Alphonse Puthren: ‘నేను మీ బానిసను కాదు.. నన్ను తిట్టే హక్కు ప్రేక్షకులకు లేదు’.. ప్రేమమ్ డైరెక్టర్ సీరియస్..
తనపై వస్తున్న నెగిటివిటీ గురించి ఫేస్ బుక్ వేదికగా స్పందిస్తూ.. తన ప్రోఫైల్ పిక్ తీసేశారు. నన్ను విమర్శించే హక్కు ఆడియన్స్ కు లేదని.. నేనేమి మీ బానిసను కాదంటూ గట్టిగానే సీరియస్ అయ్యారు.
ప్రేమమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయనకు స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది. ఇక చాలా గ్యాప్ తర్వాత ఇటీవల గోల్డ్ చిత్రాన్ని తెరకెక్కించారు అల్ఫోన్స్. ఇందులో నయనతార, పృథ్వీరాజ్, సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో డైరెక్టర్ అల్ఫోన్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు.. ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో దర్శకుడి గురించి దారుణంగా కామెంట్స్ చేశారు. అయితే తనపై వస్తున్న విమర్శలపై కాస్త ఘాటుగానే స్పందించారు డైరెక్టర్ అల్ఫోన్స్. తనపై వస్తున్న నెగిటివిటీ గురించి ఫేస్ బుక్ వేదికగా స్పందిస్తూ.. తన ప్రోఫైల్ పిక్ తీసేశారు. నన్ను విమర్శించే హక్కు ఆడియన్స్ కు లేదని.. నేనేమి మీ బానిసను కాదంటూ గట్టిగానే సీరియస్ అయ్యారు.
” మీ సంతృప్తి కోసం నన్ను ట్రోల్స్ చేస్తూ.. నా గురించి.. నా సినిమా గోల్డ్ గురించి నెగిటివ్ గా మాట్లాడితే మీకు నచ్చుతుంది. నాకు కాదు. అందుకే ఇంటర్నెట్‌లో ముఖం చూపకుండా నిరసన తెలుపుతున్నాను. నేను మీ బానిసను కాదు.. లేదా నన్ను ఆటపట్టించడానికి.. లేదా ఇలా బహిరంగంగా తిట్టడానికి నేను మీకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. మీకు నచ్చితేనే నా సినిమాలు చూడండి. అంతేకానీ నా పేజీకి వచ్చి మీ కోపాన్ని చూపించకండి. మీరు ఇలా చేస్తుంటే నేను సోషల్ మీడియాలో కనిపించకుండా ఉంటాను. నేను ఒకప్పటిలా కాదు.. ఇప్పుడు నా భాగస్వామి, నా పిల్లలు.. నా గురించి నిజంగా శ్రద్ధ చూపించే వ్యక్తులు ఉన్నారు. నేను పడిపోయినప్పుడు మీరు నవ్వుతున్నారు. నేను ఎప్పటికీ ఈ విషయాన్ని మర్చిపోలేను. కావాలని ఎవరూ సినిమా డిజాస్టర్ కావాలని కోరుకోరు. కొన్నిసార్లు అలా జరుగుతుంది. నేనెప్పుడు నిజాయితిగా ఉంటాను. అదే నా స్వభావం. నన్ను కామెంట్ చేసే.. విమర్శించే హక్కు ఉన్న ఏకైక వ్యక్తి కేవలం కమల్ హాసన్ మాత్రమే. ” అంటూ రాసుకోచ్చారు.
అయితే అల్ఫోస్ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. నీ సినిమాలు కేవలం కమల్ హాసన్ కు మాత్రమే చూపించుకో అంటూ వ్యంగ్యంగా రాసుకోస్తున్నారు. దీంతో మరోసారి అల్ఫోన్స్ చేసిన పోస్ట్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.