం..

మూవీ రివ్యూ: సుందరకాండ
నటీనటులు: నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వాఘని, నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అభినవ్ గోమటం మరియు ఇతరులు
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: ప్రదీష్ ఎం వర్మ
ఎడిటర్: రోహన్ చిల్లాలే
దర్శకుడు: వెంకటేష్ నిమ్మలపూడి
నిర్మాతలు: సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళీ
భైరవం సినిమాతో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్.. తాజాగా సుందరకాండ అంటూ మరోసారి వచ్చాడు. ఈసారి కొంచెం కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది పూర్తి రివ్యూ చూసి తెలుసుకుందాం..
కథ:
సిద్ధార్థ్ (నారా రోహిత్) కు వయసు 35 దాటిన తర్వాత కూడా పెళ్లి కాదు. ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా తనకు అమ్మాయిలో 5 క్వాలిటీస్ కావాలని పట్టుబడతాడు. దానికి కారణం చిన్నప్పుడు స్కూల్లో ఒక అమ్మాయిని ప్రేమించడం. ఆమెలో ఉన్న లక్షణాలు ఇంకో అమ్మాయిలో ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. అదే సమయంలో సిద్ధార్థ జీవితంలోకి ఆయన కోరుకున్న లక్షణాలతో ఐరా (వ్రితి వఘని) వస్తుంది. ఆమెను చూసి ప్రేమిస్తాడు.. పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటాడు. అదే సమయంలో తాను ప్రేమించిన ఐరాకు.. చిన్నప్పుడు తన స్కూల్లో ప్రేమించిన వైష్ణవి (శ్రీదేవి) తో ఒక రిలేషన్ ఉందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి..
కథనం:
పెద్ద సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాల్లోనే అప్పుడప్పుడు మంచి మంచి బోల్డ్ కాన్సెప్టులు వస్తున్నాయి. అవి రాసుకునేటప్పుడు బాగానే ఉంటాయి కానీ స్క్రీన్ మీద తీసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి. బోల్డ్, వల్గర్.. ఈ రెండు జోనర్స్ మధ్య చిన్న లైన్ ఒకటి ఉంటుంది. ఏ మాత్రం గీతకు అటువైపు వెళ్లిన సినిమా మొత్తం పాడైపోతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు దర్శకుడు వెంకటేష్. సుందరకాండ కోసం ఆయన తీసుకున్నది కచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్.. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ చాలా వరకు తీసుకున్నాడు వెంకటేష్. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు రాసుకున్నాడు. దాన్ని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడ అది వర్కౌట్ అయింది.. ఫస్టాఫ్ అంతా సరదాగా అలా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించదగ్గదే అయినా బాగుంది. అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా ఉంటే బాగుండేది.. ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత కూడా కథను వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ క్రమంలోనే కొన్ని సన్నివేశాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. కథ దారి తప్పుతున్న ప్రతిసారి తన కామెడీతో నిలబెట్టాడు సత్య. నారా రోహిత్ చెప్పింది నిజమే.. ఈ సినిమా వల్ల సత్యకు పెద్దగా యూజ్ ఉండదు కానీ సత్య వల్ల సినిమాకు చాలా యూజ్ ఉంది. సినిమా అంతా వన్ లైనర్స్ తో నవ్వించాడు. ఓవరాల్ గా చూసుకుంటే సుందరకాండ బాగానే మెప్పిస్తుంది.
నటీనటులు:
నారా రోహిత్ ఇలాంటి కథ ఓకే చేయడం నిజంగానే గొప్ప విషయం. మామూలుగా అయితే హీరోలు వయసుకు సంబంధించిన కథలు చేయడానికి కాస్త మొహమాటపడుతుంటారు. కానీ రోహిత్ మాత్రం చాలా బాగా నటించాడు. విర్తి వర్గాని బాగా నటించింది. సీనియర్ నటి శ్రీదేవి కూడా బాగానే ఉంది. వీళ్ళిద్దరి తర్వాత కమెడియన్ సత్య మార్కులు మొత్తం కొట్టేసాడు. మనోడు సినిమా అంతా నవ్విస్తూనే ఉన్నాడు. అభినయ్ గోమటం కూడా పర్లేదు. సీనియర్ నరేష్ కూడా అక్కడక్కడ బాగానే పంచులు పేల్చాడు. వాళ్ళ అమ్మ కొరియన్ సిరీస్ చూస్తూ బాగా నవ్వించింది. మిగిలిన పాత్రలు ఓకే..
టెక్నికల్ టీమ్:
లియోన్ జేమ్స్ సంగీతం బాగుంది.. పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రదీష్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.. రోహన్ చిల్లాలే ఎడిటింగ్ పర్లేదు. సెకండాఫ్ ఇంకాస్త షార్ప్ గా ఉండుంటే బాగుండేది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు తీసుకున్న కథ అలా ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు.
పంచ్ లైన్:
ఓవరాల్ గా సుందరకాండ.. కథ మొత్తం సుందరం కాదు కానీ పర్లేదు..!








