Sreekaram Movie Review: రైతుగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు.? ‘శ్రీకారం’ ఎలా ఉందంటే..!

Sreekaram Movie Review: ఓవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ని మరోవైపు యూత్‌ని ఆకట్టుకునే సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచుకున్నాడు నటుడు శర్వానంద్‌. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ, సహజ నటనకు కేరాఫ్‌గా...

  • Narender Vaitla
  • Publish Date - 2:47 pm, Thu, 11 March 21
Sreekaram Movie Review: రైతుగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఏ మేరకు ఆకట్టుకున్నాడు.? 'శ్రీకారం' ఎలా ఉందంటే..!

Sreekaram Movie Review: ఓవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ని మరోవైపు యూత్‌ని ఆకట్టుకునే సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచుకున్నాడు నటుడు శర్వానంద్‌. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ, సహజ నటనకు కేరాఫ్‌గా మారాడు శర్వానంద్‌. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శర్వా.. 2018లో వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ చిత్రం తర్వాత ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘రణరంగం’, ‘జాను’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్న శర్వానంద్‌.. ‘శ్రీకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివరాత్రి పురస్కరించుకొని ‘శ్రీకారం’ చిత్రం మార్చి 11న విడుదలైంది. మరి ‘శ్రీకారం’తో శర్వానంద్‌ ఆడియన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకున్నాడు.? వరుస పరాజయాలకు ఈ సినిమాతో చెక్‌ పెట్టాడా.? లేదా అన్న వివరాలు రివ్యూలో చూద్దాం..

అనంతరాజపురం అనే గ్రామానికి చెందిన కార్తీక్‌ (శర్వానంద్‌) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుంటాడు. తనదైన ప్రతిభతో ఉద్యోగంలో బాగా రాణిస్తూ అందరి ప్రశంసలు పొందుతుంటాడు. ఈ క్రమంలోనే ఉద్యోగరీత్యా కార్తీక్‌కు అమెరికా వెళ్లడానికి ఆన్‌సైట్‌ ఆఫర్‌ వస్తుంది. కానీ కార్తీక్‌ మాత్రం అమెరికా అవకాశాన్ని వదులుకొని సొంతూరుకి వెళ్లి వ్యవసాయం చేసుకోవాలని ఫిక్స్‌ అవుతాడు. ఇక కార్తీక్‌ ఊర్లోకి వెళ్లే సమయానికి.. గ్రామంలో కొంత మంది వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.. అదొక దండగా అన్న అభిప్రాయంతో ఉంటారు. అలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతూ కార్తీక్‌ వారితో కలిసి వ్యవసాయాన్ని మొదలు పెడతాడు. రూ. లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలిపెట్టి కార్తీక్‌ అసలు వ్యవసాయం ఎందుకు చేస్తాడు..? వ్యవసాయం దండగా అనే భావనలో ఉన్న రైతులను కార్తీక్‌ ఎలా మార్చాడు.? అసలు ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి.? వ్యవసాయం లాభ సాటిగా మార్చడానికి కార్తీక్‌ ఎలాంటి పద్ధతులను ఉపయోగించాడు లాంటి విశేషాలు వెండి తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

దేశంలో ఎక్కువ మంది ఆధారపడి జీవించే రంగాల్లో వ్యవసాయం మొదటి స్థానంలో ఉంటుంది. అందులోనూ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ వ్యవసాయంపై ఆధారపడాల్సిందే.. అలాంటి వ్యవసాయ రంగంలో ఎందుకు నష్టాలు వస్తుంటాయి. రైతులు పడే కష్టానికి తగిన ఫలితం ఎందుకు లభించదు.? డాక్డర్‌ తన కొడుకును డాక్టర్‌ చేయాలనుకుంటాడు, ఇంజనీర్‌ తన కొడుకును ఇంజనీర్‌ చేయాలనుకుంటాడు. కానీ రైతు తన కొడుకును ఎందుకు రైతును చేయాలనుకోడు.? ఇలాంటి ప్రశ్నలకు ఈ సినిమాలో దర్శకుడు సమాధానం రాబట్టే ప్రయత్నం చేశాడు. రైతులు పడే కష్టాలను వాస్తవానికి దగ్గరగ చూపించాడు. ఇదిలా ఉంటే రైతు నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు రావడంతో ఈ సినిమా తెలిసిన కథే కదా.. అన్న భావన ప్రేక్షకుల్లో ఏర్పడుతుంది. అలాగే.. సినిమాలో కొన్ని సన్నివేశాలు మరీ స్లో గా సాగడంతో.. సాగదీతగా అనిపిస్తుంది.

ఎవరెలా నటించారు..

తన సహజ నటనతో ఆకట్టుకునే శర్వానంద్‌ ఇందులోనూ ఆకట్టుకున్నాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి పాత్రలో శర్వానంద్‌ ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్‌ ప్రియాంకా అరుళ్‌ కూడా చైత్ర పాత్రలో తన పాత్ర మేరకు ఆకట్టుకుంది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో హీరో తండ్రిగా నటించిన రావు రమేశ్‌ (కేశవులు) ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. నెగిటివ్‌ షేడ్స్‌లో సాయికుమార్‌ మంచి నటనను కనబరిచాడు. ఇక నరేశ్‌, ఆమని, మురళి శర్మ, సత్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా సాయి మాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అని చెప్పవచ్చు. రైతు గొప్పతనాన్ని వివరిస్తూ సాయి మాధవ్‌ రాసిన డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మొత్తం మీద కాస్త స్లో సన్నివేశాలను మినహాయిస్తే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శివరాత్రి తర్వాత వీకెండ్స్‌ కలిసి రావడంతో కలెక్షన్లు కూడా బాగానే ఉంటాయని సినిమా నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: వెండితెరపైకి మరో అలనాటి సినీయర్ హీరోయిన్ బయోపిక్.. త్వరలోనే సెట్స్ పైకి.. ఆ పాత్రలో నటించేది ఎవరంటే..

బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రభాస్ మల్టీస్టారర్.. బీటౌన్ డైరెక్టర్ కసరత్తులు.. పండగ చేసుకుంటున్న అభిమానులు..

మహాశివరాత్రి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన వెంకీ.. నయా యంగ్ లుక్కులో అదరగోడుతున్న ‘నారప్ప’..