Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Elections 2023: టార్గెట్ 150.. కర్నాటకలో 4 దశాబ్ధాల ఆనవాయితీని బీజేపీ బ్రేక్ చేస్తుందా?

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ఈసీ విడుదల చేయడంతో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి తమదే గెలుపని బీజేపీ ధీమా వ్యక్తంచేస్తుండగా... కర్నాటక ప్రజలు తమను గెలిపించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ అంటోంది.

Karnataka Elections 2023: టార్గెట్ 150.. కర్నాటకలో 4 దశాబ్ధాల ఆనవాయితీని బీజేపీ బ్రేక్ చేస్తుందా?
Karnataka Elections 2023Image Credit source: TV9 Telugu
Follow us
Janardhan Veluru

|

Updated on: Apr 04, 2023 | 12:49 PM

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ఈసీ విడుదల చేయడంతో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మరోసారి తమదే గెలుపని బీజేపీ ధీమా వ్యక్తంచేస్తుండగా… కర్నాటక ప్రజలు తమను గెలిపించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్‌ అంటోంది. అటు కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ కూడా కింగ్ మేకర్‌గా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది. మరి మే 10తేదీన జరిగే ఓటింగ్‌లో కన్నడీకులు ఎవరికి పట్టం కట్టబోతారన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. 2024 సార్వాత్రిక ఎన్నికలపై కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. ఈ ఎన్నికలను అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

కర్నాటకలో గత 40 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. చివరగా 1985లో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జేడీఎస్ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లు మాత్రమే ఆయా పార్టీలకు ప్రజలు అధికారం ఇస్తున్నారు. అయితే ఈ సారి మళ్లీ విజయం సాధించి.. 40 ఏళ్ల ఆనవాయితీకి బ్రేక్ వేయిస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. దక్షిణాదిలో ఇప్పటి వరకు బీజేపీ కర్నాటకలో మాత్రమే అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండోసారి అక్కడ అధికారంలోకి వచ్చి చారిత్రక విజయం నమోదు చేయాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. 150 అసెంబ్లీ స్థానాల్లో విజయంతో పూర్తి మెజార్టీ సాధించేలా ఆ పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. కాంగ్రెస్, జేడీఎస్ చేతలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాుట చేశాయి. ఈ సారి అలాంటి చేదు అనుభవం ఎదురుకాకుండా పూర్తి మెజార్టీ సాధించడమే లక్ష్యమని బీజేపీ నేతలు చెబుతున్నారు.

కర్నాటక ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమా..

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ కర్నాటకలో ఇప్పటికే సుడిగాలి ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీజేపీని గెలిపించాలని కోరారు. అటు అమిత్‌షా , నడ్డా కూడా జోరుగా అక్కడ పర్యటిస్తున్నారు. కర్నాటకలో 40 శాతం జనాభా ఉన్న లింగాయత్‌ , వొక్కలిగ సామాజిక వర్గాలు తమ వైపే ఉంటాయని బీజేపీ నమ్మకంతో ఉంది. కొద్దిరోజుల క్రితమే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి, లింగాయత్‌ , వొక్కలిక సామాజిక వర్గాలకు రెండు శాతం చొప్పున రిజర్వేషన్లను పెంచింది బీజేపీ సర్కార్‌. ఎన్నికల్లో ఇది బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆ రాష్ట్ర మొత్తం జనాభాలో లింగాయత్‌లు 17 శాతం, వొక్కలికలు 15 శాతం, ఓబీసీలు 35శాతం, ఎస్సీ, ఎస్టీలు 18 శాతం, ముస్లీంలు 12.92 శాతం, బ్రాహ్మణులు 3 శాతం ఉన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని సీఎం బస్వరాజ్‌ బొమ్మై పూర్తి ధీమాతో ఉన్నారు. మే 13వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని, తమ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభిస్తుందని ఆయన అన్నారు. ఈ విజయంతో కర్నాటకలో కొత్తశకం ప్రారంభమవుతుందన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేసిన ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప.. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 40 శాతం కమిషన్లు తీసుకుంటున్నట్లు బీజేపీపై అవినీతి పార్టీ కాంగ్రెస్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కర్నాటకలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.

కమీషన్ల సర్కార్‌కు గుణపాఠం తప్పదన్న కాంగ్రెస్‌..

అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ అవినీతి పాలనపై కర్నాటక ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు కర్నాటక పీసీసీ ప్రెసిడెంట్‌ డీకే శివకుమార్‌. 40 శాతం కమీషన్లతో పనిచేస్తున్న సర్కార్‌కు గుణపాఠం చెబుతూ.. కర్ణాటక ప్రజలు చారిత్రక తీర్పును ఇవ్వబోతున్నారని అన్నారు. తమకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని, సొంతంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ సర్కారు తప్పకుండా న్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికే 124 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ… ఇవాళ (ఆగస్టు 4) మిగిలిన 100 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. టిక్కెట్ తమకే కావాలంటూ ఆశావహుల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. ఎన్నికలకు ముందు బీజేపీ, జేడీఎస్‌కు చెందిన నేతలను పార్టీలో చేర్చుకుని.. టిక్కెట్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావహులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఏప్రిల్ 9న కోలార్‌లో రాహుల్ మెగా ర్యాలీ..

కర్నాటకలో రాహుల్‌గాంధీ విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 9న కోలార్‌లో జై భారత్ పేరుతో జరిగే మెగా ర్యాలీలో రాహుల్‌ పాల్గొంటారు. కోలార్‌లో మోదీ సామాజిక వర్గంపై 2019లో ఏ గ్రౌండ్‌లో అయితే రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు అనర్హత వేటు పడిందో అక్కడే రాహుల్‌ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్నాటకలో పర్యటించనున్నారు.

అయితే రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని..ఆ రెండు పార్టీలను కర్నాటక ప్రజలు వచ్చే ఎన్నికలు తిరస్కరిస్తారని మాజీ సీఎం కుమారస్వామి చెబుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జేడీఎస్‌కు ఉంటుందని ఆయన ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ 93 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.

ఎన్నికల బరిలో చిన్నాచితక పార్టీలు..

అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తమ అభ్యర్థులను కర్నాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుపుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 140 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఆప్ ప్రకటించింది. అవినీతిరహిత పాలన అందిస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.3000 నిరుద్యోగ భృతి, రైతులకు రుణ మాఫీ, నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన వైద్య సదపాయం తదితర హామీలు ఇస్తోంది ఆప్. గాలి జనార్థన్ రెడ్డి నేతృత్వంలో కల్యాణ్ రాజ్య ప్రగతి పార్టీ(కేఆర్పీపీ), బీఎస్పీ, ఎంఐఎం, ఎస్‌డీపీఐ తదితర పార్టీలు కూడా కొన్ని స్థానాల్లో పోటీలో నిలిచి ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు.. కీలక తేదీలు..

మొత్తం 224 స్థానాలు కలిగిన కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 29 తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆ రోజు  నుండే కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్న కర్ణాటకలో 80 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది ఈసీ. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ త్గగుతుండం పై ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సారి ఎన్నికల్లో అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ పెంచేందుకు కృషి చేస్తామని తెలిపింది.

కర్ణాటక ఎన్నికలకు ఈసీ ఏప్రిల్ 13న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఏప్రిల్ 20 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 21 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

ప్రస్తుత కర్ణాటక అసెంబ్లీ గడువు మే 24తో ముగియనుంది. అసెంబ్లీలో బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ కి 75, జేడీఎస్‌ కి 28 మంది సభ్యుల బలం ఉంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..