Telangana: ఛీ.. వ్యాక్ ఏంటీ దుర్గందం.. మీరు లొట్టలేసుకొని తినే చికెన్, మటన్ చూడండి ఎలా ఉందో!
చికెన్ అంటే లొట్టలేస్తున్నారా..! మటన్ అంటే మైమరిచిపోతున్నారా? వాటికి మసాలా యాడ్ చేసి మస్తీ చేస్తున్నారా..? అయితే బీ కేర్ ఫుల్. కొంతమంది వ్యాపారులు కాసుల కక్కుర్తితో.. నీచంగా మారిపోతున్నారు. ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదు..తమకు నాలుగు డబ్బులు వస్తే చాలని ఆలోచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల వెలుగుచూసిన ఈ కల్తీ దందాలు జనాల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నాన్ వెజ్ కొనాలంటేనే వణికిపోయే పరిస్థితులు తెస్తున్నాయి

హైదరాబాద్‌లో రోజురోజుకు కల్తీదందా పెరిగిపోతుంది. ధనార్జనే లక్ష్యంగా కొందరు దారుణమైన దందాకు తెరలేపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ.. నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను విక్రయిస్తున్న ముషీరాబాద్‌లోని ఒక చికెన్ సెంటర్‌పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్‌ను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. తనిఖీ సమయంలో 610 కిలోల కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చికెన్‌షాప్‌లో నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఎలుకలు, పిల్లులు తిరుగుతుండడంతో ఆ మాంసం పూర్తిగా కలుషితమైపోయింది. అయినా కూడా ఆ మాంసాన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నాడు షాపు నిర్వాహకుడు. చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. ఇలాంటి వ్యాపారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
సికింద్రాబాద్ పార్సీ గుట్టలోని A1 ఫ్రెష్ చికెన్ షాప్‌పై GHMC అధికారులతో కలిసి దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. 800 కేజీల కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చాలా రోజుల నుంచి నిల్వ చేసిన చికెన్‌ను..బార్లు,రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. A1 ఫ్రెష్ చికెన్ షాప్ లైసెన్స్ గత జనవరిలోనే అయిపోయినట్టు గుర్తించారు పోలీసులు. షాపు నిర్వాహకుడితో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
చికెన్, మటనే కాదు..కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు దుర్మార్గులు. లేటెస్ట్‌గా ఖైరతాబాద్‌లో కల్తీ అల్లం పేస్ట్ దందాను బట్టబయలు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. గుట్టు చప్పుకుండా కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తోన్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..వారినుండి భారీగా కల్తీ అల్లం పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో హానికర ఎసిటిక్ యాసిడ్ కలుపుతున్నారు. కుళ్లిపోయిన, పనికిరాని పదార్ధాలతో పేస్ట్ తయారు చేసి దాన్ని ‘A1 సహారా’ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. సహారా ఫుడ్స్ యజమాని అబ్దుల్లాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
