రాజధాని రగడ.. ఏపీ ప్రభుత్వంపై దర్శకుడి విమర్శలు

ఏపీలో రాజధాని ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ అక్కడి ప్రాంత ప్రజలు 27 రోజులుగా తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై పలువురు విమర్శలు కురిపిస్తుండగా.. తాజాగా సినీ ప్రముఖులు కూడా రాజధాని రగడపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజధానిని మార్చడం మంచిది కాదని ఆయన మండిపడ్డారు. రాజధానిపై మాట్లాడని […]

రాజధాని రగడ.. ఏపీ ప్రభుత్వంపై దర్శకుడి విమర్శలు
Follow us

| Edited By:

Updated on: Jan 13, 2020 | 5:03 PM

ఏపీలో రాజధాని ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ అక్కడి ప్రాంత ప్రజలు 27 రోజులుగా తమ నిరసనను తెలుపుతున్నారు. ఈ క్రమంలో అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై పలువురు విమర్శలు కురిపిస్తుండగా.. తాజాగా సినీ ప్రముఖులు కూడా రాజధాని రగడపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజధానిని మార్చడం మంచిది కాదని ఆయన మండిపడ్డారు. రాజధానిపై మాట్లాడని హీరో, దర్శకుల సినిమాలు చూడకండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు సతీష్ వేగేశ్న అమరావతి పరిస్థితులపై స్పందించారు.

ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సతీష్.. ‘‘అమరావతి ప్రాంత రైతుల భార్యలు గతంలో ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ ఇప్పుడు తమకు జరుగుతున్న అన్యాయంపై బయటకు వస్తున్నారు. రాజధాని కోసం తమ భూములను ఇవ్వడం వారి తప్పా..?’’ అని ప్రశ్నించారు. అంతేకాదు ఆందోళన చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటూ కొంతమంది చేసిన కామెంట్లపై ఆయన ఘాటుగా స్పందించారు. పెయిడ్ ఉద్యమం అయితే కొద్ది రోజుల్లోనే అది ముగిసేదని.. కానీ ఈ ఉద్యమ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. రైతులు ప్రకృతి వారసులని.. మనం ప్రకృతికి ఏదైనా ఇబ్బంది తలపెట్టాలని చూస్తే అది ఎలా విరుచుకుపడుతుందో.. రైతులు కూడా తమ జోలికి వస్తే అలానే విజృంభిస్తారని ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అయితే కల్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ‘ఎంత మంచివాడవురా’ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.