25 Years of Journey: మిస్ వరల్డ్ నుంచి గ్లోబల్ స్టార్.. టాలీవుడ్ టు హాలీవుడ్.. ఓ హీరోయిన్ అద్భుత ప్రయాణం!
నవంబర్ 30, 2000.. లండన్‌లోని మిలేనియం డోమ్‌లో లైట్లు మెరిస్తున్నాయి. 18 ఏళ్ల బరేలీ అమ్మాయి ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం తలపై పెట్టుకుని నవ్వుతోంది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు.. ఈ కిరీటం ఆమె జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందని. భారత్‌కు ఐదో మిస్ ..

నవంబర్ 30, 2000.. లండన్‌లోని మిలేనియం డోమ్‌లో లైట్లు మెరిస్తున్నాయి. 18 ఏళ్ల బరేలీ అమ్మాయి ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ కిరీటం తలపై పెట్టుకుని నవ్వుతోంది. ఆ క్షణంలో ఆమెకు తెలియదు.. ఈ కిరీటం ఆమె జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందని. భారత్‌కు ఐదో మిస్ వరల్డ్‌గా చరిత్ర సృష్టించిన ఆ రోజు నుంచి ఇవాళ్టికి 25 సంవత్సరాలు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ రెండింట్లోనూ టాప్ స్టార్, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, బిజినెస్‌వుమన్.. ప్రియాంక చోప్రా జోనాస్ ఒక బ్రాండ్!
అంత సులభం కాదు..
తొలి సినిమా సెట్‌లో ప్రియాంక ఏడ్చింది. అవును, మిస్ వరల్డ్ అయిన అమ్మాయి మేకప్ రూమ్‌లో అద్దంలో తనను తాను గుర్తుపట్టలేక, ‘నేను ఇలా కనిపిస్తే ఎలా నటిస్తాను?’ అని కన్నీళ్లు పెట్టింది. ఆ రోజు ఆమెకు డైలాగ్‌లు గుర్తులేవు, కెమెరా ఎదురుగా నిలబడటం ఇష్టం లేదు. కానీ ఆ ఏడుపే ఆమెను నిజమైన నటిగా మలిచింది. 2002లో తమిళ సినిమా ‘తమిజాన్’తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
2003లో ‘ది హీరో’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి రోజుల్లో విమర్శకులు ‘గ్లామర్ డాల్ మాత్రమే’ అన్నారు. కానీ ‘ఫ్యాషన్’, ‘మేరీ కామ్’, ‘బాజీరావ్ మస్తానీ’ వంటి సినిమాలతో తన నటనా ప్రతిభను రుజువు చేసుకుంది ప్రియాంక. నేషనల్ అవార్డు, పద్మశ్రీ, 50కి పైగా సినిమాలు.. ప్రియాంకని గ్లోబల్ ఐకాన్‌గా మార్చాయి.

Priyanka Chopra In Miss World Crown
‘క్వాంటికో’ సిరీస్‌తో అమెరికా టెలివిజన్‌లో మొదటి భారతీయ మహిళా లీడ్‌గా రికార్డు సృష్టించింది. ‘బే వాచ్’, ‘మ్యాట్రిక్స్ రిజరెక్షన్స్’ వంటి హాలీవుడ్ సినిమాలు, నిక్ జోనాస్‌తో వివాహం, కూతురు మాల్తీ మేరీ.. ప్రియాంక ఇప్పుడు నిజంగా గ్లోబల్ సిటిజన్. ‘నేను ఇప్పటికీ ఆ 18 ఏళ్ల అమ్మాయినే. కానీ ఇప్పుడు ఆమెలో ధైర్యం ఎక్కువైంది, కలలు పెద్దవయ్యాయి.’ అంటోంది ప్రియాంక.
ఒక మిస్ వరల్డ్ కిరీటం మాత్రమే కాదు.. ధైర్యం, పట్టుదల, ఆత్మ విశ్వాసం, నమ్మకం.. అన్నింటికీ 25 ఏళ్ల నిలువెత్తు సాక్ష్యం ప్రియాంకా చోప్రా జోనాస్! త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాలో మహేష్ బాబు సరసన తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్న ప్రియాంక తెలుగు ప్రేక్షకుల మదిలోనూ స్థానం సంపాదించుకోవాలని మనమూ కోరుకుందాం!




